Cyclone Ditva : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు జోరందుకోనున్నాయా…? కొన్ని జిల్లాలకు భారీ వర్షాల ముప్పు పొంచివుందా..? మరో తుపాను లోడ్ అవుతోందా..? అంటే వాతావరణ పరిస్థితులు అవుననే అంటున్నాయి.
Cyclone Senyar : కొద్ది రోజులుగా తెలుగు ప్రజలను 'సెన్యార్ తుపాను' భయం వెంటాడుతోంది. ఈ తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలు వారిని కంగారుపెట్టాయి. ముఖ్యంగా వరికోతల సమయంలో ఈ వర్షాలేమిటని రైతులు ఆందోళనకు గురయ్యారు. మొంథా తుపాను బీభత్సాన్ని మర్చిపోకముందే ఈ సెన్యార్ హెచ్చరికలు రావడం కూడా ఎక్కువగా ఆందోళన పడటానికి కారణం. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అలజడి లేకుండానే చాలా ప్రశాంతంగా సెన్యార్ తుపాను ఏర్పడింది... బలహీనపడింది... తీరం దాటేసింది.
25
తీరందాటిన సెన్యార్ తుపాను
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండంగా క్రమక్రమంగా బలపడి ఇవాళ (నవంబర్ 26, బుధవారం) తుపానుగా మారిందట. మలక్కా జలసంధి ప్రాంతంలో సెన్యార్ తుపాన్ ఏర్పడినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది తీరం దాటడానికి ముందే బలహీనపడిపోయినట్లు తెలిపింది. సెన్యార్ తుపాను ఇండోనేషియాను సమీపంలో తీరం దాటిందని APSDMA వెల్లడించింది. ఇలా ఏపీకి తుపాను ముప్పు తప్పింది.
35
ఏపీలో భారీ వర్షాలు
తుపాను ముప్పు తప్పినా ఆంధ్ర ప్రదేశ్ కు భారీ వర్షాల ముప్పు పొంచివుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. బంగాళాఖాతంలో సెన్యార్ తుపాను ఏర్పడిన సమయంలో వేరుగా మరో అల్పపీడనం కూడా ఏర్పడినట్లు APSDMA తెలిపింది. ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని... నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక, హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉందని APSDMA తెలిపింది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ రేపు (నవంబర్ 27, గురువారం) వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత 48 గంటల్లో ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది.
ఇలా బంగాళాఖాతంలో వచ్చే శని, ఆదివారం (నవంబర్ 29,30) నాటికి తీవ్ర వాయుగుండం ఏర్పడే అవకాశాలున్నాయట. ఇదికూడా ఏమైనా తుపానుగా మారుతుందా అనే అనుమానాలు వ్యక్తమవతున్నాయి. ఇది తుపానుగా మారితే 'డిత్వా' గా నామకరణం చేయనున్నారు... ఇది యెమెన్ దేశానికి చెందిన పేరు.
55
ఏపీలో భారీ వర్షాలు
ఇదిలావుంటే రేపు గురువారం ఏర్పడే వాయుగుండం ప్రభావంతో కొన్నిజిల్లాల్లో ఈదురుగాలులు వీస్తాయని APSDMA హెచ్చరించింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 35 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
ఇక శుక్రవారం మెల్లిగా వర్షాలు మొదలై శని, ఆదివారాల్లో మరింత విస్తరిస్తాయని... కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.