ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన భారీ వర్షాలు కురవడంతో గోదావరి, కృష్ణాలతో పాటు ఇతర నదుల ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. ముఖ్యంగా కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం డ్యామ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6.50 లక్షల క్యూసెక్కులు, నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6.17 లక్షల క్యూసెక్కులు, పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 6.31 లక్షల క్యూసెక్కులు , ఔట్ ఫ్లో 6.16 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6.62 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోంది... దీంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ వరద ప్రవాహం 7 లక్షల క్యూసెక్కులకు చేరే అవకశాలున్నాయని.. ఈ వరదనీరు తగ్గేవరకు లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక గోదావరి నదిలో కూడా వరదప్రవాహం పెరుగుతోందని... భద్రాచలం వద్ద 49.80 అడుగులు, కూనవరం వద్ద 19.31 మీటర్లు, పోలవరం వద్ద 12.21 మీటర్లకు నీటిమట్టం చేరిందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.