
ప్రస్తుతం కమోడిటీ మార్కెట్‌లో కొన్ని లోహాల ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా 2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో బంగారం, వెండి ధరలు ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. గతేడాది కాలంలో బంగారం దాదాపు 70 నుంచి 80 శాతం రిటర్న్స్ ఇవ్వగా, వెండి ఏకంగా 140 శాతం మేర లాభాలను అందించింది.
అయితే, ఇప్పుడు ఈ రెండు విలువైన లోహాల బాటలోనే రాగి (కాపర్) కూడా పయనిస్తోంది. కాపర్ ధరలు ప్రస్తుతం 15 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. కేవలం ఒకే ఒక్క కారణం వల్ల కాకుండా, అనేక అంతర్జాతీయ పరిణామాలు, బలమైన మార్కెట్ పరిస్థితుల కారణంగా రాగి ధరల్లో ఈ భారీ ర్యాలీ కనిపిస్తోంది. దీంతో రాగి పై ఇన్వెస్టర్లు, తయారీదారులు, పాలసీ మేకర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలు కాపర్ ధర ఇంతలా పెరగడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
కాపర్ ధరలు ఆకాశాన్ని తాకడానికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిఫికేషన్. సంప్రదాయ వ్యవస్థలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు, చార్జింగ్ స్టేషన్లు, పవర్ గ్రిడ్ అప్‌గ్రేడ్‌లకు రాగి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది.
ప్రపంచ దేశాలు క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగాలలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో కాపర్ డిమాండ్ అంచనాలకు మించి పెరిగింది. యుటిలిటీ కంపెనీలు, ఆటోమొబైల్ తయారీదారులు, ఇన్‌ఫ్రా డెవలపర్లు ముందుగానే కాపర్ సరఫరాను రిజర్వ్ చేసుకుంటున్నారు. దీనివల్ల ఫిజికల్ మార్కెట్‌లో రాగి సరఫరా కొరత ఏర్పడింది.
మరోవైపు, ప్రపంచంలోనే అత్యధికంగా కాపర్ వినియోగించే దేశం చైనా. అక్కడ తయారీ రంగం నిలకడగా ఉండటం కూడా డిమాండ్‌ను పెంచింది. చైనాలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, తయారీ రంగానికి ప్రభుత్వం ఇచ్చే ఏ చిన్న ప్రోత్సాహకమైనా వెంటనే అంతర్జాతీయంగా కాపర్ ధరలను ప్రభావితం చేస్తోంది.
డిమాండ్ విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, దానికి తగ్గట్టుగా సరఫరా లేకపోవడం ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తోంది. కొత్తగా కాపర్ గనుల ప్రారంభానికి చాలా సమయం పట్టడంతో పాటు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒక కొత్త గనిని అభివృద్ధి చేసి ఉత్పత్తిని ప్రారంభించడానికి దాదాపు 10 నుండి 15 ఏళ్ల సమయం పడుతుంది.
ప్రధాన కాపర్ ఉత్పత్తి ప్రాంతాల్లో నిర్వహణ సమస్యలు, రెగ్యులేటరీ ఆటంకాలు, గత కొన్నేళ్లుగా సరైన పెట్టుబడులు లేకపోవడం వల్ల ఉత్పత్తి దెబ్బతింది. ఉత్పత్తి పెరిగిన కొన్ని ప్రాంతాల్లో కూడా, విపరీతంగా పెరుగుతున్న డిమాండ్‌ను అందుకోలేకపోతున్నాయి. డిమాండ్, సరఫరా మధ్య ఉన్న ఈ అసమతుల్యత మార్కెట్ పరిస్థితులపై ప్రభావం చూపిస్తున్నాయి.
ప్రస్తుతం గ్లోబల్ ఎక్స్ఛేంజీలు, స్టోరేజీలలో కాపర్ నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇన్వెంటరీ తక్కువగా ఉన్నప్పుడు, డిమాండ్ కొద్దిగా పెరిగినా లేదా సరఫరాలో చిన్న అంతరాయం కలిగినా ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. మార్కెట్‌లో అదనపు డిమాండ్‌ను తట్టుకునేందుకు తగినంత బఫర్ స్టాక్ లేకపోవడం వల్ల ధరల తీవ్రత ఎక్కువగా ఉంది.
ధరలు పెరిగినప్పటికీ సరఫరా, డిమాండ్ అసమతుల్యత కారణంగా మార్కెట్ టైట్‌గానే ఉంది. భౌతిక డిమాండ్, సరఫరాలే కాకుండా, ఇన్వెస్టర్ల ప్రవర్తన కూడా ఈ ర్యాలీని మరింత ముందుకు తీసుకెళ్తోంది.
కాపర్‌ను కేవలం ఒక ఇండస్ట్రియల్ మెటల్‌గా కాకుండా, దీర్ఘకాలిక ఆర్థిక మార్పులకు సంకేతంగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అందుకే ఫండ్స్, ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కమోడిటీ మార్కెట్‌లో తమ పెట్టుబడులను పెంచుతున్నారు.
అంతేకాకుండా, వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాల కారణంగా అమెరికన్ డాలర్ బలహీనపడింది. డాలర్ విలువ తగ్గినప్పుడు, డాలర్లలో ట్రేడ్ అయ్యే కాపర్ వంటి కమోడిటీలు ఇతర కరెన్సీల వారికి చౌకగా మారి, పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారుతాయి. అలాగే, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సరఫరా గొలుసు ఆందోళనలు కూడా రాగి ధరలను పెంచుతున్నాయి.
కాపర్ ధరల్లో ప్రస్తుతం కనిపిస్తున్న పెరుగుదల బలంగా ఉన్నప్పటికీ, ఇది నిరంతరం ఇలాగే పెరుగుతుందని చెప్పలేము. ప్రపంచ తయారీ రంగంలో మందగమనం, చైనా నుండి డిమాండ్ తగ్గడం లేదా సరఫరాలో అంతరాయాలు తగ్గితే రాగి ధరలపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. అయితే, రాబోయే కాలంలో స్వల్పకాలికంగా చిన్నపాటి తగ్గుదల కనిపించవచ్చు.
అయితే, దీర్ఘకాలికంగా చూస్తే కాపర్ ట్రెండ్ బుల్లిష్‌గానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. విద్యుదీకరణ, మౌలిక సదుపాయాల కల్పన రాబోయే కొన్నేళ్లపాటు కొనసాగుతుంది కాబట్టి కాపర్ డిమాండ్ బలంగానే ఉంటుంది. కాపర్ ఇప్పుడు కేవలం పారిశ్రామిక లోహం మాత్రమే కాదు, ప్రపంచ వృద్ధికి మూలస్తంభంగా మారిందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.