ప్రస్తుతం దేశంలో టెలికం కంపెనీల మధ్య పోటీ పెరిగింది. జియో రాకతో రీఛార్జ్ ధరలు భారీగా తగ్గాయి. అయితే గతేడాది జియో సహా అన్ని కంపెనీలు టారిఫ్‌లను భారీగా పెంచాయి. అయితే మరోసారి యూజర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి టెలికం కంపెనీలు..
దేశవ్యాప్తంగా టెలికం కంపెనీలు మరోసారి టారిఫ్‌లను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గతేడాది ధరలు పెంచిన టెలికాం సంస్థలు, ఈ ఏడాది చివరికి మరోసారి రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. తాజా ట్రెండ్‌ను బట్టి చూస్తే 10 నుంచి 12 శాతం వరకు టారిఫ్‌ల పెంపు జరిగే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.
25
పెరిగిన యాక్టివ్ యూజర్ల సంఖ్య
మే 2025లో దేశవ్యాప్తంగా మొబైల్ యాక్టివ్ యూజర్ల సంఖ్య భారీగా పెరిగింది. కేవలం ఆ ఒక్క నెలలోనే దాదాపు 74 లక్షల మంది కొత్త సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నట్లు టెలికాం డేటా సూచిస్తోంది.
ఇందులో రిలయన్స్ జియోకే 55 లక్షల మంది కొత్త వినియోగదారులు జత కాగా, ఎయిర్‌టెల్‌కు 13 లక్షల మంది చేరారు. ఈ పెరుగుదల, కంపెనీల ఆదాయంపై ప్రభావం చూపినా, కొనసాగుతున్న పెట్టుబడుల వ్యయం కారణంగా టారిఫ్ పెంపు తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
35
ఆ ధరలు పెరిగే అవకాశం
ఈసారి బేసిక్ రీఛార్జ్ ప్లాన్లను పెంచే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. బదులుగా, మధ్య, అధిక శ్రేణికి చెందిన డేటా ప్లాన్లపై ఛార్జీలు పెంచే యోచనలో టెలికాం సంస్థలు ఉన్నట్లు తెలుస్తోంది. డేటా వినియోగం, వేగంపై ఆధారపడి ప్యాకేజీలను డిజైన్ చేయనున్నట్లు సమాచారం. దీంతో ఎక్కువ డేటా వాడే వారికి ఛార్జీల మోత తప్పదని అర్థమవుతోంది.
భవిష్యత్తులో కొన్ని రీఛార్జ్ ప్లాన్లలో డేటా పరిమితిని తగ్గించే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ కారణంగా యూజర్లు అదనంగా డేటా కొనుగోలు చేయాల్సిన అవసరం రావొచ్చు. ఇలా డేటా ప్యాక్‌ల ద్వారా కంపెనీలు ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీలు సబ్‌స్క్రిప్షన్ ఆధారంగా డేటా-అప్‌గ్రేడ్ మోడల్‌ను ప్రోత్సహించే అవకాశముంది.
55
టారిఫ్ మార్పులు తప్పవు
మొబైల్ ధరల పెంపు గురించి ఇప్పటికే టెలికాం సంస్థల అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత టారిఫ్‌లు యూజర్ అప్‌గ్రెడేషన్‌కు సరిపోవట్లేదని, అధిక నాణ్యత సేవల కోసం ఖర్చులు పెరుగుతున్నాయని ఎయిర్‌టెల్ ఎండీ గోపాల్ విట్టల్ వ్యాఖ్యానించారు.
వొడాఫోన్ ఐడియా కూడా టారిఫ్ రివిజన్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. 5జీ నెట్‌వర్క్ విస్తరణ, సాంకేతిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సంస్థలు ఛార్జీలను పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.