చంద్రబాబు దుబాయ్ పర్యటనతో జరిగేది ఇదే.. ఏపీలోని ఈ ప్రాంతాల రూపురేఖలు మారడం ఖాయం

Published : Oct 25, 2025, 03:31 PM IST

Chandrababu UAE Tour: ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మూడు రోజుల యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ ప‌ర్య‌ట‌న ముగించుకొని తిరిగి వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో చంద్రబాబు ఈ మూడు రోజులు ఏం చేశారు.? ఈ టూర్‌తో ఏపీకి జ‌రిగే లాభ‌మేంటో బిగ్ స్టోరీలో తెలుసుకుందాం. 

PREV
15
ఆర్థిక అవకాశాల దిశగా చంద్రబాబు యూఏఈ పర్యటన

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని బృందం మూడు రోజుల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ పర్యటనలో ఏపీలోని పెట్టుబడి అవకాశాలను, మౌలిక వసతుల ప్రాధాన్యతను, అభివృద్ధి దిశగా తీసుకున్న చర్యలను చంద్రబాబు వివరిస్తూ పలు అంతర్జాతీయ సంస్థలను ఆకట్టుకున్నారు. దుబాయ్, అబుధాబీ, షార్జా ప్రాంతాల్లో జరిగిన సమావేశాల్లో ఆయన "ఆంధ్రప్రదేశ్ - భారత్‌లో భవిష్యత్తు రాష్ట్రం" అని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ పర్యటనతో ఏపీలో భారీగా పెట్టుబడులు రానున్నాయ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

25
యూఏఈ కంపెనీల ఆస‌క్తి

చంద్రబాబు సమావేశమైన యూఏఈ ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు ముందుకొచ్చారు.

* శోభా గ్రూప్ అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంథాలయాన్ని స్థాపించేందుకు రూ.100 కోట్ల విరాళం ప్రకటించింది.

* ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ దుగరాజపట్నం వద్ద షిప్ బిల్డింగ్ యూనిట్ నిర్మించేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేసింది.

* షరాఫ్ గ్రూప్ లాజిస్టిక్స్ పార్కులు, గిడ్డంగులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

* బుర్జిల్ హెల్త్ కేర్ వైద్య రంగంలో పెట్టుబడులు పెట్టనుంది.

* జీ42 టెక్నాలజీ సంస్థ ఏఐ డేటా సెంటర్లు, స్మార్ట్ గవర్నెన్స్ ప్రాజెక్టులపై ఆసక్తి చూపింది.

ఈ నిర్ణయాలు ఏపీకి ప్రత్యక్ష పెట్టుబడులు మాత్రమే కాకుండా, ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ ప్రమాణాల పరిశ్రమల ఏర్పాటుకు దారితీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

35
ప్రాంతాల వారీగా ప్రత్యేక ప్రణాళికలు

చంద్రబాబు తన పర్యటనలో 25కి పైగా సమావేశాల్లో పాల్గొని, రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి ప్రత్యేక పెట్టుబడి ప్రణాళికను వివరించారు. చంద్ర‌బాబు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..

ఉత్తరాంధ్ర: ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా అభివృద్ధి.

విశాఖపట్నం: గూగుల్ ఏఐ డేటా సెంటర్ కోసం 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి.

రాయలసీమ: పునరుత్పాదక ఇంధనం, ఏరోస్పేస్, సెమీ కండక్టర్ పరిశ్రమలకు ప్రాధాన్యం.

గోదావరి జిల్లాలు: ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా, టూరిజం రంగాలపై దృష్టి.

అమరావతి: దేశంలో తొలి "క్వాంటం వ్యాలీ" స్థాపనకు ఏర్పాట్లు.

ప్రతీ ప్రాంతంలో "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" విధానాన్ని అమలు చేస్తామని, పెట్టుబడిదారులు ఎదుర్కొనే అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

45
ప్ర‌వాసాంధ్రుల‌తో స‌మావేశం

యూఏఈ విదేశీ వాణిజ్య మంత్రి థానీ బిన్ అహ్మద్, ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్‌లతో జరిగిన సమావేశాలు ఏపీకి వ్యూహాత్మకంగా కీలకమయ్యాయి. ఇద్దరు మంత్రులు కూడా ఏపీలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించేందుకు తమ ప్రతినిధులను పంపుతామని తెలిపారు. దుబాయ్‌లో జరిగిన తెలుగు డయాస్పోరా సమ్మేళనంలో గల్ఫ్ దేశాల నుంచి వేలాది మంది ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దుబాయ్ ఇండియన్ కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ మాట్లాడుతూ, "కియా మోటార్స్ వంటి పెట్టుబడులు ఏపీలో సాధ్యమైనందుకు చంద్రబాబు కృషి కార‌ణ‌మ‌ని" ప్రశంసించారు. అలాగే యూఏఈలోని పారిశ్రామికవేత్తలను వచ్చే నెలలో విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు చంద్రబాబు ఆహ్వానించారు.

55
ప్రవాసాంధ్రుల కోసం భీమా పథకం

ప్రవాస భారతీయుల భద్రతను దృష్టిలో ఉంచుకొని చంద్ర‌బాబు ప్రత్యేక భీమా ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించారు. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులకు రూ.10 లక్షల భీమా రక్షణ ఉంటుంద‌ని తెలిపారు. న్యాయ సమస్యలకు ఎన్నార్టీ సొసైటీ ద్వారా లీగల్ కౌన్సిలింగ్, డాక్యుమెంటేషన్, అడ్వకేట్ ఫీజు సహాయం అందిస్తామ‌న్నారు. "వన్ ఫ్యామిలీ, వన్ ఎంట్రప్రెన్యూర్" పిలుపుతో ప్రతి కుటుంబం రాష్ట్రంలో ఒక పరిశ్రమ స్థాపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంద‌ని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రవాసాంధ్రుల గౌరవమే ఏపీ గౌరవమ‌న్న చంద్ర‌బాబు, వారి భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి శిఖరాలకు తీసుకెళ్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories