Flight: తిరుపతి, విజయవాడ నగరాల మధ్య ప్రయాణించే వారికి విమానయాన సంస్థ ఫ్లై91 (FLY91) కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో రెండు నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణ సౌకర్యం ఏర్పడింది. కేంద్రమంత్రి రామ్మోహన్ గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు.
తిరుపతి-విజయవాడ రూట్‌లో ఫ్లై91 విమానాలు వారానికి నాలుగు రోజుల పాటు నడవనున్నాయి. మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం ప్రయాణికులకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఉదయం వేళల్లోనే రెండు నగరాల మధ్య రాకపోకలు సాగించేలా షెడ్యూల్ రూపొందించారు. రోడ్డు లేదా రైలు మార్గంలో ఎక్కువ సమయం పట్టే ప్రయాణాన్ని తక్కువ వ్యవధిలో పూర్తి చేసుకునే అవకాశం ప్రయాణికులకు లభిస్తుంది. ముఖ్యంగా తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులతో పాటు వ్యాపార, ఉద్యోగ అవసరాల కోసం విజయవాడ-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే వారికి ఈ కనెక్టివిటీ ఉపయోగపడనుంది.
24
ఫ్లైట్ టైమింగ్స్ ఇవే
ఫ్లై91 షెడ్యూల్ ప్రకారం తిరుపతి విమానాశ్రయం నుంచి విమానం ఉదయం 8.05 గంటలకు బయలుదేరి 9.15 గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. అదే విమానం విజయవాడ నుంచి ఉదయం 9.45 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభించి 10.50 గంటలకు తిరుపతికి చేరుతుంది. అంటే విమాన ప్రయాణ సమయం సుమారు గంటపాటు ఉంటుంది. ఉదయం ప్రయాణించాలనుకునే వారికి ఈ సమయాలు అనుకూలంగా ఉండనున్నాయి. టికెట్ ధరలు సాధారణంగా రూ.3,000 నుంచి రూ.3,500 మధ్య ఉండే అవకాశం ఉంది. అయితే బుకింగ్ సమయం, ప్రయాణ తేదీని బట్టి ఛార్జీల్లో మార్పులు ఉండొచ్చు.
34
రాజమండ్రికి కూడా కొత్త కనెక్టివిటీ
తిరుపతి నుంచి రాజమండ్రికి కూడా ఫ్లై91 మరో విమాన సేవను ప్రారంభించింది. ఈ రూట్‌లో సోమవారం, బుధవారం, శుక్రవారం విమానాలు నడుస్తాయి. దీంతో తిరుపతిని రాష్ట్రంలోని మరో కీలక నగరంతో నేరుగా అనుసంధానించే అవకాశం ఏర్పడింది. ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే భక్తులకు ఈ కొత్త మార్గాలు ప్రయాణ సౌకర్యాన్ని పెంచనున్నాయి. విజయవాడ, రాజమండ్రి వంటి ప్రధాన నగరాలతో తిరుపతి విమాన కనెక్టివిటీ విస్తరించడం ద్వారా రాష్ట్రంలో విమాన ప్రయాణానికి మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది.
తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ కనెక్టివిటీని మరింత పెంచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ముఖ్యంగా తిరుపతి నుంచి కువైట్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సేవ అందుబాటులోకి వస్తే తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతానికి చెందిన విదేశీ ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. మరోవైపు గన్నవరం విమానాశ్రయాన్ని కూడా భవిష్యత్తులో మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని గన్నవరం ఎమ్మెల్యే, విప్ యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. అంతర్జాతీయ విమానయాన సంస్థలైన ఎమిరేట్స్, ఖతర్ ఎయిర్‌వేస్, లుఫ్తాన్సా వంటి సంస్థల సేవలు కూడా గన్నవరం నుంచి అందుబాటులోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. గత కొన్నేళ్లలో గన్నవరం విమానాశ్రయం గణనీయంగా అభివృద్ధి చెందిందని, రాబోయే రోజుల్లో మరింత విస్తరణ అవసరమని తెలిపారు.