Petrol Prices Hike: సామాన్యుల నెత్తిపై మరో పిడుగు పడింది. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ప్రజలపై ఇంధన భారం మరింత పెరిగింది. ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసర ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై మరో అదనపు భారంగా మారింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతుండటం, పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు చమురు సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మరోసారి ధరలను సవరించాయి. తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్, డీజిల్‌పై సుమారు 90 పైసల వరకు పెరిగింది.
26
వారం రోజుల్లో ధరలు పెరగడం రెండోసారి
గత వారం రోజుల్లో ఇది రెండోసారి ధరలు పెరగడం. అంతకుముందు కూడా లీటర్‌కు మూడు రూపాయలకుపైగా ధరలు పెరగడంతో వినియోగదారులు ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారు. దానికి తోడు మరోసారి ధరలు పెరగడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా ప్రతిరోజూ వాహనాలపై ఆధారపడే ఉద్యోగులు, క్యాబ్ డ్రైవర్లు, ఆటో కార్మికులు, ర్యాపిడో, ఊబర్, చిన్న వ్యాపారులపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
36
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.111
ధరలు పెంచాక దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు మరింత ఎగబాకాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.98 దాటగా, ముంబయి, చెన్నై, కోల్‌కతా నగరాల్లో రూ.104 నుంచి రూ.109 మధ్య కొనసాగుతోంది. అదే విధంగా డీజిల్ ధరలు కూడా పలు నగరాల్లో రూ.90 దాటి వినియోగదారులకు భారంగా మారాయి. హైదరాబాద్‌లో అయితే పెట్రోల్ ధర రూ.111కు పైగా చేరుకోగా, డీజిల్ ధర కూడా రూ.100కు చేరింది.
ఇంధన ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల అస్థిరత అని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపడంతో దిగుమతి వ్యయం పెరిగిందని వివరించాయి. అదనంగా రవాణా ఖర్చులు, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు కూడా ధరలపై ప్రభావం చూపుతున్నాయని చెబుతున్నాయి.
56
ఎక్సైజ్ సుంకాలపై కొంత ఉపశమనం
ఇక కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణ కోసం ఎక్సైజ్ సుంకాలపై కొంత ఉపశమనం ఇచ్చినప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఆ ప్రభావం పూర్తిగా కనిపించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో ముడి చమురు ధరలు తగ్గకపోతే పెట్రోల్, డీజిల్ ధరల్లో మరిన్ని మార్పులు ఉండే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
66
చివరకు సామాన్యుడి జేబుకే చిల్లు
వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు రవాణా రంగంపై మాత్రమే కాకుండా మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయలు, నిత్యావసర వస్తువులు, సరుకు రవాణా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో సాధారణ కుటుంబాల నెలవారీ ఖర్చులు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడుతోంది. చివరకు సామాన్యుడి జేబుకే చిల్లు పడుతోంది.