వెంక‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. ముంద‌స్తు బుకింగ్ లేకుండానే ప్ర‌త్యేక‌ ద‌ర్శ‌నం, నేరుగా టికెట్‌

Published : Feb 25, 2026, 10:47 AM IST

TTD: ఏడాదికి ఒక్క‌సారైనా తిరుమ‌లేశ్వ‌రుడిని ద‌ర్శించుకోవాల‌ని కోరుకునే వారు చాలా మంది ఉంటారు. విదేశాల్లో ఉన్న భార‌తీయులు సైతం తిరుమ‌ల‌ను ద‌ర్శించుకుంటారు. ఇలాంటి వారి కోసం టీటీడీ ఓ ప్ర‌త్యేక స‌దుపాయాన్ని అందిస్తోంద‌న్న విష‌యం మీకు తెలుసా.? 

PREV
15
ప్రవాస భారతీయులకు ప్రత్యేక దర్శనం

విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు, భారతీయులు స్వదేశానికి వచ్చినప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని కోరుకుంటారు. అయితే తక్కువ రోజుల సెలవుల్లో రావడం వల్ల సాధారణ క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండటం చాలా మందికి ఇబ్బందిగా మారుతుంది. అలాగే రూ. 300 టికెట్ బుక్ చేసుకోవాలంటే క‌నీసం మూడు నెల‌ల ముందే చేసుకోవాల్సిన ప‌రిస్థితి. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేక దర్శన సదుపాయాన్ని కల్పించింది. ముందస్తు బుకింగ్ అవసరం లేకుండానే ప్రవాస భక్తులు సులభంగా శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంది.

25
ముందస్తు బుకింగ్ లేకుండానే దర్శనం

విదేశాల్లో నివసించే భక్తులు ముందుగా ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. తిరుమలకు చేరుకున్న తర్వాత నేరుగా ప్రత్యేక ప్రవేశ మార్గం ద్వారా దర్శనానికి అనుమతి ఉంటుంది. ఈ ప్రత్యేక దర్శన టికెట్ ధర ఒక్కొక్కరికి రూ.300గా ఉంటుంది. సాధారణంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం వరకు దర్శనానికి అనుమతి ఇస్తారు. అయితే భక్తుల రద్దీని బట్టి సమయాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. భారతదేశానికి వచ్చిన తేదీ నుంచి 30 రోజులలోపు మాత్రమే ఈ ప్రత్యేక దర్శనం పొందే అవకాశం ఉంటుంది.

35
‘సుపథం’ ద్వారా ప్రత్యేక ప్రవేశం

ప్రవాస భక్తులకు తిరుమలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రవేశ మార్గం ‘సుపథం’. ఇది వైకుంఠం కాంప్లెక్స్-1 సమీపంలో ఉంటుంది. ఇక్కడ అవసరమైన పత్రాలు చూపించిన తర్వాత దర్శన టికెట్ జారీ చేస్తారు. దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించడం తప్పనిసరి. పురుషులు ధోతీ లేదా లుంగీలో రావాల్సి ఉంటుంది. ఇక మహిళలు చీర లేదా సాంప్రదాయ దుస్తులు ధరించాలి. ప్రత్యేక దర్శనం సౌకర్యం ప్రవాస భారతీయులకు మాత్రమే వర్తిస్తుంది.

45
ఈ ప‌త్రాలు త‌ప్ప‌నిస‌రి

ప్రవాస భక్తులు దర్శనానికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఒరిజిన‌ల్‌ పాస్‌పోర్ట్ వెంట తీసుకెళ్లాలి. పాస్‌పోర్ట్‌పై భారతదేశానికి వచ్చినట్లు చూపించే ఇమ్మిగ్రేషన్ స్టాంప్ ఉండాలి. వీసా లేదా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI), పీఐఓ కార్డు ఉన్నవారు వాటిని కూడా చూపించాలి. అధికారులు పాస్‌పోర్ట్ వివరాలను పరిశీలించిన తర్వాతే దర్శనానికి అనుమతి ఇస్తారు. ప్రవాస భక్తులతో వచ్చే స్థానిక కుటుంబ సభ్యులకు ఈ ప్రత్యేక మార్గంలో అనుమతి ఉండదు. వారు సాధారణ దర్శన టికెట్లతో వెళ్లాల్సి ఉంటుంది.

55
వసతి, సేవలు ఇలా పొందాలి

తిరుమలలో వసతి గదులు లేదా ప్రత్యేక సేవల కోసం ముందుగా ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవాలి. పాస్‌పోర్ట్ నంబర్‌ను గుర్తింపు పత్రంగా నమోదు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. వసతి గదులు పొందడానికి కనీసం రెండు నెలల ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. రద్దీ ఎక్కువగా ఉండటంతో చివరి నిమిషంలో గదులు దొరకడం కష్టంగా మారుతుంది.

ఆర్జిత సేవలకు ప్రత్యేక విధానం

ప్రవాస భక్తులు శ్రీవారి ఆర్జిత సేవలను కూడా ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం ఉంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి సేవలకు లక్కీడిప్ విధానం అమల్లో ఉంటుంది. ఈ లక్కీడిప్‌లో పాల్గొనాలంటే పాస్‌పోర్ట్ వివరాలు నమోదు చేయాలి. సేవలకు హాజరయ్యేటప్పుడు కూడా బుకింగ్ సమయంలో ఇచ్చిన ఒరిజిన‌ల్‌ పాస్‌పోర్ట్ చూపించడం తప్పనిసరి. ఈ ప్రత్యేక దర్శన సదుపాయం వల్ల విదేశాల నుంచి వచ్చే భక్తులు తక్కువ సమయంలోనే శ్రీవారిని దర్శించుకునే అవకాశం లభించనుంది.

Read more Photos on
click me!

Recommended Stories