Adani vs Vedanta Battle : ₹57,000 కోట్ల అప్పుల్లో ఉన్న జేపీ అసోసియేట్స్‌ను దక్కించుకునేందుకు గౌతమ్ అదానీ, అనిల్ అగర్వాల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ వివాదం ఇప్పుడు సుప్రీం కోర్టుకు చేరింది.
ఒకప్పుడు భారత మౌలిక సదుపాయాల రంగంలో రారాజుగా వెలిగిన జేపీ అసోసియేట్స్ ఇప్పుడు దేశంలోని ఇద్దరు అపర కుబేరుల మధ్య యుద్ధానికి కారణమైంది. సుమారు ₹57,000 కోట్ల భారీ అప్పుల్లో కూరుకుపోయి, దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న ఈ కంపెనీని దక్కించుకోవడానికి గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్, అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత గ్రూప్ తలపడుతున్నాయి. ఈ కార్పొరేట్ వివాదం చివరకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది.
25
అసలు ఏమిటీ వివాదం? అధిక బిడ్ వేసినా వేదాంతకు దక్కని డీల్
జేపి అసోసియేట్స్ విక్రయ ప్రక్రియలో భాగంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) బిడ్లను ఆహ్వానించింది. ఇందులో అదానీ ఎంటర్ ప్రైజెస్ ₹14,535 కోట్ల బిడ్‌ను దాఖలు చేయగా, అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత గ్రూప్ అంతకంటే ఎక్కువగా అంటే ₹16,726 కోట్ల భారీ ఆఫర్‌ను ఇచ్చింది. సాధారణంగా ఎక్కువ నగదు ఇచ్చే వారికే కంపెనీ దక్కాలి. కానీ, ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది. వేదాంత కంటే తక్కువ బిడ్ వేసినప్పటికీ, అదానీ ప్లాన్‌కే కమిటీ ఆఫ్ క్రెడిటర్స్, ఎన్సీఎల్టీ మొగ్గు చూపాయి. దీనిని సవాలు చేస్తూ వేదాంత గ్రూప్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
35
అదానీ వైపు మొగ్గు చూపడానికి కారణాలేంటి?
కేవలం బిడ్ మొత్తం మాత్రమే కాకుండా, చెల్లింపుల కాలపరిమితి, తక్షణమే ఇచ్చే నగదు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అదానీ ప్లాన్‌ను ఆమోదించినట్లు బ్యాంకులు, కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ వెల్లడించాయి. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ నిబంధనల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు స్పష్టం చేశారు. అయితే, తక్కువ బిడ్‌ను ఎలా ఆమోదిస్తారని వేదాంత గ్రూప్ సుప్రీం కోర్టులో వాదిస్తోంది.
అప్పుల్లో ఉన్నా జేపీ అసోసియేట్స్ కోసం ఎందుకీ పోటీ?
జేపి అసోసియేట్స్ అప్పుల్లో ఉన్నప్పటికీ, దానికున్న ఆస్తులు, వ్యాపార సామ్రాజ్యం చాలా విస్తృతమైనది. యమునా ఎక్స్‌ప్రెస్‌వే వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో పాటు, జేపీ గ్రీన్స్ రియల్ ఎస్టేట్, జేపీ పవర్ వెంచర్స్, భారీ సిమెంట్ ప్లాంట్లు, సున్నపురాయి గనులు, స్టార్ హోటళ్లు ఈ సంస్థ సొంతం. ఢిల్లీ-ఎన్‌సీఆర్, ఆగ్రా, ముస్సోరీ వంటి ప్రాంతాల్లో ఈ సంస్థకు వేల కోట్ల విలువైన భూములు, ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులను దక్కించుకోవడం ద్వారా తమ వ్యాపారాన్ని మల్టీ-ఫోల్డ్ పెంచుకోవచ్చని అదానీ, వేదాంత భావిస్తున్నాయి.
55
అదానీ లక్ష్యం ఏమిటి?
ఈ డీల్ గెలవడం ద్వారా అదానీ గ్రూప్ రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో తిరుగులేని శక్తిగా ఎదగాలని చూస్తోంది. ముఖ్యంగా సిమెంట్ వ్యాపారంలో అదానీ ఇప్పటికే దూసుకుపోతున్నారు. జేపీ అసోసియేట్స్ సిమెంట్ ప్లాంట్లు చేతికి వస్తే, ఉత్తర భారతదేశంలో అదానీ పట్టు మరింత పెరుగుతుంది. అలాగే హస్పిటాలిటీ, పవర్ సెక్టార్లలో కూడా తమ ఉనికిని చాటుకోవాలని అదానీ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు అనిల్ అగర్వాల్ కూడా ఈ ఆస్తుల ద్వారా తన వ్యాపార వైవిధ్యాన్ని పెంచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
టాప్ బిజినెస్ నుంచి అప్పుల ఊబిలోకి జేపీ ప్రస్థానం
జేపి గ్రూప్ వ్యవస్థాపకుడు జైప్రకాష్ గౌర్. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన ఆయన 1979లో ఈ సంస్థకు పునాది వేశారు. ఒకప్పుడు ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో 48వ స్థానంలో నిలిచిన ఆయన సంపద 1.5 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే, వ్యాపార విస్తరణలో తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు, భారీగా తీసుకున్న రుణాలు సంస్థను ₹57,000 కోట్ల అప్పుల్లోకి నెట్టాయి. ఒకప్పుడు డ్యామ్‌లు, హైవేలు నిర్మించిన ఈ దిగ్గజ సంస్థ ఇప్పుడు వేలం పాటలో ఇద్దరు దిగ్గజాల మధ్య చిక్కుకుంది.