ముందుగా ఆభరణాల గురించి మాట్లాడితే… మన భారతీయులకు బంగారు ఆభరణాలు అంటే చా ఇష్టం. పెళ్లిళ్లు, పండుగలు, ఫంక్షన్ల సమయంలో మెడలో బంగారు ఆభరణాలు వేసుకోవడం తప్పనిసరి. అందుకే చాలా మంది బంగారం అంటే ముందుగా జ్యువెలరీ గురించే ఆలోచిస్తారు. కానీ పెట్టుబడి కోణంలో చూస్తే ఆభరణాలు అంతగా ఉపయోగపడవు. ఎందుకంటే మీరు ఆభరణం కొనుగోలు చేసే సమయంలో మేకింగ్ ఛార్జీలు, వేస్టేజ్ వంటి అదనపు ఖర్చులు చెల్లించాలి. ఇవి కొన్నిసార్లు బంగారం విలువలోనే 10 శాతం నుంచి 20 శాతం వరకు ఉండొచ్చు. కానీ మీరు ఆ ఆభరణాన్ని తిరిగి అమ్మేటప్పుడు ఈ ఛార్జీలు తిరిగి రావు. దీంతో బంగారం ధర పెరిగినా, మీకు ఆశించినంత లాభం కనిపించకపోవచ్చు. కాబట్టి కేవలం పెట్టుబడి కోసం ఆభరణాలు కొనడం అంత మంచిది కాదు.