YouTube: మాట్లాడే కోతి ఏడాదిలో రూ. 38 కోట్లు సంపాదించింది.. ఈ ఐడియా తెలిస్తే షాక్ అవుతారు !

Published : Dec 31, 2025, 09:55 PM IST

Indian YouTuber Earns 38 Crores: అస్సాంకు చెందిన సుర్జీత్ కర్మకర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి 'బందర్ అప్నా దోస్త్' యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏడాదికి ఏకంగా రూ. 38 కోట్లు సంపాదిస్తూ రికార్డు సృష్టించాడు.

PREV
16
కెమెరా లేదు, నటులు లేరు.. అయినా ఏడాదికి రూ. 38 కోట్లు సంపాదన

సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సంపాదన మార్గాలు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు యూట్యూబ్‌లో వీడియో చేయాలంటే కెమెరా, లైటింగ్, స్క్రిప్ట్, నటులు ఇలా ఎంతో హంగామా ఉండేది. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆ అడ్డంకులన్నింటినీ చెరిపేసింది.

దీనికి నిలువెత్తు నిదర్శనమే 'బందర్ అప్నా దోస్త్' (Bandar Apna Dost) అనే యూట్యూబ్ ఛానల్. అస్సాంకు చెందిన ఒక యువకుడు కేవలం AI సాయంతో, ఎటువంటి భారీ సెటప్ లేకుండా ఏడాదికి రూ. 38 కోట్లు సంపాదిస్తున్నాడంటే నమ్మశక్యం కాదు, కానీ ఇది అక్షరాలా నిజం.

26
అస్సాం యువకుడి వినూత్న ఆలోచనతో కోట్ల వర్షం

సాధారణంగా యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్లు ఎంతో కష్టపడి వీడియోలు చేస్తారు. కానీ విజయం అందరికీ దక్కదు. అయితే అస్సాంకు చెందిన సుర్జీత్ కర్మకర్ అనే యువకుడు మాత్రం సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చాడు. 2020లో సుర్జీత్ 'బందర్ అప్నా దోస్త్' పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించాడు. ఇందులో మనుషులు కనిపించరు, కేవలం గ్రాఫిక్స్, AI ద్వారా రూపొందించిన కోతులు, ఇతర వింత పాత్రలు మాత్రమే కనిపిస్తాయి.

ఈ ఛానల్ మొదలైన కొద్ది కాలంలోనే అనూహ్యమైన ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈ ఛానల్‌కు 27.7 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. సుర్జీత్ తన వీడియోల కోసం ఎటువంటి భారీ కథలను ఎంచుకోలేదు. ఫన్నీగా ఉండే సన్నివేశాలు, సినిమా డైలాగులు, వింతగా ప్రవర్తించే కోతి పాత్రలతో వీడియోలను రూపొందిస్తాడు. ఈ వీడియోలు 5 నిమిషాల కంటే తక్కువ నిడివితో ఉండి, పిల్లలనే కాకుండా పెద్దలను కూడా ఆకర్షిస్తున్నాయి.

36
కోట్లలో కురుస్తున్న ఆదాయం

ఈ ఛానల్ ఆదాయం గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కప్వింగ్ (Kapwing) అనే వీడియో ఎడిటింగ్ ప్లాట్‌ఫామ్ విడుదల చేసిన రిపోర్టుల ప్రకారం, బందర్ అప్నా దోస్త్ ఛానల్ ఏడాదికి సుమారు 4.25 మిలియన్ డాలర్లు, అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 38 కోట్లు సంపాదిస్తోంది. ఈ ఛానల్‌లోని వీడియోలు ఇప్పటివరకు 2.4 బిలియన్ల (240 కోట్లు) వ్యూస్ సాధించాయి.

ప్రపంచవ్యాప్తంగా AI ద్వారా వీడియోలు తయారు చేసే ఛానల్స్ జాబితాలో ఈ భారతీయ ఛానల్ అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇప్పటివరకు ఈ ఛానల్‌లో 620కి పైగా వీడియోలు అప్లోడ్ అయ్యాయి. ఒక్కో వీడియో నిడివి చాలా తక్కువగా ఉండటం, కంటెంట్ వేగంగా కదులుతూ ఉండటం వల్ల జనం వీటిని మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఇదే ఈ భారీ ఆదాయానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.

46
ఏంటి ఈ AI స్లాప్ కంటెంట్?

ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రస్తుతం AI స్లాప్ అనే పదం బాగా వినిపిస్తోంది. క్వాలిటీ కంటే క్వాంటిటీ మీద ఆధారపడే కంటెంట్‌ను ఇలా పిలుస్తున్నారు. బందర్ అప్నా దోస్త్ ఛానల్ కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఒకసారి టెంప్లేట్ సెట్ చేసుకున్న తర్వాత, అదే ఫార్ములాతో వేలకొద్దీ వీడియోలను వేగంగా తయారు చేయవచ్చు.

ఈ వీడియోలలోని పాత్రలు, గొంతు, కథా నిర్మాణం దాదాపు ఒకేలా ఉంటాయి. చిన్న చిన్న మార్పులతో రోజుకు డజన్ల కొద్దీ వీడియోలను అప్లోడ్ చేయవచ్చు. ఈ ఛానల్‌లోని వీడియోలలో కోతులు హల్క్ వేషంలో, లేదా కండలు తిరిగిన బాడీతో, కొన్నిసార్లు రౌడీల్లా, మరికొన్నిసార్లు రాజకీయ నాయకుల్లా కనిపిస్తూ నవ్వులు పూయిస్తాయి. వింత రంగులు, ఫాస్ట్ కట్స్ ఉండటం వల్ల వీక్షకులు స్క్రీన్ నుండి కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి.

56
యూట్యూబ్ అల్గారిథమ్ ఏం చెబుతోంది?

నిజానికి యూట్యూబ్ నిబంధనల ప్రకారం AI కంటెంట్‌ను మానిటైజ్ చేయడం కష్టమని చాలామంది భావిస్తుంటారు. కానీ యూట్యూబ్ అల్గారిథమ్ ఎప్పుడూ ఎంగేజ్‌మెంట్ కే ప్రాధాన్యం ఇస్తుంది. అంటే జనం ఒక వీడియోను ఎంత సేపు చూస్తున్నారు, ఎంతమందికి షేర్ చేస్తున్నారు అనేదే ముఖ్యం. వీడియోను మనిషి తయారు చేశాడా లేదా మెషిన్ తయారు చేసిందా అనే విషయంతో సిస్టమ్‌కు సంబంధం లేదు.

కప్వింగ్ రిపోర్టుల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 278 ఛానళ్లు పూర్తిగా AI కంటెంట్‌తో నడుస్తున్నాయి. ఇవి ఏకంగా 63 బిలియన్ల వ్యూస్, 221 మిలియన్ల సబ్‌స్క్రైబర్లను కలిగి ఉన్నాయి. బందర్ అప్నా దోస్త్ వంటి ఛానళ్లు యూట్యూబ్ రికమండేషన్ సిస్టమ్‌లో సులభంగా చోటు దక్కించుకుంటున్నాయి. పిల్లల మనస్తత్వానికి దగ్గరగా ఉండే టోన్, రిపీట్ అయ్యే ప్యాటర్న్స్ ఉండటం వల్ల ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

66
భవిష్యత్తు కంటెంట్ క్రియేషన్ పై ప్రభావం

ఈ తరహా ఛానళ్ల విజయం నిజమైన కంటెంట్ క్రియేటర్ల ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచింది. స్క్రిప్ట్ రాసి, షూట్ చేసి, ఎడిట్ చేయడానికి గంటల తరబడి కష్టపడే మనుషులకు.. అలసట లేకుండా నిమిషాల్లో వీడియోలు పుట్టించే ఏఐకి మధ్య పోటీ మొదలైంది. ఒకవైపు ఇది సాంకేతిక విప్లవంగా కనిపిస్తున్నా, మరొకవైపు ఇది సృజనాత్మకతకు గొడ్డలిపెట్టు అని కొందరు విశ్లేషిస్తున్నారు.

రాబోయే రోజుల్లో ఇంటర్నెట్ అనేది అర్థవంతమైన కంటెంట్‌తో నిండుతుందా లేక కేవలం వేగంగా తయారై, అంతే వేగంగా మర్చిపోయే స్లాప్ కంటెంట్‌తో నిండిపోతుందా అనేది చూడాలి. ఏది ఏమైనా, బందర్ అప్నా దోస్త్ విజయం మాత్రం.. ఏఐ ఇప్పుడు కేవలం ఒక టూల్ మాత్రమే కాదు, అది కంటెంట్ ఎకానమీలో ఒక బలమైన ప్లేయర్ గా మారిందని నిరూపిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories