
Kurnool Bus Accident : రాత్రి హైదరాబాద్ నుండి బయలుదేరిన ప్రయాణికులు తెల్లవారేసరికి ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళుతున్న ఓ ట్రావెల్ బస్సు మంటల్లో చిక్కుకోవడంతో చాలామంది సజీవదహనం అయ్యారు. మరికొందరు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ దుర్ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఈ బస్సులో మంటలు ఎలా చెలరేగాయి? ఎలా వ్యాపించాయి? అనేది తాజాగా పోలీసులు వివరించారు.
హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతంనుండి బెంగళూరుకు కావేరీ ట్రావెల్ బస్సు గురువారం రాత్రి బయలుదేరింది. బస్సు సిబ్బందితో పాటు మొత్తం 43 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. హైదరాబాద్ దాటగానే చాలామంది ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నారు... మొత్తంగా తెల్లవారుజామున డ్రైవర్ ఒక్కరు తప్ప అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఈ సమయంలో జరిగిన చిన్న ప్రమాదం ఈ స్థాయిలో ప్రాణనష్టం సృష్టించిందని డిఐజి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
బస్సు కర్నూల్ జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర హైదరాబాద్-బెంగళూరు హైవేపై వేగంగా వెళుతుండగా ఓ బైక్ అడ్డువచ్చింది… దీంతో దాన్ని ఢీకొట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే బైక్ ఉన్నవ్యక్తి రోడ్డుపక్కన పడిపోయాడు... కానీ ఆ బైక్ మాత్రం బస్సు కింద చిక్కుకుపోయిందట. దీంతో తీవ్ర రాపిడి జరిగి నిప్పురవ్వలు పుట్టి పెట్రొల్ ట్యాంక్ పేలింది… దీంతో బస్సు ముందుభాగంలో మంటలు వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇలా యాక్సిడెంట్, ఆ వెంటనే మంటలు చెలరేగడంతో బస్సు డ్రైవర్, ఇతర సిబ్బంది భయంతో కిందకు దిగిపోయారు... ప్రయాణికులను అలర్ట్ చేయలేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా గాలి ఎక్కువగా ఉండటంతో క్షణాల్లో బస్సు మొత్తాన్ని వ్యాపించాయి.
బస్సులో ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉండగా ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉందని పోలీసులు చెబుతున్నారు. మంటలు చుట్టుముట్టడంతో నిద్రలేచి తప్పించుకునే ప్రయత్నం చేసేలోపే చాలామంది సజీవదహనం అయ్యారు. కొందరు ప్రయాణికులు మాత్రం ఎమర్జెన్సీ డోర్, విండోస్ బ్రేక్ చేసి తప్పించుకున్నారు. మరికొందరు తీవ్ర గాయాలతో బైటపడ్డారు. బస్సు ఢీకొట్టడంతో బైక్ పై వెళుతున్న వ్యక్తి కూడా మరణించాడని... అతడి మృతదేహం బస్సుప్రమాద ప్రాంతంలోనే రోడ్డుపక్కన పడివుందని డిఐజి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 43 మంది ఉన్నారు... వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు 11 మంది మరణించినట్లు పోలీసులు నిర్దారించారు... మరికొందరి ఆఛూకీ లేదు కాబట్టి వారుకూడా మరణించి వుంటారని భావిస్తున్నారు. కాబట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. 23 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బైటపడ్డట్లు పోలీసులు చెబుతున్నారు.
తీవ్ర గాయాలతో కొందరు ప్రయాణికులు బైటపడ్డారు... ఘటనాస్థలికి చేరుకున్న వెంటనే వీరిని దగ్గర్లోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. ఇక చిన్నచిన్న గాయాలపాలైనవారిని అక్కడే ప్రథమ చికిత్స అందించారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపైనే బస్సు దగ్దం కావడంతో హైదరాబాద్-బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది... పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
కర్నూల్ బస్సు ప్రమాదంలో మృతిచెందినవారిలో ఎక్కువమంది హైదరాబాద్ కు చెందినవారే ఉన్నట్లు సమాచారం. తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం జరగడంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబాయ్ లో ఉన్న ఏపీ సీఎం ప్రమాదంగురించి తెలిసిన వెంటనే అధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు... వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసాయం అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కర్నూల్ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకి సానుభూతి తెలిపారు. చీఫ్ సెక్రటరీ, డిజిపితో మాట్లాడిన సీఎం ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. వెంటనే బాధిత కుటుంబాల సహాయార్థం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. బాధితులను హైదరాబాద్ కు తరలించేందుకు... మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్నాట్లు చేయాలని రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.
1. జయసూర్య
2. రామిరెడ్డి
3. అకీరా
4. సత్యనారాయణ
5. వేణుగోపాల్ రెడ్డి
6. హారిక
7. శ్రీలక్ష్మి
8. నవీన్ కుమార్
9. అఖిల్
10. జస్మిత్
11. రమేష్
12. సుబ్రహ్మణ్యం
హైదరాబాద్- బెంగళూరు హైవేపై కర్నూల్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడినవారి వైద్య ఖర్చుల కోసం రూ.50 వేలు ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.