Kakinada Blast : 18 మంది మృతి.. కాకినాడ పేలుడు వెనుక అసలు కారణం ఇదేనా?

Published : Feb 28, 2026, 04:13 PM ISTUpdated : Feb 28, 2026, 04:17 PM IST

Kakinada Blast : ఏపీలోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడులో 18 మంది కార్మికులు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది.

PREV
12
కాకినాడ జిల్లాలో పెను విషాదం: పేలుడు ధాటికి చెల్లాచెదురైన మృతదేహాలు

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో శనివారం మధ్యాహ్నం పెను విషాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెం - జి.మేడపాడు గ్రామాల మధ్య ఉన్న 'సూర్యశ్రీ ఫైర్ వర్క్స్' అనే బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 18 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవ దహనమైనట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. మందుగుండు సామగ్రి తయారు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ఈ ఘోరం జరిగింది. పేలుడు ధాటికి మృతదేహాలు, శరీర భాగాలు సమీపంలోని పంట పొలాల్లోకి ఎగిరిపడటం అక్కడి భీతావహ పరిస్థితికి అద్దం పడుతోంది.

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు.. ఎగసిపడుతున్న మంటలు

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సామర్లకోట, కాకినాడ నుంచి అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, తయారీ కేంద్రంలో భారీగా పేలుడు పదార్థాలు నిల్వ ఉండటంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ప్రమాద సమయంలో సుమారు 20 నుంచి 30 మంది కార్మికులు లోపల ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం. గాయపడిన ఐదుగురిని వెంటనే స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

22
స్పందించిన సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్

ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లాలని హోం మంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. మరోవైపు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాణాసంచా కేంద్రాల్లో భద్రతా ప్రమాణాల అమలుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

పునరావృతమవుతున్న ప్రమాదాలు.. గత చేదు జ్ఞాపకాలు

కాకినాడ జిల్లాలో బాణాసంచా కేంద్రాల్లో ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2014లో వాకతిప్పలో జరిగిన ప్రమాదంలో 18 మంది మృతి చెందగా, గత ఏడాది రాయవరంలో జరిగిన పేలుడులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నిబంధనలకు విరుద్ధంగా, పరిమితికి మించి పేలుడు పదార్థాలను నిల్వ ఉంచడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

Read more Photos on
click me!

Recommended Stories