
Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడటంతో కొన్నిచోట్ల భారీ నుండి అత్యంత భారీ వర్షాలు... మిగతాచోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి అంతకంతకు బలపడుతోందట... దీని ప్రభావంతో అటు ఆంధ్ర ప్రదేశ్, ఇటు తెలంగాణలో మరో రెండుమూడు రోజులు కుండపోత వానలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
మరీముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండం శనివారం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర మధ్య తీరందాటే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. కాబట్టి సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని... తీరప్రాంతాలను వర్షాలు ముంచెత్తడంతోపాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... ఆదివారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళరాదని సూచించారు.
ఇప్పటికే గత రెండు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులువంకల్లో వరదనీరు చేరి ఉదృతంగా మారాయి... జలాశయాలు, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారి ఉప్పొంగుతున్నాయి. ఇలాంటి సమయంలో మళ్లీ అత్యంత భారీ వర్షాలు కురుస్తుండటంతో పరిస్థితులు అంతకంతకు ప్రమాదకరంగా మారుతున్నాయి. దీంతో అత్యవసర సమయాల్లో ప్రజలను కాపాడే ప్రభుత్వ యంత్రాంగాలు అప్రమత్తం అయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని... అవసరమైతే ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది సాయం తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు (సెప్టెంబర్ 26, శుక్రవారం) వాయుగుండంగా బలపడనుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (Andhra Pradesh State Disaster Management Authority) హెచ్చరిస్తోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఒకటిరెండు చోట్ల అసలు ఊహించని స్థాయిలో అతిభారీ వర్షాలు కురుసే అవకాశాలున్నాయట. ముఖ్యంగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల ,పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీవర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని వెల్లడించింది.
నెల్లూరు, కర్నూలు,నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయట. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని... మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.
మరోవైపు గోదావరి నదిలో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది... ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో 3.97 లక్షల క్యూసెక్కులుగా ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతం కురిసే భారీ వర్షాలను బట్టి ఈ నెల 29 నాటికి క్రమంగా గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కాబట్టి నదీపరీవాహక ప్రాంతం, లోతట్టు గ్రామాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
బంగాళాఖాతంలో ఇప్పటికే కొనసాగుతున్న అల్పపీడనాలు, ఇవాళ ఏర్పడే వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రెండుమూడు రోజులు (సెప్టెంబర్ 26, 27, 28) అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.
నేడు (సెప్టెంబర్ 26, శుక్రవారం) ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఇక నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని... ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ వర్షాలకు ఉరుములు మెరుపులతో పాటు గంటలకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు తోడవుతాయి కాబట్టి ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది... అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
రేపు (సెప్టెంబర్ 27, శనివారం) వాయుగుండం తీరందాటనుంది. దీని ప్రభావంతో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్ మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్ లో ప్రస్తుతం వాతావరణం అత్యంత దారుణంగా ఉంది... రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. నగరమంతా ఈ వర్షం ఉండటంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి... లోతట్టు ప్రాంతాల్లో అయితే ఇళ్ళలోకి వరదనీరు చేరి ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఇవాళ (శుక్రవారం) మొత్తం నగరంలో వర్షం కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరో రెండుమూడు గంటల్లో నగరంలోని భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... ఇళ్లలోంచి బయటకు రాకపోవడమే మంచిదని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు.