
Cyclone Montha : గత నాలుగైదు రోజులుగా బంగాళాఖాతంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. శనివారం (అక్టోబర్ 25న) అల్పపీడనం ఏర్పడి ఆదివారం(అక్టోబర్ 26న) వాయుగుండంగా… సోమవారం(అక్టోబర్ 27న) తుపానుగా, మంగళవారం(అక్టోబర్ 28న) తీవ్ర తుపానుగా మారింది... గత రాత్రి ఈ మొంథా తుపాను తీరం దాటింది. ఇలా సముద్రంలో వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా ఉండటంతో మత్స్యకారులను చేపలవేటకు వెళ్లరాదని ప్రభుత్వం సూచించింది. దీంతో ఈ నాలుగైదురోజులు ఉపాధి ఆగిపోవడంతో మత్స్యకారులకు ఆదాయం లేకుండాపోయింది… ఆ పేదకుటుంబాల పోషణ భారంగా మారింది.
వేట నిషేధమే కాదు మొంథా తుపాను తీరందాటే సమయంలో వీచిన బలమైన ఈదురుగాలులు, కురుస్తున్న భారీ వర్షాలు తీరప్రాంతాల్లోని మత్సకార గ్రామాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇలా తుపాను కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నిరుపేద మత్స్యకార కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇప్పటికే ప్రతి కుటుంబాలకు 50 కిలోల చొప్పున బియ్యం, ఇతర ఆహార సామాగ్రి అందించే ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అంతేకాదు మత్స్యాకారులకు ఆర్థిక సాయం కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది.
మొంథా తుపాను ప్రభావిత జిల్లాల్లో గత కొద్దిరోజులుగా ఉపాధిలేక ఇబ్బందిపడుతున్న మత్స్యకారులకు ఐదువేల చొప్పున ఆర్థికసాయం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అంగీకారం తెలిపారట. అయితే ఈ ఆర్థికసాయంపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు... కాబట్టి మత్స్యకారులకు సాయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
మొంథా తుపాను కారణంగా ఇళ్లూవాకిలి వదిలి పునరావాస కేంద్రాల్లో ఉంటున్న బాధితులకు అన్ని రకాలుగా ఆదుకుంటామని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పునరావాస కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆహారం, మంచినీటితో ఇతర సౌకర్యాలు కూడా కల్పించింది. ఇంతేకాకుండా తుపాను కారణంగా కలిగిన నష్టానికి పరిహారంగా పునరావాస కేంద్రంలోని ప్రతి కుటుంబానికి రూ.3000 ఆర్థిక సాయం చేస్తోంది... అలాగే ఒక్కో కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు అందిస్తోంది. ఈమేరకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
మొంథా తుపాను కారణంగా ఎక్కువగా నష్టపోయేది రైతులే... అందుకే బాధిత అన్నదాతలను కూడా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ వర్షాలు, వరదలు, ఈదురుగాలుల కారణంగా దెబ్బతిన్న పంటలను ప్రభుత్వమే మద్దతుధరతో కొనేలా ఏర్పాట్లు చేస్తోంది. మొదట పత్తి కొనుగోలును ప్రారంభించింది.
ఆంధ్ర ప్రదేశ్ లో 2025-26 సంవత్సరానికి 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరిగిందని... సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని అంచనా వేస్తున్నారు వ్యవసాయ అధికారులు. అయితే మొంథా తుపాను కారణంగా పత్తి తడిసి పాడయిపోయే పరిస్థితి నెలకొంది... దీంతో దిగుబడి తగ్గి రైతులు నష్టపోతారు. ఇలా జరక్కుండా ఉండేందుకు వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది చంద్రబాబు సర్కారు... రాష్ట్రవ్యాప్తంగా 30 కొనుగోలు కేంద్రాల ద్వారా క్వింటాలుకు కనీస మద్దతుధర రూ.8110 చెల్లించి పత్తిని సేకరిస్తోంది ప్రభుత్వం.
పత్తి రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల ద్వారా తమ వివరాలను సీఎం యాప్ లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత "కపాస్ కిసాన్" యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుని దానికి తగినట్లు పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కూటమి ప్రభుత్వం సూచిస్తోంది.
భయంకరమైన మొంథా తుపానును కూటమి ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొంది. స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర మంత్రులు, అధికారులు గత రెండుమూడు రోజులుగా తుపాను సమయంలో తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలపైనే పనిచేశారు. ప్రజలకు ముందుగానే వాతావరణ పరిస్థితులపై సమాచారం అందించడం... ప్రమాదం పొంచివున్న ప్రాంతాలకు ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ ను మొహరించడం, అత్యవసర సేవల విభాగాలను అప్రమత్తం చేయడం చేశారు. దీంతో గతరాత్రి మొంథా తుపాను తీరందాటినా పెద్దగా నష్టమేమీ జరగలేదు.
తుపాను ప్రమాదం పొంచివున్న దాదాపు 1328 గ్రామాల్లో ప్రజలను ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించింది ప్రభుత్వం. అన్ని సౌకర్యాలతో 1906 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. అలాగే ప్రసవాలకు దగ్గరగా ఉన్న 3,465 మంది గర్భిణీలను హాస్పిటళ్ళకు తరలించింది. మత్స్యకారులను వేటకు వెళ్ళకుండా నిషేధం విధించింది. 11 NDRF, 12 SRDF టీమ్ లు సిద్ధంగా ఉంచింది. తుపాను గాలికి చెట్లు విరిగిపడితే వెంటనే వాటిని తొలగించేలా 145 వుడ్ కటింగ్ టీమ్స్ రెడీగా ఉంచింది. ఇలాంటి ముందుస్తు చర్యలతో మొంథా తుపాను ప్రమాదాన్ని తగ్గించింది ప్రభుత్వం.