
బంగాళాఖాతంలో మరో వాతావరణ వ్యవస్థ ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై ఆసక్తి నెలకొంది. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 31 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర పరిసరాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాతి రెండు రోజుల్లోనూ ఇదే దిశలో కదిలే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వ్యవస్థ కదలికలు, తీవ్రతను బట్టి ఏపీ తీర ప్రాంతాల్లో వర్షాల పరిస్థితి మారే అవకాశం ఉంది.
ఇటీవల అర్నబ్ తుపాను ప్రభావంతో ఇబ్బందిపడ్డ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సమయంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజా వాతావరణ వ్యవస్థ ప్రభావంతో రానున్న రోజుల్లో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.
ముఖ్యంగా నవంబర్ 1, 2 తేదీల్లో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని అంచనా వేసింది. దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముంది. అయితే, వర్షాల తీవ్రత, ఏయే ప్రాంతాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందనే విషయాలు వాతావరణ వ్యవస్థ తదుపరి కదలికలపై ఆధారపడి ఉంటాయి.
ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. శుక్రవారం వెల్లడించిన అంచనాల ప్రకారం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, పోలవరం, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తీర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. సముద్రంలో వాయుగుండం బలపడితే వర్షాల విస్తృతి, తీవ్రతలో మార్పులు చోటుచేసుకోవచ్చు. రైతులు, మత్స్యకారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు స్థానిక అధికారుల సూచనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాల కారణంగా రాకపోకలకు అంతరాయం కలగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ రానున్న మూడు రోజుల వాతావరణంపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనాలు వెల్లడించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. మరోవైపు హైదరాబాద్, మేడ్చల్, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో ప్రధానంగా పొడి వాతావరణం ఉండవచ్చని తెలిపారు. స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి వర్షాల ప్రభావంలో మార్పులు ఉండొచ్చు కాబట్టి ప్రజలు తాజా హెచ్చరికలను గమనించాలని సూచించారు.
అర్నాబ్ తుపాను ప్రభావంతో ఏపీలో పంటలు, తోటలు, ఆక్వా చెరువులు, రహదారులు, నివాస ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. వరిచేలు, అరటి తోటలు, కొబ్బరి తోటలు, ఆక్వా చెరువులకు జరిగిన నష్టాన్ని సమీక్షించారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న బాధితులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. తుపాను నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం కూడా ఏపీకి రానున్నట్లు సమాచారం.
మరోవైపు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచిస్తోంది. భారీ వర్షాలు కురిసే సమయంలో అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు వాతావరణ హెచ్చరికలను గమనించాలి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదు. వర్షాలపై వాతావరణ శాఖ జారీ చేసే తాజా సూచనలను అనుసరించడం ద్వారా ప్రమాదాలను తగ్గించుకోవచ్చు.