EPFo: కోట్లాది ఈపీఎఫ్ సభ్యులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మరో వారం రోజుల్లో వడ్డీ డబ్బులు మీ ఖాతాల్లో జమ కానున్నాయి. అంతేకాదు.. ఇకపై PF క్లెయిమ్‌లు కూడా మరింత వేగంగా పూర్తికానున్నాయి.
ఉద్యోగుల భవిష్యనిధి (EPF)పై ఆధారపడే కోట్లాది మంది ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన వడ్డీ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేసేందుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) ఏర్పాట్లు వేగవంతం చేసింది. ప్రస్తుతం వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా అవి పూర్తికాగానే ఖాతాల్లో వడ్డీ డబ్బులు పడనున్నాయి.
ఈసారి సభ్యులకు మరో ప్రత్యేకత ఏమిటంటే...గతంలో వడ్డీ జమ కావడానికి కొన్ని నెలలు పట్టేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఈజీ కావడంతో ఆ నిరీక్షణ తగ్గింది. ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేయడం వల్ల వడ్డీ జమ వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
23
జూలై 15న కల్లా మీ ఖాతాలోకి డబ్బులు
2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 8.25 శాతం వడ్డీ రేటును ఫిక్స్ చేసింది. దాని ప్రకారం సభ్యుల పీఎఫ్ పై వడ్డీ లెక్కించి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఉద్యోగులు తమ పాస్‌బుక్ లేదా అధికారిక పోర్టల్ ద్వారా ఆ మొత్తాన్ని చూసుకోవచ్చు.
వడ్డీ జమతో పాటు EPFO తన సేవల రూపురేఖలను కూడా మార్చుతోంది. ఇప్పటి వరకు ప్రాంతీయ కార్యాలయాల ఆధారంగా పనిచేసిన డేటా వ్యవస్థను పూర్తిగా కేంద్రీకృత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోకి మార్చారు. దీంతో దేశంలో ఎక్కడి నుంచైనా సభ్యుల అభ్యర్థనలను వేగంగా పరిశీలించి పరిష్కరించే అవకాశం ఏర్పడింది. ఉద్యోగం మారినా, రాష్ట్రం మారినా సేవల్లో ఆలస్యం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
33
అన్నీ సేవలు ఒకే దగ్గర
మరో కీలక నిర్ణయంగా సభ్యుల కోసం ఒకే యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ పోర్టల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్, వడ్డీ వివరాలు, క్లెయిమ్, వ్యక్తిగత సమాచారం సవరణలు వంటి అనేక సేవలను ఒకే దగ్గర పొందే వీలుంటుంది. ఇప్పటివరకు వేర్వేరు పోర్టల్స్‌ను ఉపయోగించాల్సిన అవసరం ఉండేది.
అలాగే ఆటోమేటెడ్ క్లెయిమ్ వ్యవస్థను కూడా మరింత విస్తరించారు. గతంలో పరిమితంగా ఉన్న ఆటో క్లెయిమ్ సదుపాయాన్ని ఇప్పుడు రూ.5 లక్షల వరకు పెంచడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో సభ్యులు త్వరగా నిధులు పొందే అవకాశం ఉంటుంది. డిజిటల్ సంస్కరణలు, వేగవంతమైన సేవలు, త్వరితగతిన వడ్డీ జమ వంటి చర్యలు EPFO పనితీరులో పెద్ద మార్పుకు సంకేతంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఈ మార్పులు సమయం ఆదా చేయడంతో పాటు సేవలను మరింత సులభతరం చేసే అవకాశముంది.