
Sankranti Holidays : మకర సంక్రాంతి... తెలుగోళ్లకు మరీముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు పెద్దపండగ. సంక్రాంతి మూడ్రోజులు (భోగి, సంక్రాంతి, కనుమ) గ్రామాల్లో పండగశోభ కనిపిస్తుంది... దేశవిదేశాల్లో స్థిరపడినవాళ్లు పండక్కి స్వస్థలాలకు చేరుకుంటారు. చలిమంటలు, రంగురంగుల ముగ్గులు, రుచికరమైన పిండివంటలు, కోడిపందేలు, ఆకాశంలో పతంగులు... ఇలా కుటుంబంలోని పిల్లలు, పెద్దలు కలిసి ఎంతో ఘనంగా జరుపుకునే పండగ సంక్రాంతి. అందుకే ఈ పండక్కి విద్యార్థులు, ఉద్యోగులకు భారీ సెలవు వస్తాయి.
సంక్రాంతి పండక్కి దాదాపు రెండునెలల సమయం ఉంది... కానీ విద్యార్థులు, ఉద్యోగులు ఇప్పట్నుంచే సొంతూళ్ళకు ఎలా వెళ్లాలి? అక్కడ ఎలా ఎంజాయ్ చేయాలి? అని ఆలోచిస్తున్నారు. సెలవులపై క్లారిటీ వస్తే సొంతూళ్లకు రైలు, బస్ టికెట్స్ బుక్ చేసుకునేందుకు సిద్దంగా ఉన్నారు. ఏపీలో సంక్రాంతి సెలవులపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. తెలంగాణలో కూడా ఎన్నిరోజులు సెలవులుంటాయో తేలాల్సి ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి పండగను చాలా ఘనంగా జరుపుకుంటారు. వ్యవసాయ పనులు ముగిసి రైతుల ఇండ్లు ధాన్యంతో కళకళలాడుతున్న సమయంలో వచ్చే పండగ సంక్రాంతి… అందుకే ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. తెలుగు ప్రజలకు చాలా ప్రత్యేకమైన ఈ పండక్కి ఏపీ ప్రభుత్వం భారీగా సెలవులు ఇస్తుంది. ఈ సంక్రాంతికి కూడా జనవరి 10 నుండి 18 వరకు విద్యాసంస్థలకు సెలవులు రానున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించినట్లు కాకుండా గతేడాది మాదిరిగా సెలవులు పెరిగే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.
2024లో సంక్రాంతి సెలవులను పొడిగించింది ప్రభుత్వం. దీంతో జనవరి 10 నుండి 19 వరకు ఉండాల్సిన సెలవులు జనవరి 22 వరకు కొనసాగాయి. అంటే 10 రోజుల సెలవులు కాస్త 13 రోజులు అయ్యాయి. మరి ఈసారి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తే సెలవులు పొడిగించే అవకాశాలుంటాయి. ఈ క్రమంలోనే సంక్రాంతి సెలవులు 09 రోజులా లేక 12 రోజులా..? అన్న డైలమాలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నారు.
ఏపీతో పోలిస్తే తెలంగాణలో సంక్రాంతి సెలవులు తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అయితే సంక్రాంతికి జనవరి 10 నుండి 15 వరకు సెలవులు పక్కా. ఇందులో జనవరి 10 రెండో శనివారం, జనవరి 11 ఆదివారం సాధారణ సెలవులే. జనవరి 13 భోగి, జనవరి 14 సంక్రాంతి, జనవరి 15 కనుమ... మధ్యలో వచ్చే జనవరి 12న కూడా సెలవు ఇచ్చి వరుసగా 6 రోజులు పండగ హాలిడేస్ ప్రకటించనున్నారు. జనవరి 16న విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం అవుతాయి.
అయితే హైదరాబాద్ లో ఏపీకి చెందినవారి చాలామంది ఉంటారు... వీరంతా సంక్రాంతికి సొంతూళ్లకు వెళుతుంటారు. కాబట్టి ఏపీలో మాదిరిగానే తెలంగాణలో కూడా విద్యాసంస్థలకు ఎక్కువరోజులు సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాకపోయిన వీళ్లు ఎక్కువగా నివాసముండే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో అయినా సంక్రాంతి సెలవులను ఎక్కువరోజులు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
తెలుగు రాష్ట్రాల్లో పనిచేసే ఉద్యోగులకు సంక్రాంతికి సెలవులు కనీసం రెండ్రోజులు ఉంటాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 13 భోగి, జనవరి 14 సంక్రాంతి, జనవరి 15 కనుమ మూడ్రోజులు సెలవు ఉంటుంది. అదే తెలంగాణలో అయితే భోగి, సంక్రాంతి రెండ్రోజులో సెలవుండే అవకాశాలున్నాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగులకు కంపెనీ నిర్ణయం బట్టి సంక్రాంతి సెలవులుంటాయి.
కొత్త సంవత్సరం ప్రారంభంరోజే అంటే జనవరి 1న సెలవు రానుంది. ఇక సంక్రాంతి సందర్భంగా వరుసగా మూడ్రోజులు సెలవులు వస్తాయి... విద్యార్థులకు ఈ సెలవులు ఎక్కువగా ఉంటాయి. సంక్రాంతి సెలవులు ముగియగానే విద్యార్ధులు ఉసూరుమంటూ స్కూళ్ల బాట పడతారు... వీరికి ఊరటనిస్తూ జనవరి 26 గణతంత్ర దినోత్సవ సెలవు వస్తుంది. కొన్ని హిందుత్వ విద్యాసంస్థలకు జనవరి 23న వసంత పంచమికి కూడా సెలవుండే అవకాశాలున్నాయి.