GST Complaints : దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్నట్లుగా ఉంది ప్రస్తుతం జిఎస్టి పరిస్థితి. కేంద్రం జిఎస్టి తగ్గించినా వ్యాపారులు మాత్రం వస్తువులు, సేవల ధరలు తగ్గించడంలేదు. ఇలాంటి పరిస్థితే మీకు ఎదురైతే వెంటనే ఈ నంబర్లకు ఫిర్యాదు చేయండి.
GST Complaints : నరేంద్ర మోదీ 3.0 సర్కార్ తాజాగా జిఎస్టి 2.0 అమల్లోకి తీసుకువచ్చింది. వివిధ వస్తువులు, సేవలపై విధించే పన్నులను భారీగా తగ్గించి ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేలా జిఎస్టి సంస్కరణలు చేపట్టింది. ఈ నెల ఆరంభంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జిఎస్టి కౌన్సిల్ 56వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. 12%, 28% పన్ను శ్లాబులను తొలగించి కేవలం 5%,18% శ్లాబులను కొనసాగించేందుకు నిర్ణయించారు. అంతేకాదు కొన్ని వస్తు సేవలపై జిఎస్టి విధించకూడదని నిర్ణయించింది.
ఇలా జిఎస్టి సంస్కరణలతో చాలా వస్తువులు, సేవల ధరలు దిగివచ్చాయి. ఏసీలు, టీవిలు, వాషింగ్ మిషన్ల వంటి ఎలక్ట్రిక్ పరకరాల నుండి పేస్ట్ లు, బ్రష్ లు, పాలు, పెరుగు ప్యాకెట్లు వంటి నిత్యావసర వస్తువుల వరకు ధరలు తగ్గాయి. ఇలా ఓ మనిషి తలపై పెట్టుకునే క్యాప్ నుండి కాళ్లకు ధరించే పాదరక్షల వరకు దాదాపు 375 రకాల వస్తువుల ధరలు తగ్గాయి. సెప్టెంబర్ 22 నుండి అంటే గత సోమవారం నుండే కొత్త జిఎస్టి అమలులోకి వచ్చింది... దీని ప్రకారమే తగ్గింపు ధరలకు వస్తు సేవలను అందించాల్సి ఉంటుంది.
25
జిఎస్టి తగ్గినా ధరలు మాత్రం తగ్గడంలేదా?
అయితే జిఎస్టిపై ప్రజలకు తగిన అవగాహన లేకపోవడాన్ని వ్యాపారులు, వ్యాపార సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. కొత్త జిఎస్టి ప్రకారం కాకుండా పాత ధరలకే వస్తువులను విక్రయిస్తున్నారు. ఉదాహరణకు కొత్త జీఎస్టీ అమల్లోకి వచ్చి మూడు రోజులైనా హైదరాబాద్ లో పాల ఉత్పత్తుల ధరలు ఏమాత్రం తగ్గలేవు. పాత ధరలకే పాల ఉత్పత్తులు అమ్ముతున్నారు వ్యాపారులు... ఇదేంటని అడిగినవారికి కంపెనీలు జీఎస్టీ తగ్గించలేదని సమాధానం చెబుతున్నారు. ఇలా కేవలం పాలే కాదు నగరంలోని చాలా ఐటమ్స్ పై జిఎస్టి తగ్గింపు కనిపించడంలేదు... ఎప్పటిలాగే పాత ధరలకే వాటిని విక్రయిస్తున్నారు.
ఇలాంటి అనుభవమే మీకు కూడా ఎదురైతే ఏమాత్రం ఉపేక్షించకండి. జిఎస్టి ధరలు తగ్గినా వస్తువుల ధరల తగ్గించని వ్యాపారులు, వ్యాపార సంస్థలపై కేంద్ర ప్రభుత్వానికి వెంటనే ఫిర్యాదు చేయండి. ఇలా జిఎస్టి పై ఫిర్యాదులను స్వీకరించేందుకు కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసువాల్సిన అవసరం ఉంది.
