ఆ ఊరి పేరు బలభద్రపురం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి తూర్పుగోదావరి జిల్లాలో పచ్చని పంటలతో కళకళలాడుతూ ఉండేది ఆ గ్రామం. బిక్కవోలు మండల పరిధిలో ఉండే ఈ ఊరిలో రైతులు సంవత్సరానికి మూడు పంటలతో ఆనందంగా జీవించేవారు. అయితే పలు ప్రఖ్యాత కంపెనీలు ఆ ఊరి చుట్టుపక్కల ప్రొడక్షన్ యూనిట్లు ప్రారంభించాయి. అప్పటి నుంచి వారికి కష్టాలు మొదలయ్యాయి. గ్రామంలోని చాలా మంది ఆ కంపెనీల్లోనే చిన్న ఉద్యోగస్థులుగా, కార్మికులుగా పనిచేస్తున్నారు. దీని వల్ల వారు అభివృద్ధి చెందకపోగా, రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.
కేవలం 10 వేల మంది జనాభా ఉన్న ఆ ఊరిలో ఇప్పుడు సుమారు 200 మంది క్యాన్సర్ బాధితులు ఉన్నారని గ్రామస్థులు, నాయకులు చెబుతున్నారు. దీన్నిబట్టి ఆ ఊరిలో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత మందికి క్యాన్సర్ సోకడానికి కారణాలను విశ్లేషిస్తే అనేక కోణాలు వెలుగు చూశాయి.
స్థానికులు చెబుతున్న విషయాలను బట్టి బలభద్రపురంలో కాలుష్యం కోరలు చాచింది. ఈ గ్రామానికి చుట్టుపక్కల అనేక ఫ్యాక్టరీలు వెలిశాయి. వాటి నుంచి వచ్చే వ్యర్థ జలాలు కాలువల్లో, భూగర్భంలో కలిసిపోవడం వల్ల నీటి కాలుష్యం ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ వల్ల కూడా గాలి కలుషితమై శ్వాసకోస సంబంధ వ్యాధులు సోకాయని గ్రామస్థులు చెబుతున్నారు.
స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లో ఈ అంశం ప్రస్తావించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బలభద్రపురంలో గత రెండేళ్లుగా ప్రజలు తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్నారని, ఎక్కువ మంది క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారని ఆయన తెలియజేశారు. రెండేళ్లలో ఎంతో మంది చనిపోయారని, గత ఏడాది కాలంలోనే సుమారు 21 మంది క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పారు. ఈ పరిస్థితికి కారణం బలభద్రపురానికి చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీలే కారణమని ఆయన ఆరోపించారు. ప్రజలను రక్షించాలని ఆయన కోరడంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు గ్రామంలో అందరికీ క్యాన్సర నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి కూడా ఈ విషయంపై ఆరా తీస్తున్నారు. డాక్లర్లు, కేన్సర్ వ్యాధి నిపుణులు గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. 31 వైద్య బృందాలు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నాయి. ఆ గ్రామంలో ఇప్పటికే 23 మంది క్యాన్సర్ రోగులు చికిత్స పొందినట్టు కలెక్టర్ వెల్లడించారు. భూగర్భ జలాలు, వాయు కాలుష్యం వల్లే క్యాన్సర్ విజృంభిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది కూడా చదవండి 6-6-6 నడక అంటే ఏంటో తెలుసా? ఈ ఒక్క వాకింగ్ రూల్‌తో పూర్తి ఆరోగ్యం