ఇంట్లో బంగారం ఉంటే ఆ ధీమానే వేరు. ఇప్పటికీ చాలా మంది భారతీయులు బంగారాన్ని కేవలం ఆభరణంగానే కాకుండా మంచి పెట్టుబడి మార్గంగా కూడా భావిస్తారు. క్షణాల్లో గోల్డ్ లోన్ పొందొచ్చు. అయితే తాజాగా ఆర్బీఐ గోల్డ్ లోన్ విషయంలో కీలక మార్పులు చేసింది.
ఆర్థికంగా కష్టసమయంలో వేగంగా సాయపడే మార్గాల్లో గోల్డ్ లోన్ ముందు వరుసలో ఉంటుంది. వైద్య ఖర్చులు, విద్య, వ్యాపారం, వ్యవసాయం వంటి అవసరాలకు బాగా ఉపయోగపడుతుంది. పసిడిపై ఇచ్చే రుణాలు "సెక్యూర్డ్ లోన్స్" కావడంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కూడా వీటికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.
అయితే ఇటీవలి కాలంలో గోల్డ్ లోన్‌లో కొన్ని తప్పులు వెలుగులోకి రావడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠినమైన మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
25
ఈఎంఐ రుణాలకు పరిమితి
2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం, బుల్లెట్ రీపేమెంట్ (Bullet Repayment) పద్ధతిలో తీసుకునే గోల్డ్ లోన్లకు గరిష్ఠ కాలపరిమితిని 12 నెలలకు మాత్రమే పరిమితం చేశారు. ఇక ఈఎమ్ఐ విధానంలో చెల్లించే రుణాలకు గరిష్ఠ కాలవ్యవధిని 36 నెలలుగా నిర్ణయించారు. గతంలో లాగా ఏటా రుణాన్ని రెన్యువల్ చేసుకునే అవకాశం ఇకపై ఉండదు.
35
లోన్ టు వాల్యూ (LTV) నిష్పత్తిలో మార్పులు
బ్యాంకుల ద్వారా తీసుకునే గోల్డ్ లోన్ రూ.2.5 లక్షలలోపు అయితే, తాకట్టు పెట్టిన బంగారం మార్కెట్ విలువలో 85 శాతం వరకే రుణంగా పొందే వీలుంటుంది. అయితే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), చిన్న బ్యాంకులు (Small Finance Banks) ఈ నిష్పత్తిని 88 శాతం వరకు మంజూరు చేయొచ్చు.
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే చిన్న ఆదాయం ఉన్న రుణగ్రహీతలకు, రూ.2.5 లక్షలలోపు రుణాల విషయంలో ఆదాయ ఆధారాలు లేదా క్రెడిట్ స్కోర్ చెకింగ్ అవసరం ఉండవు.
గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు తాకట్టు పెట్టే ఆభరణాల పరిమితులను కూడా ఆర్బీఐ పేర్కొంది. బంగారు నగలైతే గరిష్ఠంగా ఒక కిలో వరకు, బంగారు నాణేలు అయితే 50 గ్రాముల వరకు తాకట్టు పెట్టొచ్చు. వెండి ఆభరణాలైతే 10 కిలోల వరకూ, వెండి నాణేలైతే 500 గ్రాముల వరకూ తాకట్టు పెట్టే వీలుంది.
అంతేకాదు రుణం పూర్తిగా తిరిగి చెల్లించిన రోజే తాకట్టు ఆభరణాలు రుణ గ్రహీతకు ఇవ్వాలి. 7 రోజులు దాటి ఇస్తే రుణదాత ప్రతి రోజుకు రూ.5,000 నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. తాకట్టు ఆభరణాలు పోయినా, నష్టపోయినా పూర్తి విలువను రుణదాతే భరించాలి.
55
వేలం ప్రక్రియకు పారదర్శకత తప్పనిసరి
రుణగ్రహీత తన రుణాన్ని చెల్లించకపోతే, తాకట్టు పెట్టిన ఆభరణాలను వేలం వేయడం సాధారణ ప్రక్రియ. అయితే వేలానికి ముందు తప్పకుండా రుణదాత రాతపూర్వకంగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. వేలంలో బిడ్‌ను ఆభరణాల మార్కెట్ విలువలో కనీసం 90 శాతంగా నిర్ణయించాలి. వేలం తర్వాత మిగిలిపోయిన బంగారం లేదా వెండిని వారం రోజుల్లోపు రుణగ్రహీతకు తిరిగి అప్పగించాల్సిన బాధ్యత కూడా రుణదాతలదే.