
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అకస్మాత్తుగా పెద్ద పరిణామం చోటు చేసుకుంది. బ్యాంక్ చైర్మన్‌గా ఉన్న అటాను చక్రబర్తి ఒక్కసారిగా రాజీనామా చేశారు. తన లేఖలో గత రెండు సంవత్సరాల్లో బ్యాంక్‌లో జరిగిన కొన్ని విషయాలు తన వ్యక్తిగత విలువలకు సరిపోలలేదని పేర్కొన్నారు. ఇదే విషయమే మార్కెట్‌లో కలకలం రేపింది. అయితే తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది సాధారణ రాజీనామా మాత్రమేనని చెప్పారు. అయినా పెట్టుబడిదారులు ఈ వివరణను నమ్మలేదు. దీంతో బ్యాంక్‌పై అనుమానాలు పెరిగాయి.
చక్రబర్తి రాజీనామా వార్త బయటకు రావడంతో షేర్ మార్కెట్‌లో పెద్ద షాక్ తగిలింది. ఒక్కరోజులోనే బ్యాంక్ షేర్లు 5% కంటే ఎక్కువ పడిపోయాయి. దాంతో దాదాపు రూ.1 లక్ష కోట్ల సంపద మాయమైంది. విదేశీ ఇన్వెస్టర్లు కూడా ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా బ్లాక్‌రాక్ వంటి సంస్థలు స్పష్టమైన సమాధానాలు కోరాయి. కానీ బ్యాంక్ బోర్డు సభ్యులు సరైన వివరాలు ఇవ్వలేకపోయారు. ఈ అనిశ్చితి కారణంగా షేర్ ధరలు మరింత ఒత్తిడిలోకి వెళ్లాయి. రెండు రోజుల్లో దాదాపు 7.5% వరకు పడిపోయింది. ఇది ఇంకా తగ్గే అవకాశం ఉంది.
బ్యాంక్ సీఈఓ శశిధర్ జగదీశన్ సహా బోర్డు సభ్యులు ఈ రాజీనామాలో ఎలాంటి తప్పు లేదా అవినీతి అంశం లేదని చెప్పారు. చక్రబర్తి తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరినా ఆయన అంగీకరించలేదని తెలిపారు. కొత్త తాత్కాలిక చైర్మన్‌గా కేకీ మిస్త్రీను నియమించారు. ఆయన కూడా బ్యాంక్‌లో ఎలాంటి అంతర్గత గొడవలు లేవని చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ కూడా బ్యాంక్ బలంగా ఉందని స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వ్యవహారంలో ఎలాంటి గవర్నెన్స్ సమస్యలు లేవని తెలిపింది.
పెట్టుబడిదారులు మాత్రం బ్యాంక్ వివరణతో సంతృప్తి చెందలేదు. చైర్మన్ లాంటి పెద్ద స్థాయి వ్యక్తి ఇలా రాజీనామా చేయడం సాధారణం కాదని వారు భావిస్తున్నారు. కొంతమంది నిపుణులు ఇది తాత్కాలిక ప్రభావం మాత్రమే అని చెబుతున్నారు. మరికొందరు మాత్రం గవర్నెన్స్‌పై సందేహాలు ఉన్నాయని అంటున్నారు. డేవెన్ చోక్సీ లాంటి మార్కెట్ నిపుణులు ఈ పడిపోవడాన్ని “డీప్ వాల్యూ అవకాశం”గా చూస్తున్నారు. అంటే షేర్ తక్కువ ధరలో దొరికే అవకాశం అని భావిస్తున్నారు. అయితే పూర్తి క్లారిటీ వచ్చే వరకు మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగొచ్చు.
సాధారణ కస్టమర్లకు భయపడాల్సిన అవసరం లేదు. బ్యాంక్ కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నాయి. డిపాజిట్లు సురక్షితంగానే ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బ్యాంక్ ఆర్థికంగా బలంగా ఉందని చెప్పడం వల్ల కస్టమర్లకు నమ్మకం కలుగుతుంది. ఇది ప్రధానంగా షేర్ మార్కెట్‌కు సంబంధించిన సమస్య మాత్రమే. బ్యాంక్‌లో సేవలు, లావాదేవీలు, ఖాతాలపై ఎలాంటి ప్రభావం లేదు. అయితే పెట్టుబడిదారులు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితి పూర్తిగా క్లియర్ అయ్యే వరకు మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే గతేడాది ఆగస్టులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో భారీ ఆర్థిక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. జమ్మూ కశ్మీర్‌లోని షోపియన్, పుల్వామా ప్రాంతాల్లో కొంతమంది బ్యాంక్ ఉద్యోగులు కస్టమర్ల అనుమతి లేకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి డబ్బులు తీసుకోవడం, వారి ఖాతాలపై తెలియకుండా రుణాలు నమోదు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
కొందరికి నకిలీ ఎఫ్‌డీ రసీదులు ఇచ్చి మోసం చేసినట్టు బాధితులు చెబుతున్నారు. ఒక ఖాతాదారుడు ఇప్పటికే చెల్లించిన రూ.1.35 కోట్ల రుణం మళ్లీ బాకీగా చూపించారని వాపోగా, మరొకరు తమ కుటుంబ సభ్యురాలి ఎఫ్‌డీ నుంచి లక్షల రూపాయలు అనుమతి లేకుండా తీసుకున్నారని తెలిపారు. దీనిపై అప్పట్లో హెచ్‌డీఎఫ్‌సీ విచారణ చేపడుతామని ప్రకటించింది.