School Holidays : నవంబర్ 26, 29, డిసెంబర్ 2 మూడ్రోజులూ సెలవులే... ఏరోజు, ఎందుకో తెలుసా?

Published : Nov 20, 2026, 06:17 PM IST

ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మరో మూడ్రోజులు విద్యాసంస్థలకు సెలవులు రానున్నాయి. స్కూళ్లలోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు కాబట్టి పోలింగ్ డే విద్యార్థులకు సెలవు ఉంటుంది.

PREV
14
తెలుగు విద్యార్థులకు సెలవులే సెలవులు

School Holidays : తెలుగు విద్యార్థులకు వరుస సెలవులు వస్తున్నాయి. దసరాతో మొదలైన సెలవుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. దసరాకి దాదాపు రెండు వారాల సెలవులు వచ్చాయి... ఇవి ఇలా ముగిశాయో లేవో తుపాను సెలవులు ప్రారంభమయ్యాయి. అర్నబ్, మురసుతో పాటు తాజా అక్వాన్ తుపానుల కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల్లో సెలవులు ఇచ్చారు. ఇక మధ్యమధ్యలో దీపావళి, కార్తీక పౌర్ణమి అంటూ పండగ సెలవులు వస్తూనే ఉన్నాయి.

అయితే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనూ ఇప్పటికే కొందరికి సెలవులు వచ్చాయి. ఇకపై కూడా విద్యార్థులకు మరికొన్ని సెలవులు రాబోతున్నాయి. ఏపీలో ప్రస్తుతం గ్రామ పంచాయితీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది... కాబట్టి పోలింగ్ రోజున విద్యార్థులకు సెలవులు రాబోతున్నాయి. మరి ఏఏ రోజుల్లో పోలింగ్ ఉంది, ఎవరికి సెలవులుంటాయి? తెలుసుకుందాం.

24
నవంబర్ 26న సెలవు

ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే మున్సిపల్, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు ముగిశాయి... ఇక మిగిలింది పంచాయితీ ఎన్నికలే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయితీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్స్ విడుదల చేసింది. ఇందులో భాగంగానే మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు నామినేషన్లు పూర్తిచేసి జోరుగా ప్రచారం చేస్తున్నారు.

నవంబర్ 26న అంటే వచ్చే గురువారం మొదటి విడత పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో పోలింగ్ జరగనుంది. ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేస్తారు... ఇందుకోసం ముందుగానే ఏర్పాట్లు చేపడతారు. కాబట్టి మొదటివిడత పోలింగ్ జరిగే గ్రామాల్లో పోలింగ్ డే అంటే నవంబర్ 26న ప్రభుత్వ విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది.

34
నవంబర్ 29, డిసెంబర్ 2న కూడా సెలవే..

మొదటి విడత పంచాయితీ ఎన్నికలు ముగియగానే రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో హడావిడి మొదలవుతుంది. నవంబర్ 29న ఈ గ్రామాల్లో పోలింగ్ జరగనుంది. అయితే ఈరోజు ఆదివారమే కావడంతో స్కూళ్లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసినా విద్యార్థులకు ప్రత్యేకంగా సెలవు ఇవ్వాల్సిన అవసరం ఉండదు... సాధారణ సెలవే వర్తిస్తుంది.

మూడో విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 2న జరగనుంది. పోలింగ్ జరిగే గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలకు ఈరోజు సెలవు ఉంటుందన్నమాట. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసిన స్కూల్స్ మినహా మిగతా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఎలాంటి సెలవు ఉండదు... యదావిధిగా నడుస్తాయి. కాబట్టి ముందుగా సమాచారం ఉంటేనే సెలవు ఉన్నట్లు... లేదంటే పోలింగ్ రోజున కూడా విద్యార్థులు స్కూల్ కి వెళ్లాల్సి ఉంటుంది.

44
ఉద్యోగులు, కార్మికులకు మూడ్రోజులు సెలవులే..

పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవు ఉంటుంది. పోలింగ్ జరిగే గ్రామాల్లో ఓటుహక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఉద్యోగులకే కాదు షాపులు, ఇతర వాణిజ్య సంస్థల్లో పనిచేసే కార్మికులకు కూడా సెలవు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. ఈ మేరకు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది కార్మిక శాఖ.

ఏపీ దుకాణాలు, వాణిజ్య సంస్థల చట్టం-1988 లోని సెక్షన్ 31(2) ప్రకారం కార్మికుల సెలవుపై నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వ్యాపారులు అధికారిక ఉత్తర్వులు పాటిస్తూ కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశించారు. కార్మికులను ఓటు వేయనివ్వకుండా అడ్డుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది కార్మిక శాఖ.

Read more Photos on
click me!

Recommended Stories