Rakhi 2026: రాఖీ ఎప్పుడు క‌ట్టాలి.? స‌రైన సమయం ఏంటో తెలుసా.?

Published : Aug 28, 2026, 06:10 AM IST

Rakhi: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రక్షాబంధన్ పండుగపై ఈ ఏడాది తేదీ విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. రాఖీ ఎప్పుడు క‌ట్టాల‌న్న దానిపై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ న‌డుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు.

PREV
15
2026లో రక్షాబంధన్ ఎప్పుడు?

హిందూ పంచాంగం ప్రకారం ఈసారి శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27, గురువారం ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై ఆగస్టు 28, శుక్రవారం ఉదయం 9:48 గంటలకు ముగుస్తుంది. పౌర్ణమి రెండు క్యాలెండర్ తేదీల్లో ఉన్నప్పటికీ.. సూర్యోదయ సమయంలో ఉండే తిథికి శాస్త్రోక్తంగా ప్రాధాన్యం ఇస్తారు. ఈ కారణంగా ఆగస్టు 28నే రక్షాబంధన్ పండుగగా పరిగణిస్తున్నారు.

25
రాఖీ కట్టేందుకు శుభ సమయం ఏది?

ఆగస్టు 28 ఉదయం రాఖీ కట్టేందుకు అనుకూలమైన సమయం ఉందని పండితులు చెబుతున్నారు. ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఉదయం 5:57 గంటల నుంచి 9:48 గంటల వరకు శుభ సమయంగా పేర్కొంటున్నారు. విశాఖపట్నానికి చెందిన పండితుల సూచన ప్రకారం.. ఆ రోజు ఉదయం 5:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల మధ్య కూడా రాఖీ కట్టడం అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు.

అయితే సూర్యోదయం, స్థానిక పంచాంగ లెక్కల్లో నగరాల మధ్య స్వల్ప తేడాలు ఉంటాయి. అందువల్ల హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాల్లో నివసించే వారు తమ ప్రాంతానికి సంబంధించిన పంచాంగాన్ని చూసుకుని ఖచ్చితమైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవడం మంచిది.

35
ఆగస్టు 27న ఎందుకు రాఖీ కట్టకూడదని చెబుతున్నారు?

ఆగస్టు 27న పౌర్ణమి ప్రారంభమైనప్పటికీ.. ఆ రోజున ఎక్కువ సమయం భద్ర కాలం ఉండటాన్ని పండితులు ప్రస్తావిస్తున్నారు. హిందూ సంప్రదాయంలో భద్ర సమయంలో కొన్ని శుభకార్యాలు నిర్వహించకూడదనే నమ్మకం ఉంది. దీంతో పౌర్ణమి ప్రారంభమైన తేదీ కంటే సూర్యోదయ తిథికి ప్రాధాన్యం ఇచ్చి ఆగస్టు 28న రక్షాబంధన్ జరుపుకోవాలని సూచిస్తున్నారు. అందువల్ల రెండు తేదీలపై ఉన్న సందేహానికి ప్రధాన కారణం పౌర్ణమి తిథి రెండు రోజులకు విస్తరించడమే. స్థానిక ఆచారాలు, పంచాంగ పద్ధతుల ఆధారంగా ముహూర్తాల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని గుర్తుంచుకోవాలి.

45
రక్షాబంధన్ పండుగ ప్రాముఖ్యత ఏమిటి?

రక్షాబంధన్ సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు ప్రతీకగా భావిస్తారు. ఈ రోజున సోదరీమణులు సోదరుల చేతికి రాఖీ కట్టి వారి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం ప్రార్థిస్తారు. సోదరులు తమ సోదరీమణులకు అండగా ఉంటామని మాట ఇస్తూ బహుమతులు అందించడం ఆనవాయితీ. రక్షాబంధన్‌కు సంబంధించిన పౌరాణిక కథల్లో శ్రీకృష్ణుడు, ద్రౌపది కథ ప్రస్తావనకు వస్తుంది. శ్రీకృష్ణుడి వేలికి గాయమైనప్పుడు ద్రౌపది తన చీర కొంగును చింపి కట్టిన ఘటనను సోదరభావానికి ఉదాహరణగా చెబుతారు. అలాగే ఇంద్రుడి విజయాన్ని కోరుతూ శచీదేవి రక్ష కట్టిన కథ కూడా ఈ పండుగ ప్రాముఖ్యతను వివరించే కథల్లో ఒకటిగా ఉంది.

55
చంద్రగ్రహణం ప్రభావం ఉంటుందా?

ఆగస్టు 28న పాక్షిక చంద్రగ్రహణం ఉన్నప్పటికీ అది భారతదేశంలో కనిపించదని పండితులు చెబుతున్నారు. చంద్రుడు భారతదేశంలోని ప్రాంతాల నుంచి కనిపించని సమయంలో ఈ గ్రహణం ఏర్పడనున్నందున ఇక్కడ గ్రహణ సూతక నియమాలు వర్తించవని వారు పేర్కొంటున్నారు. అందువల్ల రక్షాబంధన్ వేడుకలను సాధారణంగా నిర్వహించుకోవచ్చని సూచిస్తున్నారు. పండుగ రోజున సోదరీమణులు సోదరులకు తిలకం దిద్ది, హారతి ఇచ్చి రాఖీ కట్టడం ఆనవాయితీ. ముఖ్యంగా రాఖీ ముహూర్తం విషయంలో ప్రాంతానుసారంగా స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉన్నందున స్థానిక పంచాంగాన్ని ఆధారంగా చేసుకోవడం ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories