
Cordelia Cruises : బంగాళాఖాతం తీరంలో వెలిసిన అందమైన నగరం విశాఖపట్నం. ఈ సముద్రపు ఒడ్డున కుటుంబంతో లేదా స్నేహితులతో గడిపేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు... ఆ అలలు సవ్వడి, ఆ సముద్ర అందాలను చూసి మంత్రముగ్దులు అవుతుంటారు. సముద్రపు నీటిలో దిగి సరదాగా జలకాలాడి కొందరు... ఇసుక తిన్నెలపై కూర్చుని ముచ్చ ట్లాడుతూ మరికొందరు హాయిగా గడుపుతుంటారు.
ఇలా తీరంలోనే ఇంత ఆహ్లాదరకరమైన వాతావరణం ఉంటే సముద్రంలో ఇంకెలా ఉంటుంది. నీలిరంగులో మెరిసిపోయే నీటి అలలపై తేలుతూ ప్రకృతి అందాలు, పర్యాటక స్థలాలను చూస్తూ సాగే ఆ ప్రయాణం ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇది సకల సౌకర్యాలు కలిగిన క్రూయిజ్ లో ప్రయాణమంటే... ఆ ఊహే అదిరిపోలా..! ఇలా తెలుగు ప్రజలకు జీవితంలో మరిచిపోలేని సముద్రయానాన్ని అందించేందుకు కార్డేలియా క్రూయిజ్ సిద్దమయ్యింది.
భారతదేశంలోని ప్రధాన సముద్రతీర నగరాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల అందాలను పర్యాటకులకు పరిచయం చేస్తోంది కార్డేలియా క్రూయిజ్. శ్రీలంక, సింగపూర్, థాయిలాండ్, మలేషియా దేశాలకు సముద్రమార్గంలో పర్యాటక సేవలు అందిస్తోంది. ఇక దేశవ్యాప్తంగా ముంబై, చెన్నై, కొచ్చి, గోవా, లక్షద్వీప్ తో పాటు ఏపీలోని వైజాగ్ లో కూడా ఈ క్రూయిజ్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.
ఇవాళ(బుధవారం) ఈ కార్డేలియా క్రూయిజ్ తమిళనాడు పర్యాటకులతో విశాఖపట్నం చేరుకుంటుంది. పోర్టులో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ కు పర్యాటకులతో చేరుకుంటుంది... నగరంలోని పర్యాటక అందాలను వీక్షించిన తర్వాత సాయంత్రం 4 గంటలకు పుదుచ్చెరికి పయనం అవుతుంది. వైజాగ్ నుండి తెలుగు పర్యాటకులు కూడా సముద్ర ప్రయాణాన్ని ఆస్వాదించేందుకు, పుదుచ్చెరి అందాలను చూసేందుకు పయనం అవుతారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సముద్ర పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగానే ఈ కార్డేలియా క్రూయిజ్ ప్రయాణాన్ని వర్చువల్ గా ప్రారంభించనున్నారు. వైజాగ్ ను పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో ఇలాంటి చర్యలు ఎంతగానో ఉపయోగడతాయి... అందుకే నెలలో మూడుసార్లు ఈ కార్డేలియా క్రూయిజ్ విశాఖకు వచ్చేలా ప్లాన్ చేశారు.
ఈ కార్డేలియా క్రూయిజ్ జూన్ 30న చెన్నైలో పర్యాటకులతో బయలుదేరింది... రెండ్రోజుల ప్రయాణ తర్వాత నేడు(జులై 2, బుధవారం) విశాఖపట్నం చేరుకుంది. సాయంత్రం ఇక్కడ తెలుగు పర్యాటకులను ఎక్కించుకుని జులై 4న ఉదయం పుదుచ్చెరి చేరుకుంటుంది. అక్కడి నుండి తిరిగి జులై 5న చెన్నై చేరుకుంటుంది. ఇంతటితో ఓ ట్రిప్ ముగుస్తుంది.
ఇలా ప్రతినెలా ఈ కార్డేలియా క్రూయిజ్ మూడు ట్రిప్పులు వేస్తుంది... అంటే మూడుసార్లు విశాఖపట్నంకు వస్తుందన్నమాట. ఈ నెలలో ఇవాళ విశాఖకు ఈ క్రూయిజ్ చేరుకుంది... మళ్లీ జులై 9, 16 తేదీల్లో ఇక్కడికి వస్తుంది. ఈసారి కార్డేలియా ప్రయాణాన్ని మిస్ అయినవారు తర్వాతి యాత్ర కోసం రెడీగా ఉండండి.
కార్డేలియా క్రూయిజ్ లో ఆహ్లాదకర వాతావరణంలో రెండ్రోజుల సముద్ర ప్రయాణం ఉంటుంది. విశాఖపట్నం నుండి బయలుదేరే క్రూయిజ్ పుదుచ్చెరికి చేరుకున్నాక అక్కడ వివిధ రకాల పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ఆద్యాత్మిక ప్రాంతాలను ఇష్టపడేవారు మనకుల వినయగర్ ఆలయం, అరబిందో ఆశ్రమం సందర్శించవచ్చు. అలాగే అందమైన ఫ్రెంచ్ కాలనీలు, అద్భుతమైన బీచ్ లను సందర్శించవచ్చు.
ఇక ప్రకృతి అందాలను ఇష్టపడేవారు చున్నంబర్ బోట్ పాయింట్ నుండి తమ యాత్రను ప్రారంభించాలి. అందమైన పారడైస్ బీచ్ లో గడపుతూ అందాలను ఆస్వాదించవచ్చు. ఈ సముద్ర తీరంలో ఇష్టమైనవారితో నడుస్తూ కబుర్లు చెప్పుకుంటే ఆ అనుభూతి అద్భుతంగా ఉంటుంది.
పుదుచ్చెరి చరిత్రను, అక్కడి కల్చర్ ను తెలుసుకోవాలంటే ఫ్రెంచ్ కాలనీలను సందర్శించాలి. అక్కడ ఒకేరకంగా నిర్మించిన ఇళ్లు, వాటి ఆర్కిటెక్చర్, ఆ వీధులు ఎంతో ఆకట్టుకుంటాయి. అలాగే ఫ్రెంచ్ వార్ మెమోరియల్, చర్చిలు, పురాతన భవనాలను సందర్శించవచ్చు.
యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపుపొందిన పురాతక ఆలయం మహబలిపురం కూడా సందర్శించవచ్చు. అక్కడి అరుదైన కట్టడాలు, ఆద్యాత్మిక వాతావరణం ఆకట్టుకుంటుంది. ఇది సుసంపన్న చారిత్రక వైభవాన్ని తెలియజేస్తుంది.