Gold Ban in India: హైదరాబాద్ బహిరంగ సభలో మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ప్రజలు ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయొద్దని మోదీ పిలుపునివ్వడంతో, బంగారంపై నిషేధం సాధ్యమేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
భారత్‌లో బంగారం అంటే కేవలం విలువైన లోహం మాత్రమే కాదు. పెళ్లిళ్లు, పండుగలు, సంప్రదాయాలు, పెట్టుబడులు.. ఇలా ప్రతి కుటుంబ జీవితంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఇటీవల దేశ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం కొనుగోలుపై చర్చ మళ్లీ మొదలైంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం నిజంగానే బంగారం కొనుగోలుపై పూర్తి నిషేధం విధించగలదా అనే ప్రశ్న చాలా మందిలో ఆసక్తి కలిగిస్తోంది.
26
బంగారం కొనొద్దని ఎందుకు చెబుతున్నారు?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, డాలర్ మార్పిడి ఒత్తిడి వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయి. భారత్‌లో వినియోగించే బంగారంలో ఎక్కువ భాగం విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. దీంతో బంగారం దిగుమతులు పెరిగితే విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా డాలర్ల వినియోగం అధికమవడంతో ట్రేడ్ డెఫిసిట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కారణాలతో ప్రజలు కొంతకాలం బంగారం కొనుగోళ్లు తగ్గిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు ఊరట లభిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
36
ప్రభుత్వం పూర్తిగా నిషేధం విధించగలదా?
సాంకేతికంగా చూస్తే కేంద్ర ప్రభుత్వానికి దిగుమతులు, వ్యాపారం, ఆర్థిక లావాదేవీలపై నియంత్రణ విధించే అధికారం ఉంది. గతంలో కూడా భారత్‌లో బంగారం నియంత్రణకు కఠిన చట్టాలు అమల్లోకి వచ్చాయి.
1968లో తీసుకొచ్చిన “గోల్డ్ కంట్రోల్ యాక్ట్” అందులో ముఖ్యమైంది. ఆ చట్టం ద్వారా ప్రజలు ఎక్కువగా బంగారం నిల్వ చేయకుండా నియంత్రించేందుకు ప్రయత్నించారు. అలాగే దిగుమతులను కూడా పరిమితం చేశారు.
అయితే 1990 ఆర్థిక సంస్కరణల సమయంలో ఆ చట్టాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం పూర్తిస్థాయి నిషేధం కాకుండా పన్నులు, దిగుమతి సుంకాలు, లావాదేవీ నియమాల ద్వారా ప్రభుత్వం మార్కెట్‌ను నియంత్రిస్తోంది.
గత కొన్ని సంవత్సరాలుగా బంగారం దిగుమతులు, అమ్మకాలు, కొనుగోళ్లపై ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ప్రస్తుతం హాల్‌మార్క్ తప్పనిసరి చేశారు. ప్రతి బంగారు ఆభరణంపై ప్రత్యేక ఆరు అంకెల HUID కోడ్ ఉండాలి. దీని వల్ల నకిలీ బంగారం అమ్మకాలపై నియంత్రణ సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకోవాలంటే ప్రత్యేక అనుమతులు అవసరమవుతున్నాయి. దీంతో అక్రమ దిగుమతులను తగ్గించే ప్రయత్నం జరుగుతోంది.
56
నగదు లావాదేవీలపై కూడా పరిమితులు
బ్లాక్ మనీ, పన్ను ఎగవేతను తగ్గించేందుకు బంగారం కొనుగోళ్లలో నగదు లావాదేవీలపై కూడా పరిమితులు అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం రూ.2 లక్షలకు మించిన నగదు చెల్లింపులతో బంగారం కొనడం అనుమతించరు. పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేస్తే PAN కార్డు వివరాలు తప్పనిసరి. అదే విధంగా రూ.10 లక్షలకు మించిన లావాదేవీలకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలను అధికారులు అడిగే అవకాశం ఉంటుంది. దీంతో అక్రమ ఆర్థిక లావాదేవీలపై నిఘా పెంచుతున్నారు.
66
ఎలాంటి పరిస్థితుల్లో పూర్తి నిషేధం రావచ్చు?
ప్రస్తుతం పూర్తిగా బంగారం కొనుగోలుపై నిషేధం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కానీ దేశ ఆర్థిక పరిస్థితి తీవ్రమైతే ప్రభుత్వం మరింత కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం, డాలర్ కొరత పెరగడం, దిగుమతి వ్యయం అధికమవడం వంటి పరిస్థితుల్లో దిగుమతి సుంకాలు పెంచడం, భారీ కొనుగోళ్లపై అదనపు పరిమితులు విధించడం వంటి చర్యలు తీసుకోవచ్చు. అలాగే ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించేలా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి.