Hidma encounter: దేశంలో మావోయిజాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోన్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక విజయాన్ని అందుకుంది. మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా మరణించాడు.
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో మంగళవారం తెల్లవారుజామున 6 గంటలకు భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. టైగర్ జోన్‌లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో హిడ్మాతో సహా మరో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.
25
హిడ్మా కదలికలపై ఇంటెలిజెన్స్ అలర్ట్
అటవీ ప్రాంతాల్లో అగ్రనేతలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం లభించడంతో భద్రతా దళాలు ముందస్తు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం కూంబింగ్ పార్టీలకు మావోయిస్టు బృందం ఎదురుపడడంతో ఘర్షణ తీవ్రత పెరిగింది. ఈ ఆపరేషన్ లో హిడ్మా, అతని భార్య సహా ఆరుగురు మిలిటెంట్లు మరణించారని సతెలుస్తోంది.
35
ఇంతకీ ఎవరీ హిడ్మా.?
సుక్మా జిల్లా పూవర్తి ప్రాంతంలో జన్మించిన హిడ్మా 17 ఏళ్ల వయసులోనే దళ సభ్యుడిగా చేరాడు. గోండి, తెలుగు, కోయ, హిందీ, బెంగాలీ భాషలపై మంచి పట్టు ఉండటంతో మావోయిస్టు కమిటీలలో వేగంగా ఎదిగాడు. హింసాత్మక దాడులలో ముందుండటం వల్ల పార్టీలో అతడికి ప్రత్యేక స్థానం ఏర్పడింది. నెంబర్ వన్ బెటాలియన్ ఆదేశాలు పూర్తిగా హిడ్మా ఆధీనంలో ఉండేవి. ఈ బెటాలియన్ దాడుల వేగం, దారుణం కారణంగా చత్తీస్‌ఘడ్ అడవుల్లో భయపెట్టే శక్తిగా మారింది.
చింతల్నార్ ఘటనలో 75మంది CRPF సిబ్బంది ప్రాణాలు కోల్పోవడానికి హిడ్మా ప్రణాళికే కారణం. 2017 బూర్కపాల్ ఎటాక్ లో కూడా అతడి పాత్ర ఉందని అప్పట్లో మావోయిస్టు నేతలే ప్రకటించారు. శత్రు బలగాల పై భారీ బృందాలను ఒకేసారి దాడికి దింపడం హిడ్మా ప్రత్యేకత. అతడు టార్గెట్ పెట్టాక తప్పించుకోవడం కష్టం అనే అభిప్రాయం మావోయిస్టు వర్గాల్లో బలంగా ఉండేది. చత్తీస్‌ఘడ్‌లో గత ఇరవై ఏళ్లలో జరిగిన అతిపెద్ద హింసాకాండల్లో హిడ్మా పాత్ర ప్రముఖమైంది. అందుకే పోలీసుల హిట్ లిస్టులో హిడ్మా ఉంటూ వచ్చాడు. ఇందులో భాగంగానే హిడ్మాపై ప్రభుత్వం ఏకంగా కోటి రూపాయల రివార్డ్‌ను ప్రకటించింది. అదే విధంగా అతని భార్యపై రూ. 50 లక్షల రివార్డ్ ఉంది.
55
పార్టీలో విభేదాలు
హిడ్మా కదలికలు చాలా గోప్యంగా ఉండేవి. అసలు హిడ్మా ఎలా ఉంటాడో తెలియకుండా అతని ఫొటోలు కూడా బయటకు రాకుండా వ్యవహరించేవాడు. అలాంటి వ్యక్తిని కేంద్ర కమిటీలోకి తీసుకోవడంపై మావోయిస్టు వర్గాల్లో పెద్ద చర్చ జరిగింది. సిద్ధాంత పరంగా కాకుండా హింసాత్మక దాడుల ద్వారా ఎదిగిన వ్యక్తికి పెద్ద బాధ్యతలు ఇవ్వడం సరైనదా అనే ప్రశ్నలు అప్పట్లో వచ్చాయి. ఇన్ఫార్మర్ల పేరుతో జరిగిన అమానుష హత్యల్లో హిడ్మా పాల్గొన్నాడనే ఆరోపణలు పలు సార్లు వినిపించాయి. రాత్రింబవళ్లు ఓ దళం హిడ్మాకు కాపలా కాసేదని సమాచారం.
గతంలోనూ పలుసార్లు వార్తలు
ఇదిలా ఉంటే హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మరణించాడంటూ గతంలోనూ పలుసార్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత అవి తప్పుడు వార్తలని తేలింది. అంతేకాకుండా చాలాసార్లు ఎన్‌కౌంటర్ల నుంచి హిడ్మా తప్పించుకున్నాడు. కాగా తాజాగా హిడ్మా మృతదేహానికి సంబంధించిన ఫొటోలు బయటకు రావడం, అధికారులు సైతం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో హిడ్మా మరణించిన విషయం స్పష్టమవుతోంది.