
దేశ రాజధాని న్యూఢిల్లీ ఇప్పుడు ప్రపంచానికి పవర్ సెంటర్‌గా మారింది. ప్రతిష్ఠాత్మక 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు 2026 ఇక్కడే ఎంతో వైభవంగా జరుగుతోంది. చైనా, రష్యా, బ్రెజిల్, సౌదీ అరేబియా, ఇరాన్ వంటి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల అగ్రనేతలు ఈ సదస్సుకు హాజరయ్యారు. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు ఢిల్లీ నగరాన్ని పూర్తిస్థాయిలో భద్రతా బలగాల పహారాలో ఉంచారు.
మొత్తం 11 సభ్య దేశాలు, 10 భాగస్వామ్య దేశాల ప్రతినిధులు భారత్‌కు చేరుకున్నారు. ఈ సమ్మిట్ సందర్భంగా చైనా, రష్యా, ఇరాన్ దేశాలతో భారత్ ద్వైపాక్షిక చర్చలు జరుపుతోంది. అయితే ఈ మహా సదస్సు వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు వచ్చే లాభం ఏంటి? అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ కూటమిపై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి చెక్ పెడుతూ భారత్ బ్రిక్స్ సమ్మిట్ లో సంచలన ప్రతిపాదనలు చేసింది. ఈ సదస్సు నుంచి భారత్ ఏం ఆశిస్తోందో కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, ఎస్. జైశంకర్ తమ ప్రసంగాల ద్వారా స్పష్టం చేశారు. 'బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ 2026' ప్రారంభోత్సవంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిక్స్ దేశాల కోసం కొత్తగా ఏదైనా ఉమ్మడి కరెన్సీని తీసుకురావడానికి బదులుగా, సభ్య దేశాలు తమ స్వదేశీ కరెన్సీలలోనే వ్యాపారం చేసుకోవాలని ఆయన ప్రతిపాదించారు. అంటే భారత్, చైనాల మధ్య వ్యాపారం జరిగితే చెల్లింపులు రూపాయి, యువాన్లలోనే జరగాలి. దీనివల్ల అమెరికన్ డాలర్‌పై ఆధారపడటం పూర్తిగా తగ్గుతుంది.
కేవలం లోకల్ కరెన్సీ ట్రేడింగ్ మాత్రమే కాకుండా, బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల మధ్య డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేయాలని భారత్ కోరింది. భారత్‌లో విజయవంతమైన యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) మోడల్‌ను పియూష్ గోయల్ ఉదాహరణగా చూపించారు. భారతదేశంలో యూపీఐ ద్వారా వేగవంతమైన, సురక్షితమైన లావాదేవీలు ఎలా జరుగుతున్నాయో వివరిస్తూ, బ్రిక్స్ దేశాలన్నీ తమ పేమెంట్ సిస్టమ్‌లను ఒకదానితో ఒకటి అనుసంధానించాలని పిలుపునిచ్చారు. దీనివల్ల సరిహద్దులు దాటి జరిగే వ్యాపార చెల్లింపులు చాలా సులభంగా, వేగంగా పూర్తవుతాయని, వ్యాపార వ్యయం తగ్గుతుందని భారత్ స్పష్టం చేసింది.
ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న సమస్యల వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు, ఎల్‌పీజీ సంక్షోభం తలెత్తుతోంది. ఈ సమస్యకు బ్రిక్స్ సమ్మిట్ లో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ బలమైన పరిష్కారాన్ని చూపించారు. బ్రిక్స్ దేశాలన్నీ కలిసి ఒక కొత్త రకాల ఎనర్జీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసుకోవాలని జైశంకర్ పిలుపునిచ్చారు. ఎలాంటి భౌగోళిక-రాజకీయ లేదా యుద్ధ సంక్షోభాలు ఎదురైనా తట్టుకునేలా ఒక స్వతంత్ర ఇంధన సరఫరా వ్యవస్థను ఏర్పరచుకోవాలన్నారు. ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా, రష్యా వంటి ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలు ఈ కూటమిలో ఉండటం భారత్‌కు కలసివచ్చే అంశం.
గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) డేటా ప్రకారం, ఆర్థిక సంవత్సరం 2025లో బ్రిక్స్ దేశాలు ఏకంగా 5.67 ట్రిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేశాయి. ఇది ప్రపంచ మొత్తం ఎగుమతుల్లో 21.6 శాతానికి సమానం. అయితే బ్రిక్స్ దేశాల మధ్య అంతర్గత ఎగుమతులు 1.1 ట్రిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. ఇది వాటి మొత్తం ఎగుమతుల్లో 18.8 శాతం మాత్రమే. భారత్ విషయానికి వస్తే, ఆర్థిక సంవత్సరం 2026లో బ్రిక్స్ దేశాలతో ట్రేడ్ డెఫిసిట్ 226.1 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2021లో ఇది 74.5 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉండేది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల సంయుక్త జీడీపీ ఏకంగా 41 శాతంగా ఉంది. ప్రపంచ జనాభాలో ప్రతి ఇద్దరిలో ఒకరు బ్రిక్స్ దేశాల్లోనే నివసిస్తున్నారు. ప్రపంచ వ్యాపారంలో బ్రిక్స్ వాటా 26 శాతంగా ఉంది. ఒకవేళ బ్రిక్స్ దేశాల మధ్య అంతర్గత వ్యాపారం పెరిగి, చెల్లింపులు స్వదేశీ కరెన్సీలలో జరిగితే పాశ్చాత్య దేశాల మార్కెట్లపై ఆధారపడటం తగ్గుతుంది. చైనా, రష్యా వంటి తయారీ కేంద్రాలు, ఇరాన్, సౌదీ వంటి ఇంధన వనరులు, భారత్ వంటి భారీ మార్కెట్ ఒకే కూటమిలో ఉండటం వల్ల డాలర్ ఆధిపత్యం దెబ్బతింటుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసే టారిఫ్ బెదిరింపులు కూడా పనిచేయవు. అందుకే అమెరికా ఈ బ్రిక్స్ సమ్మిట్‌ను చూసి తీవ్ర ఆందోళన చెందుతోంది.