Netra Mantena Marriage : తెలుగింటి ఆడబిడ్డ నేత్ర మంతెన వివాహం ఉదయ్ పూర్ లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. కూతురు పెళ్లి అట్టహాసంగా నిర్వహిస్తున్న రామరాజు మంతెన పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఈయన ఎవరో తెలుసుకుందాం…
Rama Raju Manthena : ఇండియాలోనే ఖరీదైన పెళ్ళి ఏదంటే టక్కున అంబానీ ఇంట గతేడాది జరిగిన పెళ్లి గుర్తుకువస్తుంది. భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లికి వేలకోట్లు ఖర్చు చేశారు. ఈ పెళ్లి స్థాయిలోనే ఇండియాలో మరో ఖరీదైన వివాహం జరుగుతోంది. ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ పెళ్లి మన తెలుగింటి ఆడబిడ్డది కావడం విశేషం.
అమెరికాలో స్థిరపడిన ప్రముఖ వ్యాపారవేత్త రామరాజు మంతెన కూతురు పెళ్లిని స్వదేశంలో అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. తెలుగింటి ఆడబిడ్డ నేత్ర మంతెన, వంశీ గాదిరాజును వివాహమాడుతోంది. ఇప్పటికే రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ రాజభవనాల్లో ఈ పెళ్ళి వేడుకలు ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయుడు ట్రంప్ జూనియర్, అంతర్జాతీయ సెలబ్రిటీలు జెన్నిఫర్ లోపెజ్, జస్టిన్ బీబర్ వంటివారు ఈ పెళ్లికి హాజరవుతున్నారు. అందుకే నేత్ర మంతెన-వంశీ గాదిరాజు పెళ్ళి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
25
ఎవరి రామరాజు మంతెన?
రామరాజు మంతెన ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవారు... ఆయన విద్యాభ్యాసమంతా ఇక్కడే సాగింది. జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, JNTU) నుండి కంప్యూటర్ సైన్స్ ఆండ్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన రామరాజు యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ లో క్లినికల్ ఫార్మా పూర్తిచేశారు. కొంతకాలం వివిధ ఫార్మా కంపెనీల్లో పనిచేసిన ఆయన సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించారు... అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు అమెరికా ఫార్మా రంగాన్ని ఏలుతున్నారు.
35
రామరాజు నెట్ వర్త్ ఎంత?
రామరాజు మంతెన ప్రస్తుతం ఇంజెనస్ ఫార్మాస్యూటికల్స్ కి సీఈవో, చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఫార్మా, మెడికల్ రంగానికి చెందిన ఐకోర్ హెల్త్ కేర్ (ICORE Healthcare), ఆంకో స్క్రిప్ట్ (OncoScript)గ్లోబల్ సంస్థలకు యజమాని. కేవలం అమెరికాలోనే కాదు స్వదేశం భారత్, స్విట్జర్లాండ్ లలో కూడా రామరాజు ఫార్మా వ్యాపారం కొనసాగుతోంది.
ఇలా ఫార్మా రంగంతో పాటు మరికొన్ని వ్యాపారాలను కూడా రామరాజు మంతెన నిర్వహిస్తున్నారు. అతడి నెట్ వర్త్ దాదాపు 20 మిలియన్ డాలర్లు అంటే రూ.167 కోట్లు ఉంటుందని అంచనా. రామరాజు భార్య పద్మజ మంతెన, కూతురు నేత్ర మంతెన పేరిట కూడా కోట్లాది ఆస్తులు ఉన్నాయి. ఈ కుటుంబం అమెరికాలోనే రిచ్చెస్ట్ ఫ్యామిలీస్ లో ఒకటిగా గుర్తింపు పొందుతోంది.
విదేశాల్లో స్థిరపడినా, కోట్లు సంపాదిస్తున్నా తన మూలాలను మాత్రం మర్చిపోలేదు రామరాజు మంతెన. వీలు చిక్కినప్పుడల్లా ఆయన స్వరాష్ట్రం ఏపీకి వస్తుంటారు... తిరుమల వెంకటేశ్వర స్వామిని ఈ కుటుంబ ఆరాధ్యదైవం. 2017లో తిరుమల శ్రీవారికి 28 కిలోల బంగారు సహస్ర నామ మాలను బహూకరించి తన భక్తిని చాటుకున్నారు రామరాజు. ఈ సమయంలో రామరాజు మంతెన పేరు జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది. ఇప్పుడు కూతురు పెళ్లి సందర్భంగా రామరాజు పేరు దేశవ్యాప్తంగా గట్టిగా వినిపిస్తోంది.
55
నేత్ర మంతెన, వంశీ గాదిరాజు నేపథ్యం :
అమెరికన్ బిలియనీర్ రామరాజు మంతెన కూతురు నేత్రా మంతెన తండ్రిచాటు బిడ్డలా పెరగలేదు. ఆమె సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించారు... న్యూయార్క్ టెక్ ప్లాట్‌ఫామ్ 'సూపర్‌ఆర్డర్' సహ వ్యవస్థాపకురాలు, సీటీఓ. రెస్టారెంట్ డెలివరీ కార్యకలాపాలను సులభతరం చేయడంలో ఈ సంస్థ సహాయపడుతుంది.
మన తెలుగింటి ఆడబిడ్డ నేత్రను పెళ్లాడే వంశీ గాదిరాజు కొలంబియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. 2024లో ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకున్నారు. రెస్టారెంట్-టెక్ రంగంలో ఆయన ప్రభావం చూపుతున్నారు.
ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్, జెనానా మహల్ వంటి విలాసవంతమైన ప్రదేశాల్లో నేత్ర, వంశి వివాహ వేడుకలు జరుగుతున్నాయి. రాజస్థానీ స్టైల్లో వివాహం జరుగుతోంది... జూనియర్ ట్రంప్, పాప్ సింగర్స్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ ఈ పెళ్లికి హాజరవుతున్నారు.