YS Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమ‌రావ‌తి కొన‌సాగ‌దా.? తేల్చి చెప్పేసిన జ‌గ‌న్

Published : Jul 01, 2026, 02:56 PM IST

YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర రాజకీయాలు, పాలన, రైతుల సమస్యలు, రాబోయే ఎన్నికల వ్యూహంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 

PREV
15
రాష్ట్రంలో భయపెట్టే పాలన కొనసాగుతోందని ఆరోపణ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘రూల్ ఆఫ్ లా’ బలహీనపడిందని జగన్ విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై ఒత్తిడి, కేసులు, వేధింపులు పెరిగాయని అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహారాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, రాష్ట్రంలో ప్రజలకు భద్రతాభావం లేకుండా పోయిందన్నారు.

25
విజయవాడ ఘటనలపై సమగ్ర దర్యాప్తు కోరిన జగన్

విజయవాడ పరిధిలో సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాల అంశాన్ని ప్రస్తావించిన జగన్, ఈ ఘటనలపై పూర్తి స్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేశారు. పోలీసు కస్టడీలో జరిగిన పరిణామాలపై అనేక సందేహాలు ఉన్నాయని, సంబంధిత అధికారులు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తొల‌గించార‌న్న‌ ఆరోపణలపై కూడా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. అమరావతి ప్రాంతంలో భూములు ఇవ్వని రైతులకు సపోర్ట్ గా నిలిచిన తమ పార్టీ నాయకులపై దాడులు చేసి, వారిపైనే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.

35
రైతుల పరిస్థితిపై ప్రభుత్వాన్ని నిల‌దీత‌

రాష్ట్రంలోని ఆక్వా, మామిడి, పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగన్ అన్నారు. రొయ్యల సాగు రంగంలో ఫీడ్ ధరలు పెరగడం, ఉత్పత్తుల ధరలు తగ్గడం వల్ల రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. తాము తీసుకొచ్చిన చట్టాల అమలులో నిర్లక్ష్యం కారణంగా ప్రైవేట్ సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని విమర్శించారు. మామిడి రైతుల సమస్యల పరిష్కారంలో కూడా ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందని, దీని వల్ల రైతులకు నష్టం జరిగిందని ఆరోపించారు.

45
‘మావిగన్’ అభివృద్ధి నమూనాతోనే ఎన్నికల్లోకి

రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ ప్రధాన అజెండా ‘మావిగన్’ (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు) అభివృద్ధి కారిడార్‌గా ఉంటుందని జగన్ ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే విమానాశ్రయం, ఓడరేవు, జాతీయ రహదారులు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని మరింత అభివృద్ధి చేసి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంగా మార్చడం సాధ్యమని చెప్పారు. అమరావతి నిర్మాణానికి భారీ వ్యయం అవసరమవుతుందని, అందుకే ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాగా ‘మావిగన్’ను ప్రజల ముందుకు తీసుకెళ్తామని వివరించారు. ప్రజా సమస్యలపై కలిసి పనిచేసే ప్రతి శక్తితో తాము సహకరిస్తామని కూడా స్పష్టం చేశారు.

55
ఓటర్ల జాబితాపై ఆరోపణలు.. మీడియాపైనా విమర్శలు

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో తమ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నిస్తే తమపై వ్యక్తిగత విమర్శలు చేయిస్తున్నారని, కొన్ని మీడియా సంస్థలను ఇందుకోసం ఉపయోగిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని, ప్రజల సపోర్ట్ తోనే వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటామని ఆయన పేర్కొన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories