Published : Nov 17, 2025, 07:14 AM ISTUpdated : Nov 17, 2025, 07:27 AM IST
IMD Cold Wave and Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే గజగజలాడించే చలిగాలులు వీస్తున్నాయి. వీటికి వర్షాలు తోడయ్యే అవకాశాలున్నాయట. బంగాళాఖాతంలో ఒకటి రెండు కాదు ట్రిపుల్ అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
IMD Weather Update : తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుపాను బీభత్సం తర్వాత వర్షాలు లేవు. వాతావరణం పొడిగా మారి ఉష్ణోగ్రతలు పడిపోతూ చలి మొదలయ్యింది. అయితే రాబోయే రోజుల్లో ఈ చలిగాలులకు వర్షాలు తోడయ్యే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే గతంలో వాన, ఇప్పుడు చలి ఇబ్బంది పెడితే... త్వరలో చలివాన బీభత్సం ఉంటుందని... తెలుగు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
25
మొదటి అల్పపీడనం
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారిందని ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో ఈ అల్పపీడనం కొనసాగుతోందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉందని తెలిపారు. వీటి ప్రభావంతో దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA అధికారులు సూచించారు.
ఇలా నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఇవాళ (నవంబర్ 17, సోమవారం) తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. కొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయని హెచ్చరించారు. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు APSDMA ఎండీ ప్రఖర్ జైన్.
35
రెండో అల్పపీడనం
బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం కొనసాగుతుండగానే మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్ధ తెలిపింది. నవంబర్ 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA ప్రకటించింది. దీని ప్రభావంతో నవంబర్ 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఊరటనిచ్చే అంశం ఏంటంటే ఇది వాయుగుండంగా మారే అవకాశం తక్కువగా ఉందని వెల్లడించింది.
ఈ అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని APSDMA తెలిపింది. నవంబర్ 24 నుండి 27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కాబట్టి రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలాగే ప్రస్తుత చలికి ఈ వర్షాలు తోడై ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలుంటాయి.. మరీముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు, చిన్నారులు, ముసలివారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.
నవంబర్ 28 తర్వాత బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావంతో నవంబర్ చివర్లో, డిసెంబర్ ఆరంభంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోతుందని... చలిగాలులతో కూడిన వర్షాలుంటాయని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... నవంబర్ 21 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు. ఆ తర్వాతే వర్షాలుంటాయని వెదర్ మ్యాన్ తెలిపారు.
55
చలికి గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా విసురుతోంది. ఆంధ్ర ప్రదేశ్ లో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో 6-7 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాగే అతితక్కువ ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ తో సహా ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ జిల్లాల్లో కూడా 7-10 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా జిల్లాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. మరో నాలుగైదు రోజులో ఇలాగే చలిగాలులు వీస్తుంటాయని... ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ, వైద్య నిపుణులు.