
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే వాయుగుండంగా మారింది... ఇది ఆదివారం (అక్టోబర్ 26) కు తీవ్ర వాయుగుండంగా, సోమవారంకు (అక్టోబర్ 27) తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ తుపానుకు 'మొంథా' గా నామకరణం చేశారు. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోనే తీరందాటే అవకాశాలున్నాయి… కాబట్టి రాష్ట్రప్రజలు మరీముఖ్యంగా తీరప్రాంతావాళ్లు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.
ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని... ఇది గంటకు 7 కి.మీ వేగంతో కదులుతోందని APSDMA తెలిపింది. ప్రస్తుతం ఈ వాయుగుండం పోర్ట్ బ్లెయిర్ కి 440 కి.మీ, విశాఖపట్నంకి 970 కి.మీ, చెన్నైకి 970 కి.మీ, కాకినాడకి 990 కి.మీ, గోపాల్‌పూర్ కి 1040 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ రేపటికి తీవ్ర వాయుగుండంగా... ఎల్లుండి ఉదయానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
ఇలా సోమవారం ఏర్పడనున్న మొంథా తుపాను మంగళవారానికి (అక్టోబర్ 28) మరింత బలపడుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇదేరోజు రాత్రి ఈ తుపాను తీరం దాటుతుందని...ఇప్పటికయితే మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపింది. తీరందాటే సమయంలో గరిష్టంగా గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి... కాబట్టి తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.
ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి... ఈ వాయుగుండం, తుపాను ప్రభావంతో ఇవి మరికొన్నిరోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మొంథా తుపాను ఏర్పాటుతర్వాత అత్యంత భారీ వర్షాలు మొదలవుతాయని... అక్టోబర్ 27 నుండి 29 వరకు కుండపోత తప్పదని హెచ్చరిస్తోంది. ఈ వర్షాలకు బలమైన ఈదురుగాలులు కూడా తోడయి మరింత ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరిస్తోంది ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ.
మొంథా తుపాను ప్రభావం కోస్తాంద్ర, రాయలసీమ జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ, కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లా లో మోంతా తుపాను బీభత్సం సృష్టించే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది. మిగతా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలుండటంతో రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్ చేసింది ప్రభుత్వం.
మొంథా తుపాను ఏపీవైపు దూసుకువచ్చే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అవుతోంది. ఇప్పటికే హోంమంత్రి వంగలపూడి అనిత విపత్తు నిర్వహణ సంస్థ అధికారులతో మాట్లాడి పరిస్థితి ఎలా ఉండనుందో తెలుసుకున్నారు. దీంతో తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల కలెక్టర్లకు అలెర్ట్ జారీ చేశారు... ఎన్టిఆర్ఎఫ్, ఎస్టిఆర్ఎఫ్ తో పాటు అత్యవసర విభాగాల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అత్యవసరం సాయం కోసం APSDMA కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రందించాలని ప్రజలకు సూచించారు హోంమంత్రి.
ప్రస్తుతం హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి... మరో రెండ్రోజులు ఇదేస్థాయి వర్షాలు కొనసాగుతాయని... సోమవారం రాత్రి లేదా మంగళవారం నుండి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి జిల్లాలో ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.