School Holidays: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తీరప్రాంత ప్రజలకు తీవ్ర హెచ్చరికలు కొనసాగుతున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అత్యంత వేగంగా బలపడి తీవ్ర తుపానుగా మారింది. గత కొన్ని గంటలుగా గంటకు 7 నుంచి 17 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల వైపు శరవేగంగా దూసుకొస్తోంది. బుధవారం రాత్రి వేళ విశాఖపట్నం-గోపాల్‌పూర్ రేవుల మధ్య ఇది తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ పరిణామంతో ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆకాశానికి చిల్లు పడినట్లుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
25
ఈ 6 జిల్లాల్లో విద్యాసంస్థలు బంద్
భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రతకే మొదటి ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణ శాఖ జారీ చేసిన ముందస్తు సమాచారం ఆధారంగా మంత్రి నారా లోకేశ్ ఆరు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు బుధవారం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ ఆదేశాల ప్రకారం అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్), పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని పాఠశాలలు మూతపడనున్నాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా స్పందించాలని ఎంఈఓలు, జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
35
తీరప్రాంతాలకు రెడ్ అలర్ట్.. 70 కి.మీ వేగంతో ఈదురుగాలులు
ఉత్తరాంధ్రలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం అత్యున్నత స్థాయి రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో సుమారు 20 సెంటీమీటర్ల మేర అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి. తీరం దాటే సమయంలో తీర ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ ఉపద్రవం కళింగపట్నానికి 140 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా మారినందున విశాఖ, గంగవరం, కళింగపట్నం నౌకాశ్రయాల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఇచ్చారు. రాబోయే 48 గంటల పాటు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.
ఈ అత్యవసర పరిస్థితిపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులతో క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, ఇతర ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సహాయక చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్ శాఖల సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రజలెవరూ పాత భవనాలు, భారీ హోర్డింగ్స్, పెద్ద చెట్ల కింద నిలబడవద్దని సూచించారు. అత్యవసర సహాయం కోసం శ్రీకాకుళం కలెక్టరేట్‌లో 08942 240557 అనే హెల్ప్‌లైన్ నంబర్‌తో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.
55
తెలంగాణ గోదావరి తీరంలోనూ తుపాను కల్లోలం
ఈ తీవ్ర తుపాను ఎఫెక్ట్ కేవలం ఏపీకే పరిమితం కాకుండా తెలంగాణపైనా పడుతోంది. ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతాలైన పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ఇచ్చింది. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే ముప్పు ఉన్నందున కంట్రోల్ రూమ్‌లను సిద్ధం చేసి, స్థానిక యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.