Published : Dec 27, 2025, 07:03 AM ISTUpdated : Dec 28, 2025, 09:17 AM IST
Gold Silver Price : 2025లో రికార్డు స్థాయికి చేరిన బంగారం, వెండి ధరలు 2026లోనూ భారీగా పెరిగే అవకాశం ఉంది. డిమాండ్ పెరగడం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
2025 సంవత్సరం బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇన్వెస్టర్లకు అత్యంత లాభదాయకంగా మారాయి. శుక్రవారం (డిసెంబర్ 26) నాటికి స్పాట్ మార్కెట్‌లో బంగారం తులం ₹1,30,670 కు చేరగా, కిలో వెండి ₹2,17,000 తాకి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో, ఇప్పటికే భారీగా పెరిగిన వీటి ధరలు 2026లో ఏ దిశగా పయనిస్తాయన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ధరలు ఇక్కడే స్థిరపడతాయా, తగ్గుతాయా లేక మరింత పెరుగుతాయా అనేది ప్రధాన ప్రశ్నగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ పరిస్థితుల ఆధారంగా 2026లో బంగారం, వెండి ధరల సరళి ఎలా ఉండబోతోందో ప్రముఖ ఆర్థిక సంస్థలు విశ్లేషించాయి. వాటి అంచనాలు, ముఖ్యమైన అంశాలను ఇక్కడ తెలుసుకుందాం.
26
2026లో బంగారం, వెండి ధరలను ప్రభావితం చేసే ప్రధాన అంశాలు
2026లో బంగారం, వెండి ధరలను ప్రధానంగా ఏడు అంశాలు ప్రభావితం చేయనున్నాయి. అందులో మొదటిది వడ్డీ రేట్లు. తరచుగా అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గినప్పుడు డాలర్ బలహీనపడుతుంది. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు బ్యాంకుల్లో డబ్బు ఉంచడం కంటే, బంగారంపై పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా మారుతుంది.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) ప్రకారం, 2026లో వడ్డీ రేట్ల సరళి ఈ లోహాల ధరలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనుంది.
రెండవది అమెరికా డాలర్ విలువ. డాలర్ బలహీనపడితే బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. మూడవది సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు. గత కొన్నేళ్లుగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి, ఇది 2026లో కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇవి కాకుండా భౌగోళిక ఉద్రిక్తతలు, మాంద్యం భయాలు, ఈటీఎఫ్ (ETF) పెట్టుబడులు, పారిశ్రామిక డిమాండ్ కూడా ధరలను ప్రభావితం చేయనున్నాయి.
36
బంగారం అంచనాలు: తులం రూ. 1.50 లక్షల వైపు?
అనేక ఆర్థిక సంస్థలు 2026లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, 2026 చివరి నాటికి రూ. 1,45,000 నుండి రూ. 1,50,000 వరకు చేరే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగడం, భారత్‌లో దిగుమతి సుంకాలు, జీఎస్టీ (GST) కారణంగా ధరలు మరింత ఎక్కువగా ఉంటాయి.
వెండికి పారిశ్రామిక డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఏఐ (AI) డేటా సెంటర్ల నిర్మాణంలో వెండి వినియోగం పెరుగుతుండటంతో ధరలు పెరుగుతున్నాయి.
ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర రూ. 2,30,000 పైనే ట్రేడ్ అవుతోంది. మోతీలాల్ ఓస్వాల్ వంటి దేశీయ బ్రోకరేజ్ సంస్థల అంచనా ప్రకారం, 2026లో వెండి ధర కిలోకు రూ. 2,40,000 నుండి రూ. 2,50,000 వరకు చేరే అవకాశం ఉంది. బంగారం తో పోలిస్తే వెండిలో ధరల్లో ఎక్కువ ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలి.
56
పెట్టుబడిదారులు ఏం చేయాలి? ఎప్పుడు కొనాలి?
బంగారం లేదా వెండిని కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమా అని ఆలోచిస్తున్న వారికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆభరణాల కోసం అయితే ధరలు తగ్గే వరకు వేచి చూడకుండా, అవసరమైనప్పుడు కొనుగోలు చేయడం లేదా విడతల వారీగా కొనడం మంచిది.
ధరలు రూ. 1,39,000 నుండి కొద్దిగా తగ్గినప్పుడు కొనుగోలు చేయడానికి మంచి అవకాశంగా భావించవచ్చు. వెండి ధరల్లో భారీ మార్పులు ఉంటాయి కాబట్టి, దీర్ఘకాలిక దృష్టితో మాత్రమే వెండిలో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
66
బంగారం, వెండి ధరలు : నిపుణుల సలహా
కోటక్ సెక్యూరిటీస్, జేపీ మోర్గాన్ రిపోర్టుల ప్రకారం, 2026లో బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడిగా కొనసాగుతుంది. అయితే, 2025లో వచ్చినంత భారీ ర్యాలీ 2026లో ఉండకపోవచ్చు, కానీ ధరలు స్థిరంగా పెరిగే అవకాశం ఉంది. పోర్ట్‌ఫోలియోలో 70% బంగారం, 30% వెండి ఉండేలా ప్లాన్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.