Kadapa Steel Plant: రాయలసీమ ప్రజలు ఎన్నేళ్లుగా ఎదురుచూస్తున్న కడప స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు ఎట్టకేలకు కార్యరూపం దాల్చబోతోంది. జులై 3న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభం కానున్నాయి.
జులై 3న అధికారిక ప్రారంభం.. రాయలసీమకు కొత్త అధ్యాయం
కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలో ఉన్న సున్నపురాళ్లపల్లె, పెద్దదండ్లూరు ప్రాంతాల్లో ఈ మెగా స్టీల్ ప్లాంట్ నిర్మించనున్నారు. రాయలసీమ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయమై ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ.. కడప స్టీల్ ప్లాంట్ కేవలం ఒక పరిశ్రమ కాదని, ఇది రాయలసీమ ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేసే ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అందుకే ఇప్పుడు నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు.
24
రూ.16,350 కోట్ల పెట్టుబడి.. వేలాది ఉద్యోగాలకు అవకాశం
ఈ ప్రాజెక్టును ప్రముఖ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చేపట్టనుంది. మొత్తం 3,500 ఎకరాల విస్తీర్ణంలో రూ.16,350 కోట్ల పెట్టుబడితో ప్లాంట్‌ను అభివృద్ధి చేయనున్నారు. తొలి దశలో రూ.4,500 కోట్లతో నిర్మాణ పనులు చేపడతారు. రెండో దశలో రూ.11,850 కోట్లతో విస్తరణ పనులు కొనసాగిస్తారు. 2034 నాటికి పూర్తి స్థాయిలో ప్లాంట్ అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే రవాణా, లాజిస్టిక్స్, చిన్న పరిశ్రమలు, వ్యాపార రంగాలకు కూడా ఊతం లభించే అవకాశం ఉంది.
34
ముందుగానే మౌలిక వసతులు పూర్తి
నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగేందుకు ప్రభుత్వం ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేసింది. విద్యుత్, నీటి సరఫరా, రహదారులు వంటి కీలక మౌలిక సదుపాయాలను సిద్ధం చేసిన తర్వాతే పనులు ప్రారంభిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. ఇలా ముందస్తు ప్రణాళికతో పనులు ప్రారంభించడం వల్ల నిర్మాణం వేగంగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.
స్టీల్ ప్లాంట్ అంశంపై గత ప్రభుత్వాన్ని బైరెడ్డి శబరి తీవ్రంగా విమర్శించారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి సాధించలేదని, కనీసం కాంపౌండ్ వాల్ కూడా నిర్మించలేదని ఆరోపించారు. 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఆ ప్రాజెక్టును నిజంగా నిర్మించే దశకు తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వమేనని పేర్కొన్నారు.
రాయలసీమను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యం
రాయలసీమను కేవలం వ్యవసాయ ప్రాంతంగానే కాకుండా పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, హార్టికల్చర్ రంగాల్లో ముందంజలో నిలిపే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. కడప స్టీల్ ప్లాంట్ ఆ లక్ష్యంలో అత్యంత కీలకమైన ప్రాజెక్టుగా భావిస్తోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే వందలాది కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని ప్రభుత్వం చెబుతోంది. కడప స్టీల్ ప్లాంట్ పూర్తయితే రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.