
అంతర్జాతీయ విమాన ప్రయాణికుల హక్కుల కోసం పనిచేస్తున్న ప్రముఖ సంస్థ 'ఎయిర్‌హెల్ప్' (AirHelp) 2025 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థల జాబితాను విడుదల చేసింది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడం, సమయపాలన పాటించడం వంటి కీలక అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్‌ను రూపొందించారు.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఎయిర్‌హెల్ప్ స్కోర్ 2025' (AirHelp Score 2025) రిపోర్టులో ఖతార్ ఎయిర్‌వేస్ అగ్రస్థానంలో నిలవగా, అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఏ ఒక్క విమానయాన సంస్థ కూడా టాప్-10లో చోటు దక్కించుకోలేకపోవడం గమనార్హం.
ఈ వార్షిక రిపోర్టు కేవలం బ్రాండ్ ఇమేజ్ లేదా లగ్జరీ సౌకర్యాలను మాత్రమే కాకుండా, ప్రయాణికులకు నిజంగా అవసరమైన అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారు. 2024 క్యాలెండర్ ఇయర్‌లో ఎయిర్‌లైన్స్ పనితీరు ఆధారంగా ఈ 2025 ర్యాంకింగ్స్‌ను ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగంలో విశ్వసనీయమైన బెంచ్‌మార్క్‌గా ఈ రిపోర్టును పరిగణిస్తారు.
ఎయిర్‌హెల్ప్ సంస్థ ఈ ర్యాంకింగ్స్‌ను ప్రధానంగా మూడు కీలక అంశాల ఆధారంగా నిర్ణయిస్తుంది. ప్రతి ఎయిర్‌లైన్‌కు 10 పాయింట్ల స్కోర్ ఉంటుంది. వాటిలో ప్రధాన అంశాలు..
1. సమయపాలన : విమానాలు షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయా లేదా అనేది ఇందులో చూస్తారు. నిర్ణీత సమయానికి లేదా గరిష్ఠంగా 15 నిమిషాల లోపు గమ్యస్థానానికి చేరుకునే విమానాలకు ఇందులో ఎక్కువ పాయింట్లు దక్కుతాయి. ఈ విభాగానికి అత్యధిక వెయిటేజీ ఉంటుంది.
2. కస్టమర్ ఒపీనియన్ : ప్రయాణికుల నుంచి సేకరించిన సర్వేల ఆధారంగా ఇది నిర్ణయిస్తారు. విమానంలో సీట్ల సౌకర్యం, ఆహారం, సిబ్బంది ప్రవర్తన, పరిశుభ్రత, మొత్తం ప్రయాణ అనుభవం వంటి అంశాలు ఇందులో పరిగణనలోకి తీసుకుంటారు.
3. క్లెయిమ్స్ ప్రాసెసింగ్ : విమానాలు రద్దయినప్పుడు, ఆలస్యమైనప్పుడు లేదా బోర్డింగ్ నిరాకరించినప్పుడు.. ప్రయాణికులకు చట్టపరంగా రావాల్సిన పరిహారాన్ని ఆయా సంస్థలు ఎంత వేగంగా, ఎంత సమర్థంగా అందిస్తున్నాయనేది ఇది లెక్కిస్తుంది.
తాజా ర్యాంకింగ్స్‌లో ఖతార్ ఎయిర్‌వేస్ (Qatar Airways) 8.16 స్కోర్‌తో టాప్ ప్లేస్ లో నిలిచింది. సమయపాలనలో కచ్చితత్వం, కస్టమర్ల సంతృప్తి విభాగాల్లో అద్భుతమైన పనితీరుతో ఈ సంస్థకు అగ్రస్థానం దక్కింది. నిరంతరాయంగా నాణ్యమైన సేవలు అందించడంలో ఖతార్ ఎయిర్‌వేస్ తన ఖ్యాతిని మరోసారి నిలబెట్టుకుంది.
రెండవ స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి చెందిన ఇతిహాద్ ఎయిర్‌వేస్ (Etihad Airways) నిలిచింది. ఈ సంస్థ 8.07 స్కోర్ సాధించింది. ముఖ్యంగా కస్టమర్ సర్వీస్, క్లెయిమ్స్ హ్యాండ్లింగ్‌లో ఇతిహాద్ మెరుగైన పాయింట్లు సాధించింది. ఇక మూడవ స్థానంలో బ్రిటన్‌కు చెందిన వర్జిన్ అట్లాంటిక్ (Virgin Atlantic) 8.03 స్కోర్‌తో నిలిచింది. క్యాబిన్ సౌకర్యాలు, ప్రయాణికుల అనుభవం విషయంలో ఈ సంస్థకు మంచి గుర్తింపు లభించింది.
ఎయిర్‌హెల్ప్ విడుదల చేసిన 2025 టాప్-10 విమానయాన సంస్థలు, వాటి స్కోర్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి..
1. ఖతార్ ఎయిర్‌వేస్ (Qatar Airways) - 8.16
2. ఇతిహాద్ ఎయిర్‌వేస్ (Etihad Airways) - 8.07
3. వర్జిన్ అట్లాంటిక్ (Virgin Atlantic) - 8.03
4. క్వాంటాస్ (Qantas - ఆస్ట్రేలియా) - 7.99
5. కేఎం మాల్టా ఎయిర్‌లైన్స్ (KM Malta Airlines) - 7.85
6. ఏరోమెక్సికో (Aeromexico) - 7.84
7. ఒమన్ ఎయిర్ (Oman Air) - 7.82
8. సౌదియా (Saudia - సౌదీ అరేబియా) - 7.69
9. బ్రస్సెల్స్ ఎయిర్‌లైన్స్ (Brussels Airlines) - 7.66
10. లాట్ పోలిష్ ఎయిర్‌లైన్స్ (LOT Polish Airlines) - 7.65
ఈ రిపోర్టులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలోనే అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్ అయిన అమెరికాకు చెందిన ఒక్క ఎయిర్‌లైన్ కూడా టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయింది. అమెరికాకు చెందిన పలు విమానయాన సంస్థలు తమ పనితీరును మెరుగుల్చుకున్నప్పటికీ, ప్రపంచ స్థాయి అత్యుత్తమ ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యాయని ఎయిర్‌హెల్ప్ పేర్కొంది.
ఈ జాబితాలో యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు చెందిన ఎయిర్‌లైన్స్ హవా కొనసాగింది. కేవలం బ్రాండ్ పేరు గొప్పగా ఉంటే సరిపోదని, ప్రయాణికుల పట్ల బాధ్యత, పారదర్శకమైన సేవలు అందించే సంస్థలే అత్యుత్తమంగా నిలుస్తాయని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
విమాన టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు కేవలం మార్కెటింగ్ ప్రకటనలను నమ్మకుండా, వాస్తవ డేటా ఆధారంగా నిర్ణయం తీసుకోవడానికి ఈ ఎయిర్‌హెల్ప్ స్కోర్ ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దూర ప్రాంతాలకు లేదా విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఇది ఒక గైడ్‌గా పనిచేస్తుంది.