Chandrababu Dussehra Gift: దసరా సందర్భంగా ఆటో డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. వాహనమిత్ర పథకం కింద ఈ సహాయం అందుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అనంతపురంలో జరిగిన ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ సభలో ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా రూ.15,000 ఆర్థిక సాయం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయం తగ్గవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో, వారికి భరోసా కల్పించేందుకు ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు.
25
ఆటో డ్రైవర్లపై స్త్రీశక్తి పథకం ప్రభావం
ఆగస్టు 15, 2025 నుండి అమల్లోకి వచ్చిన స్త్రీశక్తి పథకం కింద రాష్ట్రంలో 2.62 కోట్ల మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పొందుతున్నారు. ఈ పథకం రూ.1,942 కోట్ల వ్యయంతో అమలవుతున్నదనీ, ఇది మహిళల విద్య, ఉపాధి, వ్యాపారాలకు ఎంతో ఉపయోగపడుతోందని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే, దీని ప్రభావం ఆటో డ్రైవర్లపై పడకూడదన్న ఉద్దేశంతో వాహనమిత్ర పథకం కింద రూ.15,000 సాయం అందిస్తామని ఆయన వెల్లడించారు.
35
గతంలో 10 వేలు
మునుపటి వైసీపీ ప్రభుత్వం వాహన మిత్ర పేరుతో ఆటో, ట్యాక్సీ, మాక్సి క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి రూ.10,000 అందించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని పెంచి రూ.15,000 పెంచింది. దసరా రోజున ఈ సహాయం నేరుగా ఆటో డ్రైవర్ల ఖాతాల్లో జమ అవుతుందని ప్రకటించారు. అలాగే, రూ.2.5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కూడా అందిస్తామని సీఎం స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. “సంక్షేమం అనేది ఓట్ల కోసం చేసే రాజకీయం కాదు. అది ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచే సాధనం. మేము ఇచ్చిన హామీలను కచ్చితంగా నిలబెట్టుకుంటాం” అని పేర్కొన్నారు. ఇప్పటికే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం-2, మెగా డీఎస్సీ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేశామని, రైతులకు ఎప్పటికప్పుడు యూరియా, గిట్టుబాటు ధర, మైక్రో న్యూట్రియెంట్స్ అందిస్తున్నామని వివరించారు.
55
ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కూటమి శక్తి
అనంతపురం సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు పీవీఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. సభలో ప్రజలకు గత 15 నెలల్లో కూటమి సాధించిన విజయాలను, సంక్షేమ పథకాల వివరాలను తెలియజేశారు. “మూడు పార్టీల ఐక్యతే ఈ రాష్ట్ర అభివృద్ధి బాట” అని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా ఇచ్చే రూ.15,000 సాయం, ప్రభుత్వ సంక్షేమ దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.