ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల సందడి నెలకొంది... ఒకేసారి స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిని నిర్వహిస్తోంది కూటమి ప్రభుత్వం. ఇలా ఇప్పటికే మున్సిపల్ తో పాటు ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు ముగిశాయి. ఇక పంచాయితీ ఎన్నికలే మిగిలాయి... మూడు విడతల్లో ఈ ఎన్నికలను కూడా పూర్తిచేసేందుకు ఇప్పటికే షెడ్యూల్, నోటిఫికేషన్లు వెలువడ్డాయి.
అయితే నవంబర్ 26న అంటే ఈ గురువారం మొదటి విడత ఎన్నికల్లో భాగంగా కీలకమైన పోలింగ్ జరగనుంది. మొత్తం 3949 గ్రామ పంచాయితీల్లో మొదట ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడింది... ఇందులో 758 ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 3191 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి... ఈ గ్రామాల్లో గురువారం పోలింగ్ జరగనుంది.
మొదటి విడత పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, ఆఫీసుల్లోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ జరిగే 3191 గ్రామ పంచాయితీల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఉంటుంది. ఇలా స్కూల్ విద్యార్థులకు ఊహించని సెలవు వస్తోంది. అయితే ఈ సెలవు కేవలం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసే విద్యాసంస్థలకే వర్తిస్తుంది... మిగతా స్కూల్స్ యధావిధిగా నడుస్తాయి.
పోలింగ్ డిటెయిల్స్
నవంబర్ 26న (గురువారం) ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం అవుతుంది... మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. పోలింగ్ సిబ్బందికి లంచ్ బ్రేక్ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది... పలితాలను అదే రోజు ప్రకటించనున్నారు. ఉప సర్పంచ్ ఎంపిక కూడా పోలింగ్ రోజునే ఉంటుంది. మొదటి విడతలో 3,191 సర్పంచ్ స్థానాలకు 9,052 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.