ముంచుకొస్తున్న ముప్పు.. సైక్లోన్ అర్న‌బ్‌తో అల్ల‌క‌ల్లోల‌మే, ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వ‌ర్షాలు

Published : Sep 22, 2026, 07:07 PM IST

Cyclone Arnab: ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వ‌ర్షాలు లేక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నాఉ. అయితే ఇలాంటి స‌మ‌యంలో వాతావ‌ర‌ణ శాఖ తెలిపిన ఓ వార్త ఆశ‌లు రేకెత్తిస్తున్నాయి. అదే స‌మ‌యంలో తుఫాన్ హెచ్చ‌రిక‌లు భ‌య‌పెడుతున్నాయి.

PREV
15
బలపడుతున్న వాయుగుండం

పశ్చిమ మధ్య, ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సెప్టెంబర్ 22 ఉదయానికి గోపాల్‌పూర్‌కు సుమారు 200 కిలోమీటర్లు, కళింగపట్నానికి 200 కిలోమీటర్లు, పూరీకి 210 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గత ఆరు గంటల్లో ఇది సుమారు గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదిలినట్లు వాతావ‌ర‌ణ శాఖ‌ వెల్లడించింది.

రానున్న‌ 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఆంధ్రప్రదేశ్–దక్షిణ ఒడిశా తీరాల వైపు సాగనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధికారిక అంచనాల ప్రకారం ఇది సెప్టెంబర్ 23 రాత్రి నుంచి సెప్టెంబర్ 24 తెల్లవారుజాము మధ్య విశాఖపట్నం–గోపాల్‌పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది.

25
‘అర్నబ్’ పేరును ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించలేదు

ప్రస్తుతం ‘అర్నబ్’ అనే పేరు అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. ఇది తుఫాన్ స్థాయికి చేరితే తదుపరి పేరుగా ‘అర్నబ్ (Arnab)’ను ఉపయోగించనున్నారు. ఈ పేరును బంగ్లాదేశ్ సూచించింది. బెంగాలీ భాషలో ‘అర్నబ్’ అంటే సముద్రం లేదా మహాసముద్రం అనే అర్థం వస్తుంది. అందువల్ల ప్రస్తుతం దీనిని ‘అర్నబ్ తుఫాన్’గా పేర్కొనడం కంటే, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంగా చెప్పొచ్చు. ఇది మరింత బలపడి తుఫాన్‌గా మారుతుందా లేదా అన్నది రానున్న వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

35
ఏపీపై వర్షాల ప్రభావం ఎలా ఉంటుంది?

ఈ వ్యవస్థ ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు విస్తరించే అవకాశం ఉంది. ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం ఉత్తర ఆంధ్ర తీరంలో విస్తృతంగా వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది.

శ్రీకాకుళం నుంచి కోస్తా ఆంధ్రలోని పలు ప్రాంతాల వరకు వర్షాల ప్రభావం కనిపించవచ్చు. తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సముద్రం కూడా క్రమంగా అలజడిగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో స్థానిక హెచ్చరిక సంకేతాలు కొనసాగుతున్నాయి. ఉత్తర ఆంధ్ర తీరంలో సముద్ర పరిస్థితులు మరింత కఠినంగా మారే అవకాశం ఉందని IMD పేర్కొంది.

45
ఒడిశాలో ముందస్తు చర్యలు.. స్కూళ్లు మూసివేత

వాతావరణ మార్పుల‌ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం, నదుల్లో నీటిమట్టాలు పెరిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉండటంతో పలు జిల్లాల్లో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. ఖుర్దా, గంజాం, జగత్సింగ్‌పూర్, గజపతి జిల్లాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఒడిశా తీర ప్రాంతాల్లోని పోర్టులకు కూడా జాగ్రత్త సూచనలు జారీ అయ్యాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ల‌కూడ‌ద‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు.

55
ఏపీ, ఒడిశా, బెంగాల్‌లో వర్షాలకు ఛాన్స్

ఈ వాతావరణ ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒడిశాతో పాటు పశ్చిమ బెంగాల్‌పై కూడా కనిపించే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్‌లో సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు హెచ్చరికలు ఉన్నాయి. దక్షిణ బెంగాల్ జిల్లాలతో పాటు ఉత్తర బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది.

మరోవైపు ఉత్తర ఆంధ్ర–దక్షిణ ఒడిశా తీరాల్లో గాలులు, వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అయితే తుఫాన్ ఏర్పడిందని ఇప్పుడే చెప్పడం కంటే.. వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడే దశలో ఉందని చెప్పొచ్చు. రాబోయే 24 గంటల్లో పరిస్థితిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇది కొంత ఊరటనిచ్చే అవకాశం ఉన్నప్పటికీ, భారీ వర్షాలు, ఈదురుగాలులు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిందే.

Read more Photos on
click me!

Recommended Stories