అరగంటలో శ్రీవారి దర్శనం... ఎవరికో తెలుసా?
తిరుమలకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు... వీరిలో చాలామంది వృద్ధులు కూడా ఉంటారు. ఇటీవల ఓ వందేళ్లు పైబడిన వృద్ధురాలు కాలినడకన ఏడుకొండలు ఎక్కి శ్రీవారిని దర్శించుకున్న వార్త వైరల్ అయ్యింది. ఇలా స్వామివారిపై భక్తితో తిరుమలకు వచ్చే వృద్ధులు రద్దీ కారణంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసింది టిటిడి. 65 ఏళ్లు పైబడిన ముసలివారికి ప్రత్యేక మార్గంలో దర్శనం కల్పిస్తారు... ఈ క్యూలైన్ లో ఏమాత్రం రద్దీ ఉండదు. అందుకే కేవలం 30 నిమిషాల్లోనే శ్రీవారిని దర్శించుకుని ఆలయంలోంచి బయటకు రావచ్చు.
అయితే ఈ దర్శనం రోజంతా ఉండదు... కొన్నిగంటలే వృద్ధులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పిస్తారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ దర్శనానికి సమయం కేటాయించారు. 65 ఏళ్లు దాటిన భక్తులు తమ ఫోటో ఐడీ, వయసు ధ్రువీకరణ పత్రాన్ని S-1 కౌంటర్‌లో చూపించాలి. తర్వాత ఆలయానికి కుడివైపు గోడ పక్కన, వంతెన కింద ఉన్న మండపం ద్వారా వెళ్లాలి. ఈ దారిలో ఎలాంటి మెట్లు ఉండవు కాబట్టి, వృద్ధులు సులభంగా నడిచి వెళ్లొచ్చు.
క్యూ లైన్‌లోకి వెళ్లిన తర్వాత మినిమం 30 నిమిషాలు, గరిష్ఠంగా గంటసేపట్లో స్వామివారి దర్శనం పూర్తి చేసుకుని బయటకు రావచ్చు. దర్శనం తర్వాత వృద్ధులందరికీ వేడివేడి సాంబార్ అన్నం, పెరుగు అన్నం, పాలు ఉచితంగా అందిస్తారు. అంతేకాకుండా పార్కింగ్ స్థలం నుంచి కౌంటర్‌కు, అక్కడి నుంచి బయటకు వెళ్లే మార్గం వరకు బ్యాటరీ కార్ల సౌకర్యం కూడా ఉంది.