ఏపీలో మావోయిస్టుల కలకలం: 5 జిల్లాల్లో 50 మందికి పైగా అరెస్ట్.. హిడ్మా ఎన్‌కౌంటర్‌

Published : Nov 18, 2025, 11:49 PM IST

Maoist : విజయవాడ, ఏలూరు సహా ఐదు జిల్లాల్లో భారీ సెర్చ్ ఆపరేషన్‌లో 50 మందికి పైగా మావోయిస్టులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టుల అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌ తర్వాత ఈ దాడుల వేగం పెంచారు.

PREV
15
ఏపీలో మావోయిస్టులు.. వరుస సోదాలతో కలకలం

ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల కదలికలు మళ్లీ పెరిగాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రంలోకి చొరబడిన మావోయిస్టులు ఐదు జిల్లాల్లో తలదాచుకున్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారం అందిన తరువాత పోలీసులు విస్తృతస్థాయి ఆపరేషన్ చేపట్టారు. 

ముఖ్యంగా విజయవాడ న్యూ ఆటోనగర్ ప్రాంతంలో గుర్తించిన 28 మందితో పాటు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 50 మందికి పైగా మావోయిస్టులు అదుపులోకి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ చర్యలు అల్లూరి జిల్లాలో హిడ్మా ఎన్‌కౌంటర్ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే వేగం పుంజుకోవడం ప్రత్యేకంగా నిలిచింది.

25
న్యూ ఆటోనగర్‌లో భారీగా మావోయిస్టుల అరెస్టులు

విజయవాడలోని కానూరు సమీపంలోని కొత్త ఆటోనగర్ ప్రాంతంలో మావోయిస్టులు గుంపులుగా ఉండుతున్నారన్న సమాచారం పోలీసులకు చేరింది. వెంటనే ఆక్టోపస్, ఇంటెలిజెన్స్, గ్రేహౌండ్స్ బృందాలు సంయుక్తంగా భవనాన్ని ముట్టడించి 28 మందిని అదుపులోకి తీసుకున్నాయి. 

వీరిలో 21 మంది మహిళలు ఉన్నట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. అదనంగా, మావోయిస్టు కేంద్ర కమిటీకి భద్రతగా ఉండే తొమ్మిది మంది, హిడ్మా బెటాలియన్ సభ్యులుగా గుర్తించిన 19 మంది కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలిపారు. భవనాన్ని అద్దెకు తీసుకోవడానికి కూలిపనుల పేరుతో వచ్చినట్లు అనుమానిస్తున్నారు.

35
ఏలూరు–కాకినాడల్లో మరిన్ని అరెస్టులు

విజయవాడతో పాటు ఏలూరు గ్రీన్ సిటీ ప్రాంతంలో 15 మంది మావోయిస్టులు అరెస్టయ్యారని సమాచారం. వీరంతా గత వారం రోజుల్లో ఒడిశా దిశ నుంచి వచ్చినట్లు పోలీసుల అనుమానాలు చెబుతున్నాయి. మరోవైపు కాకినాడలో ఇద్దరు మావోయిస్టులు అదుపులోకి వచ్చారు. మొత్తం మీద అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, కాకినాడ జిల్లాలలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరికొంతమంది మావోయిస్టుల ఆచూకీ కూడా లభించడంతో వారి కోసం ప్రత్యేక బృందాలు సెర్చ్ చేస్తున్నాయి.

45
హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత ఏపీలో వరుస సెర్చ్ ఆపరేషన్లు

మారేడుమిల్లి అడవుల్లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా, అతని భార్య రాజే సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. హిడ్మా మరణం మావోయిస్టు దళాలకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. 

ఈ ఘటన అనంతరం ఆయన డైరీలో లభించిన వివరాలు, ప్రత్యేకంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన డంప్‌లు, తలదాచుకునే ప్రదేశాలు, కీలక సభ్యుల పేర్లు పోలీసులకు మరింత స్పష్టత కలిగించాయి. అందువల్లే రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే సంయుక్త ఆపరేషన్లు ప్రారంభించారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

55
మావోయిస్టుల ప్రణాళికలు భగ్నం.. దర్యాప్తు ముమ్మరం

అరెస్టయిన వారంతా ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చినవారేనని ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. ఇందులో కొందరు సానుభూతిపరులు, మిలీషియా సభ్యులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వారు ఏపీలో ఉద్యమాన్ని మళ్లీ పునర్నిర్మించడానికి ప్రయత్నించారని అధికారులు చెబుతున్నారు. సేకరించిన ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాల పరిమాణం కూడా పెద్దదిగా ఉండటంతో, వీటి ఆధారంగా మరిన్ని డంప్‌లను గుర్తించేందుకు బృందాలు సెర్చ్ లు జరుపుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ కగార్ పర్యవేక్షణలో మళ్లీ మావోయిస్టుల కదలికలను అణచివేయడానికి పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. అరెస్టయినవారి వివరాలు, వారి వ్యూహాలు, భవిష్యత్తు ప్రణాళికలు అన్ని అంశాలపై విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు అధికారికంగా త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories