ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆసియాలోనే అతిపెద్ద బెవరేజ్ ప్లాంట్‌.. వేలాది మందికి ఉద్యోగాలు

Published : Nov 24, 2026, 05:26 PM IST

AP Investment: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో రాయలసీమ మరో కీలక ఘట్టానికి వేదికైంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన భారీ పానీయాల తయారీ పరిశ్రమలో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

PREV
14
ఏడాదిలోనే నిర్మాణం పూర్తి.. ఉత్పత్తి ప్రారంభం

ఓర్వకల్లులో ఏర్పాటు చేసిన ఈ భారీ పరిశ్రమకు 2025 నవంబర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. కేవలం 12 నెలల వ్యవధిలోనే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ కాంపా కోలాతో పాటు వివిధ రకాల పండ్ల రసాలు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తయారీ ప్రారంభమైంది. ఈ ప‌రిశ్ర‌మ ఆసియాలోనే అతిపెద్ద బెవరేజ్ ప్లాంట్‌గా గుర్తింపు పొందింది.

24
కాంపా కోలాకు రాయలసీమ కొత్త కేంద్రం

ఒకప్పుడు భారతీయుల ఆదరణ పొందిన కాంపా కోలా బ్రాండ్ ఇప్పుడు కొత్త ఉత్సాహంతో మార్కెట్లో తన స్థానాన్ని విస్తరించుకుంటోంది. ఓర్వకల్లు ప్లాంట్ ఈ బ్రాండ్ ఉత్పత్తులకు కీలక తయారీ కేంద్రంగా మారనుంది. ఇక్కడ తయారయ్యే పానీయాలను దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపించడంతో పాటు విదేశీ మార్కెట్లకు కూడా ఎగుమతి చేయనున్నారు. తద్వారా రాయలసీమ నుంచి తయారైన ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించే అవకాశం ఉంది. స్వదేశీ బ్రాండ్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమైన కేంద్రంగా ఎదగడం విశేషం.

34
స్థానిక యువతకు సొంత ప్రాంతంలోనే ఉద్యోగాలు

ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల రాయలసీమ యువతకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సంస్థల్లో పనిచేసే అవకాశం లభిస్తోంది.

1,200 మందికి ప్రత్యక్ష ఉపాధి.. వేలాది మందికి పరోక్ష ప్రయోజనం

ఓర్వకల్లు ప్లాంట్ ద్వారా సుమారు 1,200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. వీటితో పాటు రవాణా, గిడ్డంగుల నిర్వహణ, వ్యవసాయ అనుబంధ రంగాలు, ప్యాకేజింగ్, ఇతర చిన్న పరిశ్రమలకు కూడా వ్యాపార అవకాశాలు పెరగనున్నాయి. ఈ రంగాల ద్వారా వేలాది మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. స్థానికంగా వ్యాపార కార్యకలాపాలు పెరగడం వల్ల చిన్న వ్యాపారులు, రవాణా రంగ కార్మికులు, ఇతర సేవలందించే వారికి కూడా ఆదాయం పెరుగుతుంది. ఒక భారీ పరిశ్రమ ఏర్పాటుతో అనేక అనుబంధ రంగాలు అభివృద్ధి చెందడానికి ఈ ప్రాజెక్ట్ దోహదపడనుంది.

44
ప్రతి జిల్లాకు పారిశ్రామిక అభివృద్ధి విస్తరణే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌పై విశ్వాసంతో భారీ పెట్టుబడులు పెట్టిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు మంత్రి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఓర్వకల్లు పరిశ్రమ ప్రారంభం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తూ పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి మారాలని, పరిశ్రమలే వారి ప్రాంతాలకు వచ్చేలా అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. రాయలసీమతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

Read more Photos on
click me!

Recommended Stories