తెలంగాణలో చలి చంపేస్తోందిగా...
తెలంగాణలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి... ఆదిలాబాద్ వంటి మారుమూల ప్రాంతాల్లో కాదు రాజధాని హైదరాబాద్ పరిసరాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పటాన్ చెరులో రాష్ట్రంలోనే అత్యల్పంగా 8 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యింది... ఆదిలాబాద్ లో 9 డిగ్రీలు ఉంది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, గద్వాల, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో అత్యంత చలి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. డిసెంబర్ 18 నుండి 21 వరకు అంటే నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు మరింత దిగువకు చేరుకుని చలిగాలులు, పొగమంచు ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని హెచ్చరిస్తున్నారు వాతావరణ నిపుణులు.