35
ఇలా జిఎస్టి ఫిర్యాదులు చేయండి
వస్తు సేవల పన్ను (GST) తగ్గింపు ప్రయోజనాలను వ్యాపార సంస్థలు తప్పకుండా వినియోగదారులకు బదిలీచేయాలి... అంటే వ్యాపారులు తగ్గింపు ధరలకే వస్తువులు, సేవలను ప్రజలకు అందించాలి. ఒకవేళ జిఎస్టి తగ్గిన వస్తుసేవలను కూడా పాత ధరలకే విక్రయిస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1915 లేదా 1800 11 4000 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. లేదా వాట్సాప్ ద్వారా అయితే 8800001915 నంబర్ కు ఫిర్యాదు చేయవచ్చు. జాతీయ సెలవుదినాల్లో మినహా ఈ టోల్ ప్రీ నంబర్లు ప్రతిరోజు పనిచేస్తాయి... ఉదయం 8AM నుండి రాత్రి 8PM వరకు వినియోగదారులు ఫిర్యాదులు చేయవచ్చు. ఎన్సిహెచ్ (NCH) యాప్, ఉమాంగ్ (UMANG) యాప్ ద్వారా కూడా జిఎస్టి సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు.
కొందరు వ్యాపారులు వస్తువులపై మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూపించి పాత జిఎస్టి వర్తిస్తుందని కస్టమర్లను తప్పుదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా చెబితే నమ్మవద్దు... సెప్టెంబర్ 22 నుండి ప్రతి వస్తువుపై కొత్త జిఎస్టి వర్తిస్తుంది. కాబట్టి ఆ వస్తువు ఎప్పుడు తయారైనా సరే బిల్లింగ్ జరిగే రోజు జిఎస్టి వర్తిస్తుంది... పాత ఎంఆర్పి ప్రకారమే అమ్ముతామంటే కుదరదు. ఈ-కామర్స్ యాప్స్ లో అంటే ఆన్లైన్ లో షాపింగ్ చేసేటప్పుడు కూడా వస్తువుల ధరలు తగ్గాయో లేదో కంపేర్ చేసుకోవడం మంచిది... జిఎస్టి అమలు చేయకుండా అధిక ధరలకు వస్తువులు అమ్మితే వీటిపై కూడా ఫిర్యాదు చేయవచ్చు.
55
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోడానికి ఇదే మంచి సమయం
ఈ కలికాలంలో అనారోగ్య సమస్యలు పెరిగిపోయాయి... దీంతో కుటుంబంలో ఒక్కరు హాస్పిటల్ పాలయితే సంపాదనంతా వైద్య ఖర్చులకే కరిగిపోతోంది. ఏదయినా జరక్కూడనిది జరిగి ఎవరైనా మరణిస్తే ఆ కుంటుంబం ఆర్థికంగా ఇబ్బందిపడాల్సి వస్తుంది. అలా జరక్కుండా ఉండాలంటే ఇన్సూరెన్స్ తీసుకోవడం ఉత్తమ మార్గం... దీనిద్వారా ఏం జరిగినా కుంటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుంది.
అయితే ప్రస్తుతం జిఎస్టి సంస్కరణల ద్వారా హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్ పై పన్నులను పూర్తిగా తొలగించారు... అంటే ఇంతకు ముందు 18 శాతం ఉన్న జిఎస్టి ఇప్పుడు జీరో శాతం. కాబట్టి వెంటనే జిఎస్టి ప్రయోజనాలతో కూడిన ఉత్తమమైన పాలసీని తీసుకునేందు ఇది సరైన సమయం. భవిష్యత్ లో ఇన్సూరెన్స్ కంపెనీలు తమ లాభాలను పెంచుకునేందుకు ఇన్సూరెన్స్ ప్రీమియంను పెంచే అవకాశం ఉంటుంది... కాబట్టి ఇప్పుడే ఇన్సూరెన్స్ తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.