
World AIDS Day : హెచ్‌ఐవీ కేసుల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే టాప్ లో నిలిచినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. జాతీయ స్థాయిలో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (న్యాకో) నిర్దేశించిన 80% లక్ష్యంలో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ (ఏపీ శాక్స్) ఏకంగా 76.96% సాధించిందని ఆయన తెలిపారు. డిసెంబరు 1న ప్రపంచ ఎయిడ్స్ దినం (సోమవారం) సందర్భంగా మంత్రి ఆదివారం ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేశారు.
సాధారణ జనాభాలో పరీక్షలు చేయించుకున్న వారిలో హెచ్‌ఐవీ పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని మంత్రి పేర్కొన్నారు. 2015-16లో 2.34%గా ఉన్న పాజిటివిటీ రేటు, 2024-25 నాటికి 0.58% కు తగ్గిందని ఆయన స్పష్టం చేశారు. కండోమ్ వాడకం వంటి సురక్షిత విధానాలపై ప్రజల్లో పెంచిన అవగాహనతో పాటు ప్రభుత్వం తీసుకున్న పటిష్టమైన చర్యల ఫలితంగానే ఈ పాజిటివిటీ రేటు తగ్గుముఖం పట్టిందని మంత్రి వివరించారు.
అలాగే, న్యాకో ఇటీవల జారీచేసిన 2024-25 వార్షిక అంచనాల్లో కూడా కీలక వివరాలు వెల్లడయ్యాయి. 2010లో నమోదైన ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల మరణాలతో పోలిస్తే, 2024-25 నాటికి ఈ మరణాల సంఖ్య 88.72% మేర తగ్గినట్లు సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న హెచ్‌ఐవీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2015-16లో కొత్తగా 24,957 కేసులు నమోదవగా, 2018-19లో ఆ సంఖ్య 21,982కు తగ్గింది. తాజా అంచనాల ప్రకారం, 2024-25లో కొత్త కేసులు 13,383 మాత్రమే వచ్చినట్లు మంత్రి వివరించారు. బాధితుల్లో అవగాహన కల్పించడం, వారికి ఉచితంగా మందులు అందించడం ద్వారానే ఎయిడ్స్ సంబంధిత మరణాలను కూడా అరికట్టగలిగినట్లు ఆయన తెలిపారు.
అయితే, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం హెచ్‌ఐవీ కేసుల్లో మహారాష్ట్ర (3,62,392) మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ (2,75,528) రెండో స్థానంలో ఉంది. అయినప్పటికీ, కొత్త కేసులు పెరగకుండా నిరోధించడంలో రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన పురోగతిని సాధిస్తోందని మంత్రి పేర్కొన్నారు.
హెచ్‌ఐవీ సంక్రమణను తగ్గించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. ముఖ్యంగా గర్భిణుల్లో హెచ్‌ఐవీ పాజిటివిటీ రేటు తగ్గింపులో ఏపీ మెరుగైన ఫలితాలను సాధించింది. 2015-16లో గర్భిణుల్లో ఈ రేటు 0.10% ఉండగా, 2024-25 నాటికి అది 0.04% కు తగ్గిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
హెచ్‌ఐవీ బాధితులకు మెరుగైన జీవనాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం భారీగా ఖర్చు చేస్తోంది. ఒక్కో హెచ్‌ఐవీ బాధితుడిపై ఏడాదికి ప్రభుత్వం సగటున రూ.35,000 నుంచి రూ.40,000 వరకు ఖర్చు చేస్తోంది. సెంట్రల్ సెక్టార్ స్కీము కింద న్యాకో ద్వారా ఉచితంగా యాంటీ రిట్రోవైరల్ థెరపీ (ART) మందులు అందుతున్నాయి.
వైరల్ లోడ్ పరీక్షలు, ఇతరత్రా ఖర్చులకు కలిపి ప్రతినెలా ఒక్కో పేషెంట్‌కు రూ.3,000 నుంచి రూ.3,500 వరకు వ్యయమవుతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 59 ART కేంద్రాల ద్వారా ప్రతినెలా 2,38,760 మంది క్రమం తప్పకుండా మందులు పొందుతున్నారు. మందులను సక్రమంగా వాడుతున్న వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి.
ఉదాహరణకు, 2004లో గుంటూరు నగరంలో తొలి కేసు నమోదైన వ్యక్తి నేటికీ మందులు వాడుతూ మెరుగైన జీవనాన్ని సాగిస్తున్నారని మంత్రి తెలిపారు. అదనంగా, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో 42,008 మంది ప్రస్తుతం ప్రభుత్వ పింఛన్లు పొందుతున్నారు. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న మరికొందరి వివరాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి.
ఐక్యరాజ్య సమితి (యూఎన్ ఎయిడ్స్) నిర్దేశించిన 95%-95%-95% లక్ష్యాల సాధనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించింది. బాధితుల గుర్తింపు, వారికి మందులు ఇప్పించడం, వారి శరీరంలో వైరస్ లోడు తగ్గించడంలో రాష్ట్రం ముందుంది.
న్యాకో వెల్లడించిన 2024-25 స్కోర్కార్డులో ఏపీ ప్రభుత్వం రెండో స్థానంలో ఉన్నట్లు నీలకంఠారెడ్డి పేర్కొన్నారు. హెచ్‌ఐవీ నియంత్రణకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో పురోగతి ఉన్నట్లు న్యాకో ధృవీకరించిందని తెలిపారు.
హైరిస్క్ బిహేవియర్ (మల్టీపుల్ భాగస్వాములు) కలిగి ఉండి, హెచ్‌ఐవీ పరీక్షల్లో నెగెటివ్ వస్తున్నప్పటికీ, వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు 'సంపూర్ణ సురక్ష కేంద్రాలు' దోహదపడుతున్నాయి. న్యాకో ద్వారా గత ఏడాది నుంచి పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 13 సంపూర్ణ సురక్ష కేంద్రాలు నడుస్తున్నాయి.
ఇప్పటి వరకు సుమారు 35,000 మందికి ఈ కేంద్రాల ద్వారా కౌన్సెలింగ్, హెచ్‌ఐవీ, ఇతర పరీక్షలు చేశారు. హైరిస్క్ గ్రూపులలో ఉన్న వారికి ఏడాదిలో రెండుసార్లు హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 109 ఎన్జీఓలు చురుకుగా పనిచేస్తున్నాయి.