
Success Story : పట్టుదలతో ప్రయత్నిస్తే సాధ్యంకానిది ఏదీ ఉండదు... అందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు ఆంధ్ర ప్రదేశ్ మెగా డిఎస్సి ర్యాంకర్ రామారావు. దాదాపు రెండు దశాబ్దాలుగా తన కలను సాకారం చేసుకునేందుకు అలుపెరగని పోరాటం చేసి ఎట్టకేలకు సక్సెస్ అయ్యాడు. ఎన్నిసార్లు కిందపడ్డా మళ్లీ పైకిలేచి తన లక్ష్యంవైపు పరుగుతీశాడు... మొక్కవోని దీక్షలో నిరంతరం ప్రయత్నించాడు.. అదే అతడిని ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడిని చేసింది. అతడిలా పాజిటివ్ మైండ్ సెట్ నేటి యువతకు చాలా అవసరం. అంగవైకల్యాన్ని జయించి అనుకున్నది సాధించిన రామారావు విజయగాధను ఇక్కడ తెలుసుకుందాం.
గుంటూరు పట్టణ శివారు ప్రాంతానికి చెందిన పాండురంగారావు-పార్వతమ్మ దంపతుల మొదటి సంతానం కాటూరి రామారావు. చిన్నప్పుడు అతడిని తల్లిదండ్రులే కాదు కుటుంబసభ్యులంతా అల్లారుముద్దుగా చూసుకునేవారు. వీరి అతిప్రేమే అతడిపాలిట శాపమయ్యింది. పోలీయో వ్యాక్సిన్ పై ఆనాడు అనేక అనుమానాలు ఉండటంతో అమాయకులైన పాండురంగారావు దంపతులు తమ బిడ్డకు వేయించలేదు. దీంతో రామారావుకు చిన్నతనంలోనే పోలీయో సోకి కాలు చచ్చుబడిపోయింది.. ఇలా వికలాంగుడిగా మారాడు. తోటి పిల్లలతో సరదాగా ఆడుకునే సమయంలో అతడు అంగవైకల్యంతో బాధపడ్డాడు.
అయితే కొడుకు భవిష్యత్ లో ఈ అంగవైకల్యంతో బాధపడుకుండా ఉండాలంటే చదువు ఒక్కటే మార్గమని ఆ పేరెంట్స్ భావించారు. అందుకే ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా రామారావును చదివించాలని నిర్ణయించారు. ఇలా వాళ్లు వ్యవసాయం చేసుకుంటూ కష్టపడినా తమ కొడుకు చదివును ఏనాడు నిర్లక్ష్యం చేయలేదు.
అయితే విధి మరోసారి అతడి జీవితంతో ఆడుకుంది. ప్రాథమిక విద్యాభ్యాసం ముగించి ఉన్నత చదువుల వైపు పయనిస్తున్న సమయంలో హటాత్తుగా రామారావు తండ్రి మరణించాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి... కానీ తల్లి పార్వతమ్మ కుటుంబ పోషణ భారాన్ని నెత్తినెత్తుకుని కొడుకును చదివించింది. ఆ తల్లి గేదెలు మేపింది, పాలమ్మింది... వ్యవసాయం చేసింది. ఇలా తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తూ పెరిగిన రామారావు ఎప్పుడూ చదువును నిర్లక్ష్యం చేయలేదు. చిన్నప్పటినుండి కలగన్న ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్ని సాధించేందుకు కావాల్సిన అర్హతలు సాధించాడు.
రామారావు 2006 లో బిఈడి పూర్తిచేశాడు... తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం కోసం సన్నద్దమయ్యాడు. అయితే ప్రతిసారి డిఎస్సి రాయడం... జాబ్ రాకపోవడంతో నిరాశ చెందడం జరిగేది. అయితే అతడు ఏనాడు ఆశ వదిలిపెట్టలేదు... ఇప్పుడు కాకున్నా ఎప్పటికైనా తన కలను సాకారం చేసుకుంటానని నమ్మేవాడు. ఇలా మొండిగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు... ఏళ్లకు ఏళ్ళు గడుస్తున్నాయి కానీ ఉద్యోగం రావడంలేదు. డీఎస్సీలు రాసి రాసి అలసిపోయాడు రామారావు.
కాలం గడుస్తున్నకొద్ది అతడిపై బాధ్యతలు పెరిగాయి. పెళ్ళయి ఇద్దరు పిల్లలు కూడా ఉండటంతో వారికోసమైనా ఏదైనా ఉద్యోగంలో చేరాలి. అయితే ఇతర ఉద్యోగాల్లో చేరితే లక్ష్యం దారితప్పుతుందని భావించిన అతడు తాను చదివిన ప్రైవేట్ స్కూల్లోనే టీచర్ గా చేరాడు. పిల్లలకు పాఠాలు చెప్పేందుకు ఎలాగూ పుస్తకాలు చదవాలి... అదే అతడికి డిఎస్సి ప్రిపరేషన్ కు పనికివచ్చింది. ఇలా చూస్తుండగానే అతడికి 42 ఏళ్లు వచ్చాయి. ఇంకొద్దిరోజులు గడిస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు వయసు మించిపోతుంది. ఇలా చీకటివైపు సాగుతున్న అతడి జీవితంలో కాంతిపుంజంలా మెగా డిఎస్సి ప్రకటన వెలువడింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకటిరెండు కాదు ఏకంగా 16,347 పోస్టుల భర్తీకి సిద్దమయ్యింది. ఇది తనకు ఆ దేవుడిచ్చిన అవకాశంగా భావించిన రామారావు మరింత కష్టపడి ప్రిపేర్ అయ్యాడు. తన కలను నిజం చేసుకునేందుకు చివరి అవకాశం కాబట్టి అతడు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. కుటుంబసభ్యులు కూడా రామారావుకు అండగా నిలిచారు.
ఇలా తాజాగా వెలువడిన డిఎస్సి పలితాల్లో రామారావు అత్యుత్తమ ర్యాంకు సాధించాడు... గుంటూరు జిల్లాలో టీచర్ ఉద్యోగాలను పొందినవారిలో ఒకడిగా నిలిచారు. డిఎస్సిలు రాసిరాసి అలసిపోయిన అతడు చిట్టచివరి అవకాశాన్ని ఒడిసిపట్టుకున్నాడు... మెగా డిఎస్సి ఫిజికల్ సైన్స్ పోస్టును సాధించాడు. పిడబ్ల్యుడి కేటగిరీలో అతడికి స్కూల్ అసిస్టెంట్ గా ఉద్యోగం లభించింది. తన వైకల్యంతోనే ఇంతకాలం పోరాడిన అతడు చివరకు ప్రభుత్వ ఉద్యోగాన్నిసాధించాడు.
ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ... తనకు జీవితంలో వెలుగులు నింపిన కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటానని అంటున్నాడు. మరో రెండు సంవత్సరాలు ఆలస్యం అయివుంటే తన కల కలగానే మిగిలిపోయేదని అంటున్నాడు. చివరి ప్రయత్నంలో ప్రణాళికబద్దంగా చదివి సక్సెస్ అయిన రామారావు ఎందరికో ఆదర్శం.
ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇలా 16,347 పోస్టుల భర్తీ ప్రక్రియను కేవలం 150 రోజులలోనే పూర్తిచేశారు... తాజాగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు స్వయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియామక పత్రాలను అందించారు.
రాజధాని అమరావతిలో జరిగిన ఈ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎంతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, టీచర్ జాబ్ పొందిన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. టాప్ లో నిలిచిన ఓ 20 మందికి సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ లెటర్లు అందించారు.. మిగతావారికి ఆయా జిల్లాల్లో అధికారులు అందించనున్నారు. ఇలా గుంటూరు జిల్లా అధికారుల నుండి రామారావు నియామకపత్రాన్ని అందుకోనున్నారు.