ప్రతి కుటుంబానికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డు.. ఏంటిది? ప్రయోజనాలు ఏమిటి?

Published : Nov 24, 2025, 04:40 PM ISTUpdated : Nov 24, 2025, 04:54 PM IST

Smart Family Card System: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబానికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ జారీకి సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. అన్ని ప్రభుత్వ పథకాలు, సేవలకు ఒకే డిజిటల్ గుర్తింపుగా ఇది ఉండనుంది. స్మార్ట్ ఫ్యామిలీ కార్డు ఏమిటి? ప్రయోజనాలు ఏంటి?

PREV
15
కుటుంబ సమాచార సమగ్రత కోసం స్మార్ట్ ఫ్యామిలీ కార్డు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని ఒకే డిజిటల్ యూనిట్‌గా గుర్తించేందుకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డు వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (FBMS) అమలు వేగవంతం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పౌరుడి కుటుంబానికి సంబంధించిన ప్రాథమిక, సాక్ష్యాధారిత సమాచారాన్ని ఒకే కార్డు ద్వారా అందుబాటులో ఉంచడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.

25
ఆర్టీజీఎస్ డేటా లేక్‌తో సమగ్ర డేటా సేకరణ

ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ (RTGS) డేటా లేక్ను ఈ ప్రాజెక్ట్‌కు ఆధారంగా ఉపయోగించాలని సూచించారు. వాక్సినేషన్, ఆధార్, ఎఫ్‌బీఎంఎస్ ఐడీ, రేషన్ వివరాలు, పోషణ సమాచారం, స్కాలర్‌షిప్‌లు, పెన్షన్లు వంటి అనేక ప్రభుత్వ రంగ డేటాలను ఒకేచోట సమన్వయం చేస్తూ కుటుంబానికి సంబంధించిన స్టాటిక్, డైనమిక్ సమాచారం నిరంతరం అప్డేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు జూన్ నాటికి QR కోడ్ తో కూడిన స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు జారీ చేయాలని కూడా సీఎం స్పష్టం చేశారు. 25 రకాల ముఖ్య వివరాలు, పీ4 కేటగిరీలను ఈ కార్డులో చేర్చేలా సాంకేతిక సిద్ధతను పూర్తి చేయాలని సూచించారు.

35
అన్ని ప్రభుత్వ పథకాలు.. ఒకే కార్డు ద్వారా ట్రాకింగ్

ఈ కార్డు కేవలం రేషన్ లేదా పెన్షన్ పథకాలకే పరిమితం అయ్యే పాత విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా మార్చుతోంది. ఇకపై విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం, గృహ పథకాల నుండి పోషణ, ఆదాయం ఆధారిత సేవల వరకు అన్ని వివరాలు ఈ ఒక్క కార్డు ద్వారా ట్రాక్ చేస్తారు.

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం మెరుగుపడి, అర్హులైన లబ్ధిదారులను పక్కాగా గుర్తించడం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారుల పరిశీలనతో పాటు స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వివరాలను క్రమం తప్పకుండా అప్డేట్ చేసే విధానం అమలు అవుతుంది.

45
సుపరిపాలనలో కీలక అడుగు.. డేటా ఎప్పుడు సిద్ధం అవుతుంది?

ఈ వ్యవస్థ ద్వారా పౌరులు ఒకే కార్డుతో అన్ని ప్రభుత్వ సేవలను పొందే అవకాశం కలుగుతుంది. ఆధార్ సహా వ్యక్తిగత సమాచారాన్ని సమగ్రంగా సమీకరించి ఏ శాఖకైనా సులభంగా అందుబాటులో ఉంచడం ద్వారా పారదర్శకత, వేగం, అవినీతి నియంత్రణలో ప్రభుత్వం ముఖ్య పురోగతి సాధించగలదనే నమ్మకం వ్యక్తమైంది.

2026 జనవరి నాటికి అన్ని వివరాలను సమగ్రపరిచి, జూన్‌ నాటికి కార్డుల పంపిణీని పూర్తిచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ సమీక్ష సమావేశంలో సీఎస్ కె. విజయానంద్‌తో పాటు ఆర్థిక, వైద్యారోగ్య, ప్లానింగ్, పురపాలక, గ్రామ–వార్డు సచివాలయ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

55
స్మార్ట్ ఫ్యామిలీ కార్డుతో మీ కుటుంబానికి కలిగే లాభం ఏమిటి?

1. అన్ని ప్రభుత్వ పథకాలకు ఒకే కార్డు: రేషన్, పెన్షన్, స్కాలర్‌షిప్‌లు, ఆరోగ్య పథకాలు, వాక్సినేషన్, ఆధార్ ఆధారిత సేవలు వంటి అన్ని వివరాలు ఈ ఒకే కార్డుతో లింక్ అవుతాయి. అలాగే, మీరు ఎక్కడికెళ్లినా సేవలను పొందడానికి అనేక కార్డులు, రికార్డులు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.

2. అర్హులైన వారికే పథకాలు: ప్రభుత్వం వద్ద ఉన్న డేటా సరిగ్గా, రియల్ టైమ్‌లో అప్డేట్ అవుతుండడం వల్ల ఎవరు అర్హులు, ఎవరు కాదు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. అర్హుల ఎంపికలో వచ్చే తప్పులు, మధ్యవర్తుల ప్రాభవం తగ్గుతుంది.

3. అవినీతి తగ్గి పారదర్శకత పెరగడం: అన్ని శాఖల సమాచారం సమీకృతంగా ఉండడం వల్ల అక్రమాలు తగ్గుతాయి. ఒకే ప్లాట్‌ఫామ్ ద్వారా ట్రాకింగ్ జరగడంతో ప్రజలకు సేవలు అందడంలో పారదర్శకత మెరుగుపడుతుంది.

4. కుటుంబానికి సంబంధించిన అన్ని సేవలు ఒకచోట: పిల్లల వాక్సినేషన్, విద్యా స్కాలర్‌షిప్‌లు, మహిళల పౌష్టికాహార సమాచారం, వృద్ధుల పెన్షన్లు వంటి ప్రతి కుటుంబ సభ్యుడి వివరాలు ఒకచోట ఉంటాయి. కుటుంబ మొత్తం అభివృద్ధిపై ప్రభుత్వానికి స్పష్టమైన అంచనా వస్తుంది.

5. ప్రభుత్వ కార్యాలయాలకు రాకపోకలు తగ్గడం : ప్రతి సేవ కోసం వేరువేరు శాఖలు తిరగాల్సిన పనివుండదు. డిజిటల్ ప్రక్రియలతో సేవలు వేగంగా, తక్కువ సమయంతో అందుతాయి.

6. అత్యవసర సమయాల్లో సేవలు :  ఆరోగ్య అత్యవసరాలు, ప్రకృతి వైపరీత్యాలు, సంక్షోభ సందర్భాల్లో ప్రభుత్వం కుటుంబాల సమాచారాన్ని వెంటనే యాక్సెస్ చేసి సహాయం అందించే అవకాశముంటుంది.

7. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవల విస్తరణ : స్వర్ణాంధ్ర విజన్ యూనిట్లు సమాచారాన్ని నిరంతరం అప్డేట్ చేస్తాయి. గ్రామాల్లో కూడా డిజిటల్ గవర్నెన్స్ సేవలు వేగంగా అందించడానికి కీలకం కానుంది.

8. భవిష్యత్ పథకాల రూపకల్పనకు ఖచ్చితమైన డేటా: ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రత వంటి రంగాల్లో ప్రభుత్వానికి గ్రామ స్థాయి నుండి కుటుంబ స్థాయి వరకు నిజమైన డేటా అందుతుంది. దీంతో ప్రజల అసలు అవసరాలకు సరిపోయే పథకాలు రూపొందించటం సులభమవుతుంది.

9. డూప్లికేట్ రికార్డులకు చెక్ : ఆధార్ వివరాలు కూడా ఇందులో లింక్ కావడం వల్ల డూప్లికేట్ ఎంట్రీలు, నకిలీ రేషన్ కార్డులు, నకిలీ పెన్షన్లు వంటి సమస్యలు తగ్గుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories