టెలికం రంగంలో జియోతో డేటా ధరలను భారీగా తగ్గించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు హెల్త్ కేర్ రంగంలో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. ప్రాణాంతక వ్యాధులను ముందే గుర్తించే జినోమిక్ పరీక్షలను సామాన్యులకు చేరువ చేయడమే లక్ష్యంగా భారీ ప్రణాళికను అమలు చేయనుంది. ప్రస్తుతం రూ.10,000 వరకు ఉన్న క్యాన్సర్ ముందస్తు స్క్రీనింగ్ పరీక్షను కేవలం రూ.1,000 లోపు ధరకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
25
జినోమిక్ టెస్టింగ్ అంటే ఏమిటి?
జినోమిక్ టెస్టింగ్ అంటే వ్యక్తి జన్యు నిర్మాణం ఆధారంగా భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలను ముందే గుర్తించే వైద్య పరీక్ష. రక్తం, లాలాజలం లేదా శరీర కణజాల నమూనాలతో ఈ పరీక్ష నిర్వహిస్తారు. క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును ముందే అంచనా వేయడం ఈ టెక్నాలజీ ప్రధాన లక్ష్యం. ఈ పరీక్షలు ఖరీదైనవి కావడంతో ఇప్పటి వరకు సంపన్న వర్గాలకే పరిమితమయ్యాయి.
35
స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ కీలక పాత్ర
రిలయన్స్ ఇండస్ట్రీస్ నాలుగేళ్ల క్రితం బెంగళూరుకు చెందిన స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ సంస్థను రూ.393 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సంస్థ ఆధునిక జినోమిక్ సైన్స్ టెక్నాలజీపై పరిశోధన చేస్తోంది. ఇప్పుడు అదే సంస్థ ద్వారా రిలయన్స్ డయాగ్నస్టిక్ సేవలను విస్తృత స్థాయిలో ప్రారంభించనుంది. తక్కువ ఖర్చుతో, వేగంగా ఫలితాలు ఇచ్చే పరీక్షలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం.
స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ అభివృద్ధి చేసిన ‘క్యాన్సర్ స్పాట్’ అనే ఏఐ ఆధారిత జినోమ్ సీక్వెన్సింగ్ మోడల్ ఇప్పటికే వైద్య రంగంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా కాలేయం, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాటిక్, రొమ్ము, ఉదర క్యాన్సర్లు సహా పది రకాల క్యాన్సర్లను ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశం ఉంటుంది. ఇది కేవలం స్క్రీనింగ్ పరీక్ష మాత్రమే. పాజిటివ్ ఫలితం వస్తే కచ్చితమైన నిర్ధారణ కోసం అదనపు పరీక్షలు అవసరం. ప్రస్తుతం ఈ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారిలో 20 నుంచి 30 శాతం మందికి క్యాన్సర్ నిర్ధారణ అవుతోంది.
55
ధరల విప్లవం వెనుక అంబానీ వ్యూహం
చౌక ధరలకే వైద్య పరీక్షలు అందించాలన్నది ముఖేశ్ అంబానీ దీర్ఘకాలిక లక్ష్యం. అందుకే ఈ ప్రాజెక్టుకు కఠినమైన టైమ్‌లైన్ పెట్టుకోలేదని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసే ఖరీదైన డయాగ్నస్టిక్ కిట్‌ల స్థానంలో స్వదేశీ టెక్నాలజీ వినియోగం, ఏఐ ఆధారిత విశ్లేషణ ద్వారా ఖర్చును భారీగా తగ్గించాలని రిలయన్స్ భావిస్తోంది. ఇది వ్యాపార నిర్ణయం మాత్రమే కాదు, ప్రజారోగ్య రంగంలో పెద్ద మార్పునకు నాంది పలికే అడుగుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.