Siddarth Nandyala
Artificial Intelligence (AI) : కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ... ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న పదం. ఆధునిక సాంకేతికతను కొత్తపుంతలు తొక్కిస్తూ మరో టెక్నాలజీ విప్లవానికి నాంది పలుకుతోంది ఈ ఏఐ. దీన్ని ఉపయోగించిన ఇప్పటికే అనేక రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. తాజాగా మెడికల్ రంగంలోనూ ఈ ఏఐ ఎంటర్ అయ్యింది... మనిషి ప్రాణాలు కాపాడేందుకు ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇలా ఏఐని వైద్యరంగంలో ఉపయోగించవచ్చని ప్రపంచానికి చాటిచెప్పింది మన తెలుగబ్బాయే.
అమెరికాలో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించిన సిద్దార్థ్ నంద్యాల చిన్న వయసులోనే ప్రపంచమే తనవైపు చూసేలా చేసుకున్నారు. ఏఐ సాయంతో పనిచేస్తూ గుండెజబ్బులను గుర్తించే సరికొత్త స్మార్ట్ యాప్ ను తయారుచేసాడు. ఇలా ప్రాణాలు కాపాడేందుకు టెక్నాలజీ రూపొందించిన ఈ బాలుడు ప్రపంచంలోనే అతి చిన్న వయస్కుడైన సర్టిఫైడ్ ఏఐగా గుర్తింపు పొందాడు.
Siddarth Nandyala
ఎవరీ సిద్దార్థ్? ఎక్కడివాడు?
ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లా సిద్దార్థ స్వస్థలం. అతడి తండ్రి మహేష్ కుటుంబంతో కలిసి 2010 లోనే అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అక్కడే సిద్దార్థ్ జన్మించాడు. తల్లిదండ్రులు మంచి విద్యావంతులు కావడంతో చిన్నతనం నుండే సిద్దార్థ్ చదువులో చురుగ్గా ఉండేవాడు. అలాగే అతడు టెక్నాలజీపై మక్కువ చూపించడంతో తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సహించారు.
ఇలా తన ఇష్టం, పేరెంట్స్ ప్రోత్సాహంతో సిద్దార్థ ఆధునిక టెక్నాలజీపై పట్టు సాధించాడు. ఈ క్రమంలోనే టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అతడి దృష్టి పడింది. అయితే ఈ టెక్నాలజీని వైద్యరంగంలో ఉపయోగించి మనిషి ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన తట్టింది. ఇదే ఇప్పుడు సిద్దార్థను ప్రపంచానికి పరిచయం చేసింది.
సిద్దార్థ తన మేదస్సుతో సరికొత్త కృత్రిమ మేధను రూపొందించాడు. అతడు రూపొందించిన ఏఐ ఆధారిత యాప్ మనిషి గుండె సమస్యలను గుర్తిస్తుంది. ఇలా ఈసిజిలు, ఎకో వంటి ఖరీదైన వైద్యపరీక్షలు లేకుండానే గుండెలో ఏదయినా సమస్య ఉంటే గుర్తించవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా కేవలం మీ స్మార్ట్ ఫోన్ లోని యాప్ ద్వారా ఎవరివారు గుండె పనితీరును పరీక్షించుకోవచ్చు. ఇలా సిద్దార్థ్ వైద్యరంగానికి టెక్నాలజీని జోడించి సృష్టించిన ఈ యాప్ టెక్ దిగ్గజాల ప్రశంసలను అందుకుంటోంది.
Circadiav APP
సర్కాడియన్ యాప్ ఎలా పనిచేస్తుంది :
సిద్దార్థ్ గుండె సమస్యలను గుర్తించేందుకు ఏఐ ఆధారంగా పనిచేసే 'సర్కాడియన్' యాప్ ను రూపొందించారు. ఇది కేవలం 7 సెకన్లలోనే గుండె పనితీరును అంచనా వేస్తుంది. హార్ట్ బీట్ ఆధారంగా గుండె పనితీరులో ఏదయినా సమస్య ఉంటే ఈ యాప్ అలర్ట్ చేస్తుంది. ఈ యాప్ ను ఉపయోగించేవారి గుండెలో ఏదయినా సమస్య ఉంటే వెంటనే రెడ్ లైట్ వెలిగి 'అబ్నార్మల్ హార్ట్ బీట్' అంటూ అలర్ట్ వస్తుంది.
ఇలా సిద్దార్థ్ రూపొందించిన సర్కాడియన్ యాప్ ను అమెరికాలో 15000 మందిపై పరీక్షించారు. అలాగే భారతదేశంలో మరో 700 మందిపై పరీక్షించారు... ఇందులో ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిజిహెచ్ లో గుండె సమస్యలతో బాధపడుతున్నవారు ఉన్నారు. ఈ పరీక్షల్లో సర్కాడియన్ యాప్ 93 శాతం ఖచ్చితత్వంతో పనిచేస్తోందని తేలింది.
ఈ యాప్ ను ఉపయోగించడం ద్వారా ఏదయినా గుండె సమస్య ఉంటే ముందుగానే గుర్తించవచ్చు. కాబట్టి వెంటనే హాస్పిటల్ కు వెళ్లి చికిత్స పొందడం ద్వారా ప్రాణాలు కాపాడుకొవచ్చు. ఇలా అతి చిన్నవయసులోనే మనిషి ప్రాణాలు కాపాడే టెక్నాలజీని రూపొందించిన సిద్దార్థ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నానా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు అతడిని ప్రశంసించారు.
వయసకు మించిన మేధస్సు కలిగి ఏఐతో అధ్భుతాలు చేస్తున్న సిద్దార్థ్ స్వరాష్ట్రానికి, సొంత ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చాడు. తన యాప్ ను తెలుగు ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ ఏఐ సదస్సులో పాల్గొని తన సర్కాడియన్ యాప్ ను ప్రదర్శించాడు. ఈ చిన్నపిల్లాడి తెలివి చూసి యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోయింది.