Diwali Business : దీపావళి పండగ వచ్చిందంటే చాలు ఇటు వినియోగదారులు, అటు వ్యాపారులకు ఎక్కడలేని జోష్ వస్తుంది. జోరుగా వ్యాపారం జరిగే ఈ పండగ సీజన్లో తెలుగు రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువ బిజినెస్ జరుగుతుందట.
Diwali Cracker Business : దీపావళి.. ప్రతి ఇంట్లో వెలుగులు నింపే పండగ. దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబాలు అంబానీ, అదానీల నుండి అత్యంత నిరుపేదల వరకు దీపావళి వేడుకలు జరుపుకుంటారు... తమకు కలిగినదాంతో పూజలు చేసుకుంటారు. పిల్లాపాపలతో కలిసి టపాసులు కాలుస్తూ, కుటుంబసభ్యులు, స్నేహితులకు మిఠాయిలు పంచుతూ, ఇంటిముందు దీపాలు వెలిగిస్తూ ఎంతో వైభవంగా ఈ వెలుగుల పండగను జరుపుకుంటారు.
25
దీపావళికి భారీ ఆఫర్లు
పండగ వేళ కొత్తబట్టలు, గిప్టులు, మిఠాయిలు, టపాసులు, పూజాసామాగ్రి కోసం ఆన్లైన్, ఆఫ్ లైన్ షాపింగ్... కొత్త కార్లు, బైకులు, ఇంట్లోకి ఫర్నీచర్... ధన త్రయోదశి (ధన్ తేరాస్) కి బంగారం, వెండి... అబ్బో దీపావళి వచ్చిందంటే మామూలు యవ్వారం ఉండదు. దసరాతో ప్రారంభిస్తే దీపావళి వరకు భారీగా కొనుగోళ్లు సాగుతాయి. ఇలా పండగ సీజన్లో ఇంకా చెప్పాలంటే ఏడాదిలో అత్యధిక వ్యాపారం జరిగేది ఈ దీపావళి పండగపూటే. అందుకే ఇటు వినియోగదారులు, అటు వ్యాపారులు ఈ పండగకోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆఫ్ లైన్ వ్యాపారులు, ఆన్లైన్ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆఫర్లమీద ఆఫర్లు ఇస్తుంటాయి.
35
దీపావళికి జరిగే బిజినెస్ ఎంతో తెలుసా?
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దీపావళి సమయంలో ఏకంగా తెలుగు రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువగా వ్యాపారం జరుగుతుందంట. పండగ సీజన్ లో వందలు, వేలు కాదు దేశవ్యాప్తంగా 4 నుండి 5 లక్షల కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందని కాన్పేడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్ (CAIT) వంటి సంస్థలు చెబుతున్నాయి. ఇది ప్రతిఏటా పెరుగుతుందే కానీ తగ్గడం ఉండదని… ఈసారి జిఎస్టి తగ్గింపు నేపథ్యంలో వ్యాపారం మరింత జోరుగా సాగుతోందంటున్నారు. కాబట్టి గతేడాదితో పోలిస్తే ఈసారి 11 శాతం అధికంగా వ్యాపారం జరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అంటే ఈ పండగసీజన్లో వ్యాపారం 5 లక్షల కోట్ల రూపాయలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.
దీపావళి సమయంలో కేవలం టపాసుల వ్యాపారమే సుమారు రూ.50,000 కోట్ల నుండి రూ.80,000 కోట్ల వరకు జరుగుతుందని అంచనా. ఈసారి ఇది మరింత పెరిగే అవకాశాలున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. పిల్లల సంతోషం కోసం డబ్బులు ఖర్చుచేయడానికి ఈతరం పేరెంట్స్ అస్సలు వెనకాడటంలేదు... అందుకే చిన్నారులు ఇష్టపడే టపాసుల వ్యాపారంలో మంచి లాభాలుంటున్నాయి. ఇది సీజనల్ వ్యాపారం కాబట్టి ప్రతిఏటా టపాసులు అమ్మేవారి సంఖ్య పెరుగుతోంది. ఇలా ఈసారి కూడా ఎక్కడిక్కడ క్రాకర్స్ షాపులు వెలిశాయి.... వ్యాపారం జోరుగా సాగితే ఆల్ టైమ్ రికార్డులను బద్దలుగొడుతూ లక్ష కోట్ల అమ్మకాలు జరుగుతాయని హోల్ సేల్ వ్యాపారులు చెబుతున్నారు.
55
శివకాశీలో వేలకోట్ల వ్యాపారం...
దీపావళికి శివకాశిలో భారీగా క్రాకర్స్ వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ వెలిసిన బాణాసంచా పరిశ్రమలో దాదాపు 3 లక్షల మందికి పైగా కార్మికులు కష్టపడి ఏడాదంతా తయారుచేసిన టపాసులు ఒక్క దీపావళి పండక్కి అమ్ముడుపోతాయి. దేశ నలుమూలల నుండి వ్యాపారులు వచ్చి లారీలకు లారీల సరుకు తీసుకెళతారు. ఇలా ఒక్క శివకాశిలోనే దీపావళికి వేలకోట్ల బాణాసంచా వ్యాపారం జరుగుతుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే ఇది వేలాది కోట్ల వ్యాపారం.