
భారతదేశ ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ (Infosys), 2025 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులయ్యే ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్రెషర్ల కోసం భారీ ఎత్తున ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్ నియామకాలను చేపట్టేందుకు సిద్ధమైంది. ఈసారి నియామకాల్లో సంస్థ ఎన్నడూ లేని విధంగా అత్యధిక ప్యాకేజీలను ప్రకటించడం విశేషం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆధునిక సాంకేతికతలో నైపుణ్యం కలిగిన యువతను ఆకర్షించేందుకు, ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి గరిష్ఠంగా రూ. 21 లక్షల వరకు ప్యాకేజీని ఇన్ఫోసిస్ ఆఫర్ చేస్తోంది.
సాధారణంగా ఐటీ రంగంలో ఫ్రెషర్ల వేతనాలు తక్కువగా ఉంటాయి. అయితే, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఇన్ఫోసిస్ తన హైరింగ్ స్ట్రాటజీని మార్చుకుని, స్పెషలిస్ట్ రోల్స్ కోసం భారీ వేతనాలను ప్రకటించింది. పలు మీడియా రిపోర్టు ప్రకారం.. ఈ నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
ఇన్ఫోసిస్ ఈసారి ప్రధానంగా రెండు రకాల ఉద్యోగ విభాగాల్లో నియామకాలు చేపడుతోంది. ఒకటి స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ (Specialist Programmer), రెండోది డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ (Digital Specialist Engineer). అభ్యర్థుల నైపుణ్యాలను బట్టి వేతనాలు ఉంటాయి. వేతనాల బ్రేక్ అప్ వివరాలు గమనిస్తే..
ప్రస్తుతం భారతీయ ఐటీ కంపెనీలు ఫ్రెషర్లకు అందిస్తున్న వేతనాలతో పోలిస్తే, ఇవి చాలా రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.
ఈ నియామక ప్రక్రియ ప్రధానంగా 2025 బ్యాచ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతోంది. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల ప్రకారం, ఈ క్రింది విద్యార్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు..
ఇన్ఫోసిస్ గ్రూప్ హెచ్‌ఆర్ హెడ్ (CHRO) షాజీ మాథ్యూ మనీకంట్రోల్‌తో మాట్లాడుతూ.. సంస్థ ప్రస్తుతం ఏఐ ఫస్ట్ విధానాన్ని అవలంబిస్తోందని తెలిపారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి, సంస్థలోని ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలను పెంచడంతో పాటు, బయట నుండి లోతైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కొత్త టాలెంట్‌ను నియమించుకోవడం చాలా కీలకమని పేర్కొన్నారు.
"మా ఎర్లీ కెరీర్ హైరింగ్ అనేది క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్‌లతో ఉంటాయి. స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ ట్రాక్‌లో అవకాశాలను విస్తరించాము, దీని ద్వారా రూ. 21 లక్షల వరకు ప్యాకేజీలను అందిస్తున్నాము. ఈ కొత్త ఉద్యోగులు క్లిష్టమైన సమస్యలు, అధునాతన టెక్నాలజీలు, ఎంటర్ప్రైజ్ గ్రేడ్ ప్లాట్‌ఫారమ్‌లపై పని చేస్తారు" అని షాజీ మాథ్యూ వివరించారు.
గత దశాబ్ద కాలంగా భారతీయ ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్ల వేతనాలు పెద్దగా పెరగకుండా ఉన్నాయి. ఒక విశ్లేషణ ప్రకారం, 2012 నుండి 2022 మధ్య కాలంలో ఐటీ కంపెనీల సీఈఓల వేతనాలు 835% పెరగగా, ఫ్రెషర్ల వేతనాలు మాత్రం కేవలం 45% మాత్రమే పెరిగాయి.
అయితే, ఏఐ రాకతో ఈ పరిస్థితి మారుతోంది. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ఫ్రెషర్లకు భారీ ఆఫర్లు అందుతున్నాయి. ఇన్ఫోసిస్ మాత్రమే కాకుండా, టీసీఎస్ (TCS) తన ప్రైమ్ విభాగం ద్వారా రూ. 11 లక్షల వరకు, హెచ్‌సీఎల్ టెక్ (HCLTech) తన ఎలైట్ క్యాడర్ ద్వారా సాధారణ ప్యాకేజీ కంటే 4 రెట్లు ఎక్కువ వేతనాన్ని ఆఫర్ చేస్తున్నాయి. విప్రో (Wipro) కూడా టర్బో ప్రోగ్రామ్ ద్వారా రూ. 6.5 లక్షల వరకు వేతనాలను అందిస్తోంది.
ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరం (FY26) మొదటి అర్ధభాగంలో ఇప్పటికే 12,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్లు కంపెనీ సీఎఫ్ఓ (CFO) జయేష్ సంఘరాజ్కా అక్టోబర్ 16న జరిగిన రెండో త్రైమాసిక ఫలితాల సమావేశంలో వెల్లడించారు.
రెండో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ కొత్తగా 8,203 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దీంతో సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,31,991కి చేరుకుంది. వరుసగా ఐదు త్రైమాసికాల నుండి ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటూ వస్తోంది. ఈ భారీ హైరింగ్ డ్రైవ్ ఐటీ రంగంలో నిరుద్యోగులకు, ముఖ్యంగా 2025 బ్యాచ్ విద్యార్థులకు గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.